Assam govt to table Bill in Assembly to repeal Muslim Marriage Act
అసోం లో హిమంత బిశ్వ శర్మ బీజేపీ సిఎంగా ఉన్నారు. దేశం మొత్తం ఒకటే చట్టం ఉండాలనే యూనిఫాం సివిల్ కోడ్ లో భాగంగా బీజేపీ అధిష్టానం నిర్ణయం మేరకు 1935లో ప్రవేశపెట్టిన ‘ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు’ చట్టం రద్దుకు అసోం గవర్నమెంట్ గురువారం క్యాబినెట్ లో చర్చించి తమ ఆమోద ముద్రను వేసింది. ఇప్పటికే ఉత్తరాఖండ్ లో ఈ చట్టం రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే దారిలో అసోం క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాబోయే వర్షాకాల సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెట్టాలని హిమంత సర్కార్ భావిస్తోంది. గత ఫిబ్రవరి మాసంలో బడ్జెట్ సమావేశాలలోనే అసోం ప్రభుత్వం ఈ కీలక బిల్లును రద్దు చేసింది. ఇప్పుడు చట్టంగా రూపొందబోతోంది. అసలు ఏముంది ఆ చట్టంలో…
ముస్లిం వ్యవస్థలో బాల్య వివాహాలు
మామూలుగా హిందూ వివాహ చట్టం ప్రకారం వధువుకు 18, వరుడుకి 21 సంవత్సరాలు నిండితేనే వారిరువురూ వివాహానికి అర్హులుగా చట్టం అమలవుతూ వస్తోంది. కానీ ఇన్నాళ్లూ ముస్లిం వివాహాల, విడాకుల చట్టం జోలికి ఏ ప్రభుత్వం కల్పించుకోలేదు. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ముస్లిం వివాహాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోనవసరం లేదు. వివాహం చేయబోయే జంటలకు వయసుతో నిమిత్తం లేదు. బాల్య వివాహాలు సైతం చెల్లుబాటు అవుతాయి. ముస్లింలకు ఇప్పటిదాకా ప్రత్యేక రిజిస్ట్రార్ ఉండేవాడు. ఇకపై అందరికీ కామన్ గా ఒకడే రిజిస్ట్రార్ ఉంటాడు. తప్పనిసరిగా రిజిస్ట్రార్ అనుమతితోనే వివాహం జరిగితేనే ఆ వివాహానికి చట్టబద్దత వస్తుంది. ప్రభుత్వ పథకాలు కూడా చట్టబద్దత ఉన్న వివాహాలకు మాత్రమే వర్తిస్తుంది. కేవలం ముస్లిం వర్గాలలో బాల్య వివాహ వ్యవస్థ దురాచారాన్ని రూపుమాపడం కోసమే ఈ చట్టాన్ని తెచ్చామని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చెబుతున్నారు. ఇప్పటికే అసోంలో ప్రత్యేకంగా ముస్లిం రిజిస్ట్రార్ లు ఉన్నాయని..దాదాపు 94 దాకా ఉన్న ఆ కార్యాలయ సిబ్బందికి ఇందుకు గాను రూ.2 లక్షల పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అసోం ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ పర్యవేక్షణలో రాష్ట్రం మొత్తం వివాహాల రిజిస్త్రేషన్లు జరుగుతాయని ప్రకటించారు.
ప్రతిపక్షాల ఫైర్
అయితే ఈ చట్టంపై అక్కడి ప్రతిపక్షాలు రాష్ట్ర సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ఆశించి బీజేపీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే నవంబర్ లో అసోం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అసోంలో హిందూ వర్గాల ఓట్లను గంపగుత్తగా పొందాలనే ఆలోచనతోనే బీజేపీ సర్కార్ ఇలాంటి వివాదాస్పద బిల్లలకు ఆమోదం చెబుతోందని ఆరోపిస్తున్నారు. అసలు కామన్ యూనిఫాం సివిల్ కోడ్ అంతా వివాదాల మయం అన్నారు. దీని వలన మోదీ ముస్లిం వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే ముందు ప్రతిపక్షాల నిర్ణయాలు అవసరం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. భవిష్యత్ లో వచ్చే ప్రజా ఉద్యమాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇందుకు హిమంత సర్కార్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు.