Karur stampede: గత నెల(సెప్టెంబర్) 27న తమిళనాడులోని కరూర్ జిల్లాలో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందగా, దాదాపు 100 మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. 41 మంది మృతుల కుటుంబాలకు విజయ్ ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారాన్ని అందజేశారు.
ఈ ఘటనలో మరణించిన రమేష్ భార్య శంకవి పెరుమాళ్, నటుడు విజయ్ అందించిన రూ. 20 లక్షల ఆర్థిక సహాయాన్ని తిరస్కరించారు. ఈ మొత్తాన్ని ఆమె ఆర్‌టీజీఎస్ ద్వారా వెనక్కి పంపించారు.
READ ALSO: Dhaka plot to kill Modi: మోదీపై అమెరికా భారీ కుట్ర.. చివరి నిమిషంలో హెచ్చరించిన పుతిన్?
తొక్కిసలాటలో 41 మంది మరణించగా, విజయ్ మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అయితే, బాధితులను పరామర్శించడానికి విజయ్ నేరుగా కరూర్‌కు రాకపోవడం తనను తీవ్రంగా నిరాశపరిచిందని శంకవి ఆవేదన వ్యక్తం చేశారు.
“విజయ్.. కరూర్ వచ్చి మమ్మల్ని పరామర్శిస్తారని భావించాను. కానీ దానికి బదులుగా, సోమవారం మమ్మల్ని మామల్లపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్‌కు పిలిపించారు. నాకు తెలియకుండానే నా భర్త కుటుంబ సభ్యులను టీవీకే నేతలు అక్కడికి తీసుకెళ్లారు. ఆయన కరూర్ రాకపోవడం నన్ను బాధించింది, అందుకే ఆ డబ్బును తిరిగి ఇచ్చేశాను” అని శంకవి స్పష్టం చేశారు.
ఈ ఘటన సోమవారం మామల్లపురంలో విజయ్ బాధితుల కుటుంబాలను కలుసుకున్న రోజే జరగడం గమనార్హం. అయితే, శంకవి నిర్ణయం వెనుక స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిడి ఉండవచ్చని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు.