Big Stories

Karnataka: పొలిటికల్ ‘బజరంగ్ బలి’.. మోదీ ఆడిస్తున్న కర్నాటకం!?

- Advertisement -

Karnataka: ఉచిత హామీలు ఇచ్చారు. మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. విషయం అక్కడితో ఆగలేదు. ఇప్పుడు గెలుపు కోసం ఎందాకైనా అంటోంది బీజేపీ. మరోసారి, మత రాజకీయాన్ని కర్నాటకలో రగిలిస్తోంది.

- Advertisement -

జై బజరంగ్ బలి. ఈ నినాదం చుట్టూతా కర్నాటక రాజకీయం తిరుగుతోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ఓ పాయింట్‌ను పట్టుకుని.. పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకుంది బీజేపీ. విద్వేషాలు సృష్టించే ఏ సంస్థనైనా బ్యాన్ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అదిగో.. బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని కాంగ్రెస్ అంటోందని.. ఆ పార్టీకి బజరంగ్ అనే పదంపై ఎందుకంత ద్వేషమని.. మోదీ కిరికిరి స్టార్ట్ చేశారు. ఓటేసే ముందు జై బజరంగ్ బలి అని చెప్పి బటన్ నొక్కాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఇక అంతే. మోదీ ఇలా అన్నారో లేదో.. అలా కర్నాటకలో కాక రేగింది. బజరంగ్ దళ్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి. జై బజరంగ్ బలి నినాదాలతో హోరెత్తించాయి. హనుమాన్ ఆలయాల్లో చాలీసా పారాయణం మొదలుపెట్టాయి. ఒక్కసారిగా కర్నాటక వ్యాప్తంగా భావోద్వేగాలు చెలరేగాయి. అదేకదా కమలనాథులకు కావలసింది కూడా.

జరగబోయే నష్టాన్ని వెంటనే గుర్తించారు కాంగ్రెస్ నేతలు. బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామని మేనిఫెస్టోలో తామెక్కడా చెప్పలేదని వివరణ ఇచ్చుకున్నాయి. అయినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో, పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ మరింత అప్రమత్తం అయ్యారు. మైసూరులోని హనుమాన్ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో హనుమాల్ ఆలయాలను నిర్మిస్తామని మరో కొత్త హామీని అప్పటికప్పుడు ప్రకటించారు. అలా, డ్యామేజీని కాస్త కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ.

కర్నాటకలో ఈసారి కాంగ్రెస్ సర్కారే రాబోతోందని సర్వేలు చెబుతున్నాయి. బీజేపీ ప్రభుత్వానికి అవినీతి మకిలి గట్టిగా అంటుకుంది. విషయం పసిగట్టిన బీజేపీ.. ఇన్నాళ్లూ ఉచితాలను తీవ్రంగా వ్యతిరేకించగా.. కర్నాటకలో మాత్రం ఉచిత గ్యాస్ సిలిండర్లు, పాలు, బియ్యం అంటూ ఫ్రీ బిస్కెట్లు వేసింది. కాంగ్రెస్ సైతం అంతకుమించి ఉచిత హామీలతో ఊదరగొడుతోంది. గ్యారెంటీ కార్డు పేరుతో కాంగ్రెస్ 5 కీలక హామీలు ఇచ్చింది. ప్రతి గృహిణికి 2 వేల నగదు, 10 కిలోల ఉచిత బియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, నిరుద్యోగ భృతి కింద 3 వేల నగదు హామీని మేనిఫెస్టోలో చేర్చింది. రెండు పార్టీలూ ఉచిత హామీలు జోరుగా ఇవ్వడంతో.. ఇంకేదో చేసేందుకు సిద్ధమయ్యాయి బీజేపీ, కాంగ్రెస్.

బీజేపీ మేనిఫెస్టోలో రాష్ట్రంలో ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించింది. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ మేనిఫెస్టోలో విద్వేషాలు సృష్టించే ఏ సంస్థనైనా బ్యాన్ చేస్తామని చేర్చింది. ఇక అంటే. ఇష్యూని బజరంగ్ బలి వైపు టర్న్ చేశారు మోదీ. బాగానే పొలిటికల్ మైలేజ్ సాధించారు. కాంగ్రెస్ సైతం గట్టిగా డిఫెన్స్ బ్యాటింగ్ చేస్తోంది. కర్నాటకలో రాజకీయం బాగా రక్తికడుతోంది. అట్లుంటది బీజేపీతోని.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News