Bomb Script: పట్టణంలోని ఓ మెడికల్ కాలేజీలో బాంబు తయారీ స్క్రిప్ట్ బయట పడటంతో అయోధ్య ఉలిక్కిపడింది. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఓ వైద్య విద్యార్థిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. అయోధ్యలోని రాజర్షి దశరథ్ అటానమస్ స్టేట్ మెడికల్ కాలేజీలోని ఎక్స్-రే గదిలో బాంబు తయారీకి సంబంధించి వివరాలు ఉన్న కాగితాన్ని ఆ విభాగపు ఇన్ ఛార్జ్ శనివారం గుర్తించారు. చేతితో రాసిన ఆ కాగితంలో పేలుడు పదార్థం తయారీకి కావలసిన వివరాలు ఉన్నాయి.
గేజ్ వైర్, అమ్మోనియం కార్బోనేట్, రెడ్ ఫాస్ఫరస్, రెడ్ సల్ఫైడ్, నైట్రిక్ యాసిడ్ వంటి వస్తువుల జాబితా కూడా ఉన్నది. ఆ వెంటనే చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అరవింద్ సింగ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలేజీకి చేరుకున్న పోలీసులు ఆ స్క్రిప్ట్ ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి ఎక్స్-రే గదిలో విధుల్లో ఉన్న మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి సర్ఫరాజ్ ఈ స్క్రిప్ట్ ను రూపొందించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌కు చెందిన అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read: ఏథర్ సూపర్ సర్ ప్రైజ్.. కొత్త EL స్కూటర్ లాంచ్ డేట్ ఫిక్స్!
సర్ఫరాజ్ తో పాటు విధుల్లో ఉన్న మరో ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో మెడికల్ కాలేజీ యాజమాన్యం అప్రమత్తమైంది. కాలేజీ క్యాంపస్‌లో నిఘా పెంచాలని, ప్రాంగణంలోని భద్రతా ఏర్పాట్లపై సమీక్ష జరపాలని సిబ్బందిని ఆదేశించింది. 2025 నవంబర్‌లో ఢిల్లీలో జరిగిన పేలుడును ఈ ఉదంతం గుర్తుకు తెచ్చింది. ఆ కేసులోని ముగ్గురు ప్రధాన నిందితులు ఫరీదాబాద్‌లోని అల్ ఫలా యూనివర్సిటీకి చెందినవారు కావటం గమనార్హం.
Also Read: CJP కి నిధులు ఎలా వస్తున్నాయి? CBICకి ఆర్టీఐ కార్యకర్త సంచలన కంప్లైంట్!