ఇండియన్ రైల్వే ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. అమెరికా, చైనా, రష్యా తర్వాత భారత్ కొనసాగుతోంది. సుమారు లక్ష కిలో మీటర్ల మేర రైల్వే లైన్లు, 7400 పైగా రైల్వే స్టేషన్లు, 20 వేలకు పైగా రైళ్లను కలిగి ఉంది. రోజూ సుమారు 2-3 కోట్ల మంది ప్రయాణీకులకు గమ్య స్థానాలకు చేర్చడంతో పాటు మిలియన్ టన్నుల సరుకును రవాణా చేస్తుంది. ఇండియన్ రైల్వే ఎన్నో అద్భుతాలను కలిగి ఉంది. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
జమ్మూ- కాశ్మీర్ లోని చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా గుర్తింపు తెచ్చుకుంది. 1,178 అడుగుల ఎత్తులో దీనిని నిర్మించారు. స్టీల్, కాంక్రీట్ తో కలిపి నిర్మించిన ఈ వంతెన కాశ్మీర్ లో రియాసి జిల్లాలోని కౌరీ- బక్కల్ ను అనుసంధానిస్తుంది.
భారతీయ రైల్వేలో గొప్ప సాంస్కృతిక, సాంప్రదాయ వారసత్వాన్ని పోలి ఉండే ఐదు లగ్జరీ రైళ్లు ఉన్నాయి. గోల్డెన్ ఛారియట్, ది మహారాజాస్ ఎక్స్ ప్రెస్, రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్, ప్యాలెస్ ఆన్ వీల్స్, దక్కన్ ఒడిస్సీ. ఇవి ప్రయాణీకులకు 7 స్టార్ హోటల్ సౌకర్యాలను అందిస్తాయి.
నాలుగు వైపుల నుంచి వచ్చే రైల్వే ట్రాక్స్ ఒకే చోట కలుస్తాయి. అక్కడ చూడ్డానికి డైమండ్ షేప్ లో ఉంటాయి. అందుకే ఈ ప్రదేశాన్ని డైమండ్ క్రాసింగ్ అని పిలుస్తుంటారు. రెండు ట్రాక్‌లు ఉత్తరం, దక్షిణం వైపు వెళ్తుండగా, మిగిలిన రెండు తూర్పు-పడమర వైపు వెళ్తాయి. డైమండ్ క్రాసింగ్ అనేది మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో ఉంది.
ఇది దేశంలోని అత్యంత పురాతనమైన లోకోమోటివ్. ఇది ఆవిరి ఇంజిన్. ఇప్పటికీ ఇది పని చేస్తోంది. ఢిల్లీ-ఆల్వార్ మార్గంలో నడుస్తుంది. దీనిని 1909లో విధుల నుంచి తొలగించినా, 1997లో మళ్లీ అందుబాటులోకి తీసుకురాబడింది.
భారత రైల్వే నెట్ వర్క్ గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. మన దేశంలో ఏప్రిల్ 16, 1853న ముంబై బోరి బందర్ నుంచి థానే మధ్య రైల్వే సర్వీసు ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం దేశంలో ఏకంగా లక్ష కిలో మీటర్ల మేర రైల్వే లైన్లను కలిగి ఉంది.
ఇక ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ ఫారమ్ ఇండియాలో ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ లో ఉంది. దీని పొడవు 1.36 కి.మీగా ఉండటం విశేషం.
భారత రైల్వే నాలుగు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగి ఉంది. వీటిలో ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్, నీలగిరి మౌంటెయిన్ రైల్వే, డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, కల్కా సిమ్లా రైల్వేలు ఉన్నాయి.
Read Also: ఇది ప్రపంచంలోనే మోస్ట్ లాంగెస్ట్ ట్రైన్ జర్నీ, ఏకంగా 13 దేశాలను చుట్టేస్తుంది!