DMK Delimitation: వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని డీఎంకే నిర్ణయించింది. గత కొద్ది రోజులుగా ఈ అంశంపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించుతూ.. రాజ్యాంగ సవరణకు అనుకూలంగా ఓటేస్తామని స్పష్టం చేసింది. శనివారం ఉదయం జరిగిన డీఎంకే ఎంపీల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.
సమావేశం అనంతరం పార్టీ ఎంపీ ఏ. రాజా మీడియాతో మాట్లాడారు. కొత్తగా తీసుకురాబోయే డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. సభలోనూ బిల్లుకు మద్దతుగా నిలబడతామని మరో ఎంపీ దయానిధి మారన్ పునరుద్ఘాటించారు. 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే పార్టీ.. తన మద్దతు ప్రకటించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బూస్టప్ లభించినట్లైంది. అయితే ఇదే ఏడాది మార్చిలో బిల్లును వ్యతిరేకంగా ఓటు వేసిన డీఎంకే.. ఈసారి అనుహ్యంగా మద్దతిస్తామని పేర్కొనడంపై రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే బిల్లులో కేంద్రం చేసిన కొన్ని కీలక మార్పుల కారణంగానే మద్దతు ఇచ్చేందుకు డీఎంకే ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ 50 శాతం మేర సీట్లను పెంచే నిబంధనను కేంద్రం బిల్లులో చేర్చింది. అలాగే సీట్ల పెంపును 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ విధించే అంశానికి కూడా కేంద్రం అంగీకరించింది. దీంతో కొత్తగా ఏర్పడే లోక్సభలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.2 శాతం ప్రాతినిధ్య వాటా యథాతథంగా కొనసాగుతుందని డీఎంకే భావిస్తోంది. కాగా, పునర్విభజన తర్వాత తమిళనాడు సీట్ల సంఖ్య ప్రస్తుతమున్న 39 నుంచి 59కి పెరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: Airtel రూ.598 ప్లాన్.. అపరిమిత 5Gతో పాటు నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, జీ5 ఫ్రీ.. వ్యాలిడిటీ ఎంతంటే?
ఇదిలా ఉంటే డీలిమిటేషన్ పై తమ వైఖరి గురించి శుక్రవారమే స్టాలిన్ స్పష్టత ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయడం వల్ల కలిగే ముప్పును తానే మొదట గుర్తించానని తెలిపారు. దీనిపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో చెన్నైలో సమావేశం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. తమిళనాడు ప్రయోజనాలే తమకు ముఖ్యమన్న స్టాలిన్.. లోక్ సభలో తమ రాష్ట్రానికి ఉన్న 7.18 వాటాను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇందుకు తగ్గట్లే డీలిమిటేషన్ బిల్లును కేంద్రం తీసుకొస్తుండటంతో డీఎంకే తన మద్దతు ప్రకటించినట్లు స్పష్టమవుతోంది.
Also Read: రేవంత్, రాహుల్ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు: రాంచందర్ రావు