Big Stories

Brij Bhushan : ఒక్క ఆరోపణ నిరూపించండి.. ఉరేసుకుంటా.. రెజ్లర్లకు బ్రిజ్ భూషణ్ సవాల్..

Brij Bhushan : తనపై ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లకు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సవాల్ విసిరారు. ఒక్క ఆరోపణ నిరూపించినా ఉరేసుకొంటానని స్పష్టం చేశారు. రెజ్లర్లు భజరంగ్‌ పునియా, వినేష్‌ ఫొగాట్‌, సాక్షి మాలిక్‌ సహా చాలా మంది రెజ్లర్లు బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్నారు. జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాలు చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి తప్పించాలని కోరుతున్నారు. ఆయనపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

రెజ్లర్ల ఆరోపణలపై తాజాగా బ్రిజ్ భూషణ్‌ మరోసారి స్పందించారు. ఒక్క ఆరోపణ నిరూపించినా ఉరేసుకొంటానని తేల్చిచెప్పారు. ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ పోలీసుల వద్ద ఉందన్నారు. అందుకే ఈ అంశంపై ఎక్కువ మాట్లాడనని స్పష్టం చేశారు. రెజ్లర్ల వద్ద వీడియో ఆధారం ఉందా అని తొలి రోజు నుంచి అడుగుతున్నానని గుర్తు చేశారు. బ్రిజ్‌ భూషణ్‌ రావణుడి వంటివాడా అని రెజ్లింగ్‌కు సంబంధించిన వారిని ఎవరినైనా అడగండి అని ప్రశ్నించారు. రెజ్లింగ్‌ కోసం 11 ఏళ్లు కష్టపడ్డానన్నారు. ఇలా తన స్పందన తెలియజేస్తూ బ్రిజ్ భూషణ్ వీడియో విడుదల చేశారు.

- Advertisement -

రెజ్లర్లు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు జోక్యంతో ఫిబ్రవరి 28న బ్రిజ్‌ భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇది తమ తొలి విజయం అని రెజ్లర్లు ఆ సమయంలో వ్యాఖ్యానించారు. ఈ అంశంపైనా గతంలో బ్రిజ్‌ భూషణ్‌ స్పందించారు. తాను అమాయకుడినని పేర్కొన్నారు. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానన్నారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకముందని స్పష్టం చేశారు. జంతర్‌ మంతర్‌ వద్ద న్యాయం అందదు. న్యాయం కావాలంటే పోలీస్‌ స్టేషన్లకు వెళ్లండి, కోర్టులను ఆశ్రయించండి అని రెజ్లర్లకు సూచించారు.

మరోవైపు ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. వారికి రైతులు సంఘీభావం ప్రకటించారు. సంయుక్త కిసాన్‌ మోర్చా మద్దతు ప్రకటించింది. వారికి మద్దతుగా జాతీయ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. దీంతో ఢిల్లీలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News