Congress Tahawwur Rana| 26/11 ముంబైలో జరిగిన ఉగ్ర దాడులకు సూత్రధారి అయిన తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారతదేశానికి తీసుకురావడం జరిగింది. ఇదంతా భారత ప్రభుత్వం.. అమెరికా న్యాయ విభాగంతో జరిపిన దౌత్య చర్చల కారణంగానే సాధ్యమైందని ప్రస్తుతం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే ఈ సందర్బంగా దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ స్పందించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది.
కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యాఖ్యానం ప్రకారం.. తహవ్వుర్ రాణాను అప్పగించే ప్రక్రియను ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రారంభించలేదు. యూపీఏ ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన వ్యూహాత్మక దౌత్య ప్రయత్నాల ఫలితంగా ఈ పరిణామం సాధ్యమైంది. కానీ మోదీ ప్రభుత్వం అంతా తమ ఘన కార్యమేనన్నట్లు శ్రేయస్సు తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది.
“ఈ నిందితుడిని అప్పగించడంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏమీ చేయలేదు. వారికి ఇది ప్రాధాన్యం ఉన్న విషయమే కాదు. ఈ విజయానికి మోదీ ప్రభుత్వం క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ నిజానికి, యూపీఏ (మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో) ప్రభుత్వం అమెరికాతో ఈ నిందితుడిని అప్పగించడం గురించి చర్చలు నడిపింది. దాదాపు పదేళ్ల కాలం పాటు శ్రమించింది. అతనిపై కఠినమైన పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేసింది” అని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం (Chidambaram) తెలిపారు.
ఈ విజయం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాల వల్లనే సాధ్యమైందని చిదంబరం వాదించారు. “26/11 ముంబై దాడులలో పాల్గొన్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ (అమెరికా పౌరుడు), తహవ్వుర్ రాణా (Tahawwur Rana) (పాకిస్థాన్లో జన్మించిన కెనడా దేశస్థుడు), ఇతరులపై మా (కాంగ్రెస్) ప్రభుత్వ కాలంలోనే ఢిల్లీలో ఎన్ఐఏ కేసు నమోదు చేయబడింది. దీని కోసం నవంబర్ 11, 2009 నుండి విచారణ ప్రారంభమైంది. అదే సమయంలో కెనడాతో భారత ఏజెన్సీల మధ్య సమన్వయం కుదిరింది. ఇదంతా యూపీఏ ప్రభుత్వ విదేశాంగ విధానం వల్లనే సాధ్యమైంది. 2011లో అమెరికా కోర్టు అతడిని నిర్దోషిగా విడుదల చేసినప్పటికీ, ఇతర ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నందుకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే అతడు నిర్దోషి కాదని మేము బహిరంగంగా విమర్శించాము, ఈ విషయంలో దౌత్య ఒత్తిడిని కూడా పెంచాము” అని చిదంబరం వివరించారు.
Also Read: బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టిన ఇండియా.. యూనుస్‌కు మోదీ ఝలక్
ముంబై దాడులకు (Mumbai Blast Case) సంబంధించిన మాస్టర్ మైండ్ తహవ్వుర్ రాణాని గురువారం ముంబై నగరంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడికి వైద్యపరీక్షలు నిర్వహించి ప్రత్యేక జైలుకి తీసుకువెళ్లారు. త్వరలో అతడిని తీహార్ జైల్లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తరలిస్తారని.. అక్కడ అతని కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని సమాచారం. ఈ సందర్భంగానే కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు.