రేషన్ కార్డ్ లో కానీ, బర్త్ సర్టిఫికెట్ లో కానీ పేరు తప్పుగా ప్రింట్ అయితే వాటిని సరిదిద్దించుకోవడం ఎంత కష్టమో మీకు తెలుసా..? ఆ కష్టం పడినవాళ్లకే అది తెలుస్తుంది. అధికారులు ఓ పట్టాన పట్టించుకోరు, పట్టించుకున్నా సవాలక్ష కండిషన్లు పెడతారు. లాయర్ అఫిడవిట్ అంటారు, ఎమ్మార్వో అటెస్టేషన్ కావాలంటారు. ఇవన్నీ చేసినా ఏదో ఒక సాకు చూపించి పెండింగ్ లో పెడతారు. పేరు తప్పుగా ముద్రించడం సిబ్బంది పొరపాటే అయినా వాటిని సరిదిద్దుకోవడం మన గ్రహపాటుగా మారుతుంది. అలా తప్పుగా ప్రింట్ అయిన తన పేరుని ఓ వ్యక్తి సరిదిద్దుకున్న తీరు ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఆ వీడియో పాతదే అయినా ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారింది.
?utm_source=ig_web_button_share_sheet
అతని పేరు శ్రీకాంత్ కుమార్ దత్తా. ఊరు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని బంకురా. రేషన్ కార్డులో అతని పేరు తప్పుగా ప్రింట్ అయింది. శ్రీకాంత్ కుమార్ వరకు ఓకే, ఆ తర్వాత దత్తా(DUTTA) ప్లేస్ లో KUTTA అని ప్రింట్ అయింది. అంటే D స్థానంలో K ని తప్పుగా ప్రింట్ చేశారనమాట. సహజంగా ఇలాంటి పొరపాటులు దొర్లుతూ ఉంటాయి. అయితే ఇక్కడ అతని పేరు అర్థమే మారిపోయింది. హిందీలో కుక్క అని అర్థం వచ్చేలా శ్రీకాంత్ కుమార్ పేరు మారిపోవడంతో అతను హర్ట్ అయ్యాడు. వెంటనే అధికారుల్ని కలసి తన బాధ చెప్పుకున్నాడు. పేరు మార్చాలంటూ ప్రాధేయపడ్డాడు.
రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరం అయినా కూడా అధికారులు పట్టించుకోలేదు. చివరకు శ్రీకాంత్ కుమార్ విసిగిపోయాడు. రేషన్ కార్డులో తన పేరు చివర కుక్క అని అర్థాన్ని తగిలించినందుకు అతను కుక్కలానే మొరుగుతూ తన నిసరన తెలిపాడు. అధికారుల వాహనం వెంట కుక్కలా భౌభౌ అని అరుస్తూ పరిగెత్తేవాడు. ఇది చూసి అధికారులు షాకయ్యారు. ఆ వింత నిరసన చూసి తమకు తామే సిగ్గుపడి, రేషన్ కార్డులో తప్పు సవరించేలా చర్యలు తీసుకున్నారు. అధికారుల కారు వెంబడి శ్రీకాంత్ కుమార్ కుక్కలా అరుస్తూ పరిగెత్తే వీడియో అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ ఘటన 2022లో జరిగినా ఇప్పటికీ ఇది సంచలనంగానే ఉంది. తాజాగా మరోసారి ఆ వీడియో ఇన్ స్టా లో ప్రత్యక్షమైంది. ఇంకేముంది నెటిజన్లు దాన్ని విపరీతంగా షేర్ చేస్తూ అధికారుల తీరుని ఎండగట్టారు. అతని నిరసనను మెచ్చుకున్నారు.
ఒక సామాన్యుడు సాధించిన విజయంగా ఆ నిరసనను అభివర్ణించారు నెటిజన్లు. శ్రీకాంత్ కుమార్ పై సానుభూతి చూపిస్తూనే నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజంగానే కుక్కకాటు అంత ఘాటుగా ఉందని అంటున్నారు నెటిజన్లు. ఈ కాటుకి అధికారులు దిగివచ్చారని, తప్పుని సవరించారని, ఇలాంటి నిరసన తెలిపిన శ్రీకాంత్ ధైర్యవంతుడని మెచ్చుకున్నారు. పాత వీడియో వైరల్ కావడంతో మరోసారి అందరూ దాన్ని ఆసక్తికరంగా చూస్తున్నారు. గతంలో ఆ ఉదాహరణ తెలిసినవారు, ఇప్పుడే ఆ విషయాన్ని కొత్తగా తెలుసుకున్నవారు కూడా ఆ వీడియోని షేర్ చేస్తూ, కామెంట్లు పెడుతున్నారు.