Deepam Controversy: తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదంపై సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ స్పందించారు. అధికార టీవీకే ప్రభుత్వం, సీఎం విజయ్‌పై ఈ సందర్భంగా ఆయన నిప్పులు చెరిగారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యంగా అభివర్ణించారు. మత సామరస్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆలయ ధర్మకర్తల మండలిని రద్దు చేయడం, కొండపై కేంద్ర బలగాలను బలగాలను మోహరించడం, రాష్ట్ర సీఎస్ సహా ఉన్నతాధికారులు స్వయంగా హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించడంపై స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి ఆలయ ట్రస్టీలపై నెపం నెడుతూ పిరికితనంతో వెనుకడుగు వేసిందని విమర్శించారు.
ఆలయ నిర్వహణ బాధ్యతను సుప్రీంకోర్టు సూచించిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లేలా విజయ్ ప్రభుత్వం చేసిందన్నారు. దీని ద్వారా ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న రాష్ట్ర హక్కులను ప్రభుత్వం తాకట్టు పెట్టిందని స్టాలిన్ మండిపడ్డారు. గతంలో మోసగాళ్ల చేతుల్లో బందీగా ఉన్న ఆలయాలను ద్రవిడ ఉద్యమం ఎంతో కష్టపడి ప్రజాస్వామ్యబద్ధమైన నియంత్రణలోకి తీసుకొచ్చాయని గుర్తు చేశారు. ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన రాష్ట్ర స్వయంప్రతిపత్తిని ఒకే ఒక్క కేసుతో కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: తిరుమల విజిలెన్స్ అదుర్స్.. పోయిన 60 గ్రాముల బంగారం రికవరీ.. గంటల వ్యవధిలో భక్తుడికి అప్పగింత!
ఈ కీలక అంశంపై ముఖ్యమంత్రి విజయ్ మౌనం వహించడాన్ని స్టాలిన్ ‘చారిత్రక ద్రోహం’గా అభివర్ణించారు. బాధ్యతలను ఇతరులకు అప్పగించి చేతులు దులుపుకునే ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్ర పరిస్థితి ఎలా తయారవుతుందో సుప్రీంకోర్టు జోక్యంతోనే అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ‘ముఖ్యమంత్రి ఒక స్టాండప్ కమెడియన్‌లా మారి తన బాధ్యతలను అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చేశారు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీవీకే ప్రభుత్వాన్ని అసమర్థ ప్రభుత్వంగా ఆరోపించారు.
కాగా మధురై జిల్లా తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభంపై నవంబర్ 24న కార్తీక దీపాన్ని వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే దీనిని బేఖతరు చేస్తూ ఉచ్చిప్పిళ్లైయార్ ఆలయ మండపంపై దీపం వెలిగించారు. దీనిపై శుక్రవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఈ చర్యను కోర్టు ధిక్కరణగా పేర్కొంది. సీఎస్ సహా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఆలయ ట్రస్ట్ సభ్యులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆలయ నిర్వహణ బాధ్యతలను విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్తిబన్‌లకు అప్పగించింది.