Saayavanam OTT: సైకలాజికల్, సర్వైవల్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా దట్టమైన అడవి నేపథ్యంలో మనుషుల మధ్య జరిగే మోసాలు, నమ్మకద్రోహాలు, అనూహ్య పరిణామాలతో కథ సాగితే ప్రేక్షకులు మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. అలాంటి విభిన్నమైన కథాంశంతో గతేడాది థియేటర్లలో విడుదలైన తమిళ సినిమా ‘సాయవనం’ (Saayavanam) ఇప్పుడు సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు ఏడాది తర్వాత ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేంటి? తెలుగులో ఉందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
దట్టమైన అడవి నేపథ్యంలో సాగే ఈ కథలో సీత (దేవనంద షాజిలాల్) అనే మహిళ ప్రధాన పాత్ర. కుటుంబం, సంప్రదాయాలు, సామాజిక విలువలను గౌరవిస్తూ ప్రశాంతంగా జీవించాలనేది ఆమె కోరిక. భర్త ముత్తు (సౌందర రాజా)తో కలిసి జీవించే సీత జీవితంలో ఒక అనూహ్య ఘటన తుఫాను సృష్టిస్తుంది. ఒక రోజు లారీ కొనడానికి వెళ్లిన ముత్తు తిరిగి ఇంటికి రాడు. ఎంతకాలం ఎదురుచూసినా అతడి ఆచూకీ తెలియకపోవడంతో సీత ఒంటరిగా మిగిలిపోతుంది.
అదే సమయంలో సురుళి (సంతోష్ దామోదరన్) అనే వ్యక్తి ఆమె జీవితంలోకి ప్రవేశిస్తాడు. సీత పరిస్థితిని ఆసరాగా చేసుకున్న అతడు ఆమెతో కలిసి జీవించడం మొదలుపెడతాడు. ఇలా మూడేళ్లు గడిచిపోతాయి. ఇక ముత్తు తిరిగి రాడనే పరిస్థితికి సీత అలవాటు పడుతున్న సమయంలో అనూహ్యంగా అతడు మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు. దీంతో అప్పటివరకు సాగిన ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది.
ముత్తు ఎందుకు కనిపించకుండా పోయాడు? ఇన్నాళ్లూ అతడు ఎక్కడ ఉన్నాడు? తిరిగొచ్చిన తర్వాత సురుళి, ముత్తు మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? ఈ ముగ్గురి జీవితాలను దొంగిలించిన డబ్బు, నమ్మకద్రోహం, ప్రతీకారం ఎలా ప్రభావితం చేశాయి? తనను మోసం చేసినవారిని సీత ఎలా ఎదుర్కొంది? అనేదే ఈ సినిమా అసలు కథ. ఒంటరితనం, మోసం, పగ, విషాదం మధ్య ఒక మహిళ చేసే పోరాటాన్ని అడవి నేపథ్యంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు.
అనిల్ కుమార్ దర్శకత్వం వహించిన ‘సాయవనం’ (Saayavanam) చిత్రంలో దేవనంద షాజిలాల్ సీతగా, సౌందర రాజా ముత్తుగా, సంతోష్ దామోదరన్ సురుళిగా నటించారు. అప్పుకుట్టి, జానకి జయరామన్, వెట్రివేల్ రాజా, మాథ్యూ మాంప్రా తదితరులు కీలక పాత్రలు పోషించారు. డామర్ సినిమా బ్యానర్‌పై సంతోష్ దామోదరన్ నిర్మించగా, పాలీ వర్గీస్ సంగీతం అందించారు. 2025 డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 2026 నవంబర్ 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 2 గంటల నిడివి ఉన్న ఈ చిత్రానికి A సర్టిఫికెట్ లభించింది. తమిళంతో పాటు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.