OBC Certificate issue in West bengal(Latest telugu news): పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కోల్ కతా హైకోర్టులో చుక్కెదురయింది. 2010 సంవత్సరంలో ఆమె తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని తప్పుపడుతూ న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 2010 సంవత్సరంలో మమతా బెనర్జీ ప్రభుత్వం ఓబీసీ జాబితా రూపొందించింది. అయితే అప్పట్లో అంతకు ముందున్న 1993 యాక్ట్ ను ఉల్లంఘించి కొత్తగా ఓబీసీ జాబితా రూపొందించింది మమతా బెనర్జీ ప్రభుత్వం. అప్పట్లో ఆమె తీసుకున్న ఏక పక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసలైన ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ కేసు దాఖలయింది. నాడు దాఖలైన కేసుపై 13 ఏళ్ల అనంతరం కోల్ కతా హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
వారి సర్టిఫికెట్లు చెల్లవు
77 ముస్లిం ఉప కులాలకు సంబంధించి ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడంపై న్యాయస్థానం ప్రశ్నించింది. ఏ ప్రాతిపదికన ఇచ్చారో చెప్పలంటూ మమత సర్కార్ ను తప్పుబట్టింది. అంతేకాదు అప్పట్టో ఇష్యూ చేసిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు చెల్లవంటూ కీలక తీర్పునిచ్చింది. కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాలు ఆశించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తూ మమత సర్కార్ తీరుపై కోల్ కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై మమతా బెనర్జీ స్పందిస్తూ ఈ విషయంలో తాము చేసిన పని సమర్థనీయమే అంటూ హైకోర్టు తీర్పుపై మండిపడుతున్నారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళతామని ఆమె అన్నారు.
తీర్పు తప్పుబట్టిన దీదీ
మమతా సర్కార్ తరపున న్యాయవాదులు కూడా హైకోర్టు తీర్పును తప్పుబట్టారు. రిజర్వేషన్ల అంశం ఆయా రాష్ట్రాల పరిధికి సంబంధించిన వ్యవహారం. ఇందులో కోర్టు జోక్యం చేసుకోవడం..పైగా రాజకీయ అంశాలను ప్రస్తావించడం తగదని అంటున్నారు. హైకోర్టే ప్రభుత్వాన్ని నడిపించాలని అనుకుంటోందా? కోల్ కతా హైకోర్టు తన పరిధిని దాటి తీర్పునిచ్చిందని..దీనిపై సుప్రీం కోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు. పశ్చిమ బెంగాల్ మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారమే అన్ని సంఘాలను పరిగణనలోకి తీసుకుని ఓబీసీ రిజర్వేషన్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుందని..13 సంవత్సరాల తర్వాత దానిని తప్పుబట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
వాళ్ల ఉద్యోగాలకు ఢోకా లేదు
ఈ 13 ఏళ్లలో ఓబీసీ రిజర్వేషన్ల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారికి ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు వర్తించదని..ఇకపై కొత్తగా నియామకాలు అయ్యేవారికి మాత్రమే ఈ రిజర్వేషన్ వ్యతిరేక తీర్పు వర్తిస్తుందని కోల్ కతా హైకోర్టు తెలియజేసింది. ఓబీసీ రిజర్వేషన్లపై 2010 సంవత్సరంలో జారీ చేసిన 17 శాతం పెంపును రద్దు చేసింది. దీనితో బీజేపీ శ్రేణులు కోల్ కతా హైకోర్టు తీర్పుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓబీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని మొదటినుంచి తమ పార్టీ తప్పుపడుతునే ఉందని..ఇప్పటికైనా కోర్టు కల్పించుకుని ఓబీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నందుకు సంతోషం అంటున్నారు.
సుప్రీంలోనూ భంగపాటు తప్పదు
మమత సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లినా ఆమెకు భంగపాటు తప్పదని..రాజకీయ ఓటు బ్యాంకుగా ఏకంగా 5 లక్షల మందికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేసిందని..ఈ తీర్పు మమతా సర్కార్ కు చెంపదెబ్బ అని వ్యాఖ్యానిస్తున్నారు. దీనినే మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడితే ఆయనపై ముస్లిం వ్యతిరేక ముద్రను వేస్తున్నారని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.