Chennai wedding scandal: ఒకే రోజులో పెళ్లి, ప్రేమ, పరార్, పోలీస్ స్టేషన్.. ఇలా నాటకీయంగా మారిన సంఘటన ఇప్పుడు చెన్నై నగరాన్ని షేక్ చేస్తోంది. అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరైనా ప్రేమలో ఉన్నా లేక పెళ్లి చేసుకుంటున్నా, ముందు రెండుసార్లు ఆలోచించాల్సిందే అనిపించేలా ఉన్న ఈ స్టోరీ చెన్నై వీధుల్లో పెద్ద చర్చకు దారి తీసింది.
చెన్నై నగరంలోని తిరువిక నాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి చేసిన కాసేపటికే వధువు తను ప్రేమించిన వ్యక్తితో పరారైపోవడంతో కుటుంబ సభ్యులు, మిత్రులు, సమాజం మొత్తమే షాక్ కు గురైంది. ఈ సంఘటన చెన్నై నగరంలో పెళ్లిళ్లు, ప్రేమలు, నమ్మకంపై పెద్ద చర్చకే దారి తీస్తోంది.
వివరాల్లోకి వెళితే..
పెరంబూరులోని అంబేద్కర్ నగర్ 3వ వీధికి చెందిన అఖిలన్ – నాగవల్లి దంపతులకు అర్చన అనే 20 ఏళ్ల కుమార్తె ఉన్నారు. ఆమెకు మాధవరం బర్మా కాలనీకి చెందిన విజయకుమార్ అనే యువకుడిని ఎంపిక చేసి, పెద్దల అంగీకారంతో బెసెంట్ నగర్ చర్చిలో శుభముహూర్తాన ఉదయం 6 గంటలకు వివాహం జరిపించారు. రెండు కుటుంబాలు సంతోషంగా ఈ పెళ్లికి అంగీకరించాయి. పెళ్లి అనంతరం, కొత్త వధూవరులను వారి ఇంటికి తీసుకువచ్చారు.
ఇక్కడి నుంచే కథ కొత్త మలుపు
అర్చన తన కుటుంబ సభ్యులకు రిసెప్షన్‌కు ముందుగా బ్యూటీ పార్లర్‌కు వెళ్తున్నా అంటూ చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. కానీ గంటలు గడుస్తున్నా ఆమె తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించారు. ఫోన్లు చేసినా లభించలేదు. ఆ వెంటనే ఆమె స్నేహితులను అడిగితే, ఆమెకు కొంతకాలంగా ప్రేమ వ్యవహారం ఉందని వెల్లడయింది. ఆమె నిజంగా ప్రేమించిన వ్యక్తి పేరు కలై అలియాస్ కలైయరసన్, అతను కొడుంగైయూర్ ఎరుక్కంచెడి ప్రాంతానికి చెందినవాడు.
Also Read: Raynapaadu satellite station: ఏపీలోని ఆ చిన్న రైల్వే స్టేషన్.. ఇకపై మెగాస్టార్.. ఎందుకంటే?
ఇక కుటుంబ సభ్యులకు అంతా స్పష్టమైంది. ప్రియుడితో కలిసి ఆమె పారిపోయినట్టు ఊహించారు. వెంటనే ఆమె తల్లి నాగవల్లి తిరువిగ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి, అర్చనను, ఆమె ప్రియుడిని ట్రేస్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఇద్దరూ తమ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు.
దీంతో, మాధవరం ఆంథోనీ ఆలయంలో సాయంత్రం జరగాల్సిన వివాహ రిసెప్షన్ క్యాన్సిల్ అయింది. దీనిపై విజయకుమార్ కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. వివాహానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం.. కుటుంబ పరువునే నాశనం చేశారంటూ వారు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
అయితే ఉదయం ఒక ట్విస్ట్ జరిగింది. అర్చన తిరువిగ నగర్ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా హాజరై, తన తల్లిదండ్రులకు, భర్త విజయకుమార్‌కు క్షమాపణలు చెప్పింది. “నేను ప్రేమించిందే కలైయరసన్. నాకు ఈ పెళ్లి మీద ఆసక్తి లేదు. కానీ పెద్దల ఒత్తిడితో చేసుకోవాల్సి వచ్చింది. అందుకే వెళ్లిపోయానంటూ ఆమె పేర్కొంది.
వివాహ ఖర్చుల పరిహారం ఇవ్వడానికి అర్చన తల్లిదండ్రులు అంగీకరించడంతో, ఇరు కుటుంబాలు చర్చలతో సమస్యను సద్దుమణిగించారు. పోలీసులు దర్యాప్తును ముగిస్తూ, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. పెళ్లి లాంటి పవిత్రమైన బంధానికి ముందు, యువతీ యువకులు తమ మనసులో ఉన్న విషయాన్ని పెద్దలతో పంచుకోవడం ఎంతో అవసరం. అలాగే కుటుంబ సభ్యులు కూడా పిల్లల అభిప్రాయాలను గౌరవించాలి. లేదంటే ఇలాంటి సంఘటనలు కుటుంబాల పరువును బజారులోకి లాగేయడం ఖాయం.