BigTV English

Antiquities : యాంటిక్విటీల అప్పగింత ఇక సరళం

Antiquities : యాంటిక్విటీల అప్పగింత ఇక సరళం

Antiquities : పురాతన వస్తువులకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇదో బిలియన్ డాలర్ల పరిశ్రమ. పురాతన, కళాఖండాల సేకరణ మార్కెట్ విలువ దాదాపు 50 బిలియన్ డాలర్లు. దీనిలో 5% శాతం అక్రమ వ్యాపారమేనని అంచనా. చోరీ అయిన సాంస్కృతిక సంపద గురించి యునెస్కో, ఇంటర్‌పోల్ ఎప్పటికప్పుడు ఆర్ట్ కలెక్టర్లు, ప్రజలను చైతన్యం చేస్తూనే ఉన్నాయి.


కొవిడ్ సమయంలో పురాతన వస్తువుల స్మగ్లింగ్ బాగా ఊపందుకుంది. రెండేళ్ల వ్యవధిలో స్మగ్లింగ్ అయిన పురాతన వస్తువుల విలువ 10 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చు. ఎంతో విలువైన మన దేశ కల్చరల్ ప్రోపర్టీ అక్రమంగా సరిహద్దులు దాటేసింది. ఇండియన్ ఆర్ట్, పురాతన శిల్పాలకు డిమాండ్‌తో పాటు బలహీనమైన చట్టాలు, నిబంధనల వల్ల అక్రమ దందా జోరుగా సాగుతోంది.

అలా విదేశాలకు చేరిన మన వారసత్వ సంపదకు వెనక్కి తీసుకురావడంలో ప్రభుత్వం గత పదేళ్లలో ఎంతో కృషి చేసింది. 2013-23 మధ్యకాలంలో మొత్తం 400 పురాతన వస్తువులు తిరిగి మనకు దక్కాయి. 2020 తర్వాత వెనక్కి రప్పించుకున్న వస్తువులే 291 వరకు ఉన్నాయి.


విదేశాలకు చేరిన పురాతన వస్తువులను తిరిగి రప్పించే ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటుంది. అందుకు ఎంతో సమయం పట్టేది. అయితే ఆ ప్రక్రియను సరళతరం చేసేలా అమెరికాతో మన దేశం ఒప్పందం చేసుకోనుంది. గతంలో సదరు వస్తువులు మన దేశానికి చెందినవేననే నిరూపించాల్సి వచ్చేది. అందుకు ఆధారంగా ఎన్నో పత్రాలను సమర్పించాల్సి వచ్చేది.

కల్చరల్ ప్రోపర్టీ అగ్రిమెంట్(CPA) అమల్లోకి వస్తే.. అలాంటి సుదీర్ఘ ప్రక్రియకు చెల్లుచీటీ ఇచ్చేయొచ్చు. అంతే కాదు.. ద్వైపాక్షిక సీపీఏతో సాంస్కృతిక సంపద అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న సమయంలో భారత పురాతన వస్తువులు ఏవైనా పట్టుబడిన వెంటనే అమెరికా అధికారులు తిప్పి పంపుతారని, ఇది సీపీఏలో భాగమని వివరించారు.

మరికొన్ని నెలల్లోనే కల్చరల్ ప్రోపర్టీ అగ్రిమెంట్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. భారత్ నుంచి చోరీ అయిన చోళుల నాటి కంచు శిల్పాలు సింగపూర్ చేరాయి. వాటి ధ్రువీకరణ కోసం భారత పురాతత్వ శాఖ(ASI) బృందం ఒకటి అక్కడికి వెళ్లి.. వాటిని పరిశీలించనుంది. అలాగే మరో బృందం.. అమెరికా ఆధీనంలో ఉన్న 1414 పురాతన వస్తువుల పరిశీలన కోసం వెళ్లనుంది.

1977-79 మధ్యకాలంలో 3 వేల వరకు అపురూప కళాఖండాలు భారత్ నుంచి చోరీ అయ్యాయి. అదే దశాబ్దంలో 50 వేలకుపైగా స్మగ్లింగ్‌కు గురయ్యాయని యునెస్కో అంచనా. ఇలా చోరీ అయి.. అక్రమ మార్గంలో తమ దేశానికి చేరిన భారత కళాఖండాల్లో 400 వరకు అమెరికా మనకు తిరిగి అప్పగించింది.

అమెరికా ఇప్పటివరకు 40 దేశాలు, సంస్థలకు చెందిన 20 వేల వస్తువులను ఆయా దేశాలు, సంస్థలకు తిరిగి అప్పగించింది. వీటిలో పెయింటింగ్ లు, రాతి శవపేటికలు, విగ్రహాలు, నాణేలు, రాతప్రతులు వంటివి ఉన్నాయి. వాస్తవానికి అగ్రరాజ్యానికి అఫ్ఘానిస్థాన్, చైనా, కంబోడియా, ఈజిప్టు, గ్రీస్, ఇటలీ, జోర్డాన్, టర్కీ తదితర దేశాలతో 25 కల్చరల్ ప్రోపర్టీ అగ్రిమెంట్లు అమల్లో ఉన్నాయి.

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×