BJP Hooliganism Kejriwal Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కారణంగా దేశ రాజధానిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తమ కార్యకర్తలపై దాడులు చేస్తూ గూండాయిజం చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన బీజేపీపై తీవ్రంగా విమర్శలు చేశారు.
‘ఢిల్లీలో జరిగే ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తుందనే స్థితి బీజేపీ నాయకులను, ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నిరాశకు గురిచేస్తోంది. అందువల్ల ఆ పార్టీ నేతలు ఆప్ కార్యకర్తలపై బెదిరింపులు, దాడులు చేస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు మేము భయపడం లేదు. బీజేపీకి ఢిల్లీ అభివృద్ధిపై ఎలాంటి అజెండా లేదు. వారికి సీఎం అభ్యర్థి కూడా లేడు. వారికి కేవలం గూండాయిజం మాత్రమే తెలుసు’ అని కేజ్రీవాల్.. బిజేపీ నాయకులకు చురకలంటించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రజలందరూ ఎన్నికల్లో బీజేపీని ఓడించి వారికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
ఎన్నికల కమిషన్‌కు లేఖ
ఇంతకు ముందు, కేజ్రీవాల్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు లేఖ రాశారు. ఆ లేఖలో బీజేపీతో పాటు పోలీసులు కూడా ఆప్ కార్యకర్తలకు పదే పదే బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, న్యూఢిల్లీ నియోజకవర్గానికి స్వతంత్ర ఎన్నికల పరిశీలకులను నియమించాలని, ఆప్ వాలంటీర్లకు భద్రత కల్పించాలని కోరారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.
‘కేజ్రీవాల్ అబద్ధాల ఎన్సైక్లోపీడియా’
‘నా మాటలు రాసుకోండి, హస్తినాపురం సింహాసనంపై బీజేపీ జెండా ఎగురవేయబోతోంది. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాల ఎన్సైక్లోపీడియా’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ లక్ష్యంతో ఆ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేసింది. ఓటర్లను ఆకర్షించేందుకు బీజేపీ అగ్రనేతలు ‘ఏక్ మౌకా బీజేపీ’ (బీజేపీకి ఒక అవకాశం ఇవ్వండి) నినాదంతో నాయకులు ప్రచారం చేస్తున్నారు. దీంతోపాటు ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫిబ్రవరి 5న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే. కేజ్రీవాల్ పాలనపై ఇంతకాలం ప్రజలు భ్రమలో ఉన్నారు. ఇప్పుడు ఆ భ్రమలు తొలగి, వారు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ఈసారి ఆప్‌కు గుణపాఠం చెప్పాలని ఢిల్లీ ప్రజలు నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్ అవినీతి, పాలనా రాహిత్యంతో ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం దేశ రాజధానికి అవసరం’ అని అన్నారు.
‘కేజ్రీవాల్ అబద్ధాల ఎన్సైక్లోపీడియా. ఢిల్లీ ప్రజలు ఇప్పుడు ఆ విషయం ప్రజలు అర్థం చేసుకున్నారు. ఆప్ అవినీతి చేయడానికి కొత్త మార్గాలను ఆప్ అన్వేషిస్తోంది. మద్యం పాలసీ దీనికి ఒక ఉదాహరణ. కేజ్రీవాల్ అవినీతి చేయడానికి వినూత్న పద్ధతులను ఎంచుకున్నారు. అందుకే జైలుపాలయ్యారు’ అని ఆయన ఆరోపించారు.
సీఎం అభ్యర్థి విషయంలో స్పష్టత
ఢిల్లీ సీఎం అభ్యర్థి ఎవరు అనే అంశంపై జేపీ నడ్డా స్పష్టత ఇచ్చారు. ‘ప్రతి రాజకీయ పార్టీకి ఒక వ్యూహం ఉంటుంది. మాకు కూడా వ్యూహం ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో మేము సీఎం అభ్యర్థులను ప్రకటించలేదు. ఢిల్లీలో కూడా అదే పద్ధతి అనుసరిస్తాము’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8న పూర్తికానుంది.