Covid-19 India| భారత్‌లో కోవిడ్-19 (కరోనా వైరస్) కేసులు మంగళవారం ఉదయం 4,000 మార్కును దాటాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా జారీ చేసిన కరోనా గణాంకాల ప్రకారం.. జూన్ 3, 2025 ఉదయం 8 గంటల సమయంలో దేశవ్యాప్తంగా మొత్తం 4,026 యాక్టివ్ కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా కరోనా వేవ్‌లో అత్యధికంగా అయితు రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి. కేరళ (1,416 కేసులు), మహారాష్ట్ర (494 కేసులు), గుజరాత్ (397 కేసులు), ఢిల్లీ (393 కేసులు), పశ్చిమ బెంగాల్ (372 కేసులు).
ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 2,700గా ఉంది. అయితే మరణాల సంఖ్య 37కి చేరింది. జూన్ 3 నాటికి అయిదు కరోనా మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇద్దరు, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లలో ఒక్కొక్కరు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. మరణించిన వారు ఎక్కువగా వృద్ధులు, ఇతర వైద్య సమస్యలతో బాధపడుతున్నవారు.
కేరళ రాష్ట్రంలో.. 80 ఏళ్ల వృద్ధుడు కరోనా వల్ల మరణించాడు. అతను తీవ్రమైన న్యూమోనియా, డయాబెటిస్, ఆక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS), హైపర్‌టెన్షన్, కరోనరీ ఆర్టరీ డిసీజ్‌తో బాధపడుతున్నాడు. మహారాష్ట్రలో కూడా 70 ఏళ్ల, 73 ఏళ్ల ఇద్దరు మహిళలు కరోనా వల్ల మరణించారు. 70 ఏళ్ల మహిళకు డయాబెటిస్ ఉండగా.. 73 ఏళ్ల మహిళకు డయాబెటిస్, హైపర్‌టెన్షన్ సమస్యలు ఉన్నాయి.
తమిళనాడులో 69 ఏళ్ల వ్యక్తి కరోనా వల్ల మరణించాడు. అతను టైప్ 2 డయాబెటిస్, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. పశ్చిమ బెంగాల్‌లో.. 43 ఏళ్ల మహిళ కూడా కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా మరణించింది. ఆమె ఆక్యూట్ కరోనరీ సిండ్రోమ్, సెప్టిక్ షాక్, ఆక్యూట్ కిడ్నీ ఇంజరీతో బాధపడుతోంది.
ఈ మరణాలు ఎక్కువగా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో కూడిన వృద్ధులలో సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఎక్కువ శాతం కేసులు స్వల్ప లక్షణాలతో ఉన్నాయని, ఆసుపత్రులు ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. కేరళలో అత్యధిక కేసులు నమోదవడానికి కారణం అక్కడ ఎక్కువ పరీక్షలు నిర్వహించడమేనని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ధనం లాగే నిద్రను కూడా బ్యాంకులో దాచుకోవచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
గుండె జబ్బులు, డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు వంటి ఇతర వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శుభ్రతను కాపాడుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సలహా ఇస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి పరీక్షల సంఖ్యను మరింత పెంచాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.