
Voter ID Card: ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం సదరు 5 రాష్ట్రాల ఎలక్షన్ కమిషన్లకు కీలక ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కేంద్ర ఎలక్షన్ కమిషన్ వారికి ఓ లేఖను రాసింది. దాని ప్రకారం…
ఓటరు గుర్తింపు కార్డులోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, తాము పేర్కొన్న ఇతర ఫోటో గుర్తింపు కార్డుల ద్వారా ఓటరు గుర్తింపు గనుక నిర్ధారణ అయితే.. సదరు వ్యక్తికి ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
స్థానిక పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరుండి, వేరే సెగ్మెంట్‌లో జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డుతో వచ్చిన వారిని, తాము పేర్కొన్న జాబితాలోని వేరే ఫోటో గుర్తింపు కార్డు చూసి ఓటేసే అవకాశం ఇవ్వాలని సూచించింది.
ఓటరు జాబితాలో పేరుండి, తెచ్చిన గుర్తింపు కార్డు ద్వారా ఓటరును గుర్తించలేని పరిస్థితి ఉత్పన్నమైతే.. పోలింగ్ ముగిసే సమయానికి తాము సూచించిన ఏదైనా ఫోటో గుర్తింపుకార్డుతో వస్తే.. అతనికి ఓటేసే అవకాశమివ్వాలని పేర్కొంది.
ఓటు వేసే ప్రవాస భారత ఓటర్లు తమ పాస్‌పోర్టును తప్పక చూపాలి. పోలింగ్‌కు కనీసం 5 రోజుల ముందు పోలింగ్ కేంద్రం, వివరాలతో ఓటరు స్లిప్పులు పంపిణీచేస్తారు. అయితే వీటిని ఓటరు గుర్తింపుగా పరిగణించలేమని ఈసీ స్పష్టం చేసింది.
ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు మారటంతో సహా పై కేసుల్లో పోలింగ్ సిబ్బంది.. ఈ క్రింది జాబితాలోని ఫోటో గుర్తింపు కార్డులను ప్రమాణంగా తీసుకోవాలని సూచించింది.
ప్రత్యామ్నాయ ఫోటో ధ్రువీకరణ పత్రాలివే..
ఆధార్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు
బ్యాంకు/పోస్టల్ పాస్ బుక్, ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు
రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా (ఆర్జీఐ).. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎనీ్పఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు
భారతీయ పాస్‌పోర్టు, ఫోటో గల పెన్షన్ పత్రాలు
కేంద్ర/రాష్ట్ర/పీఎస్‌యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు
ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు
కేంద్రం ఇచ్చే యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు (యూడీఐడీ)