BIG NEWS : అతనో పోలీస్. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన వ్యక్తి. కానీ, చట్టాన్ని తన చుట్టంగా మార్చేసుకున్నాడు. న్యాయం కళ్లు కప్పి.. అన్యాయపు పనులు మొదలుపెట్టాడు. ఉండేది తిరుపతిలో కాబట్టి.. ఎర్ర చందనం స్మగ్లింగ్‌లో వేలు, కాలు పెట్టాడు. దండిగానే డబ్బులు రావడంతో మరింత రెచ్చిపోయాడు. వైసీపీ ఎంపీకి గన్‌మెన్‌గా ఉంటూ చాలా అరాచకాలే చేశాడంటారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో అతని హవా తగ్గిపోయింది. ఎర్రచందనం వదిలేసి డ్రగ్స్ దందా స్టార్ట్ చేశాడు. కట్ చేస్తే.. లేటెస్ట్‌గా తెలంగాణ పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.
కిలాడీ కానిస్టేబుల్
కానిస్టేబుల్ గుణశేఖర్. పేరులోనే గుణముంది కానీ, చేసేదంతా అవినీతే. గతంలో ఐదేళ్ల పాటు తిరుపతి ఎంపీ గురుమూర్తి దగ్గర గన్‌మెన్‌గా చేశాడు. అతనిపై ఎర్రచందనం కేసులు ఉన్నాయని చెబుతున్నారు. అప్పట్లో అధికార పార్టీ ఎంపీకి బాడీగార్డ్‌గా ఉండటంతో పెద్దగా ఇబ్బందులు లేకుండా దందా కొనసాగిందంటారు. ఆ తర్వాత కూటమి సర్కారు రావడంతో.. కష్టాలు మొదలయ్యాయి. ఆర్నెళ్ల క్రితమే గన్‌మెన్ గుణశేఖర్‌ను వెనక్కి పంపించేశారు ఎంపీ గురుమూర్తి. ఆ తర్వాత అతన్ని తిరుపతి ఆర్మ్డ్ రిజర్వ్‌కు బదిలీ చేశారు. కొంత కాలంగా ఆ కానిస్టేబుల్ సెలవుల్లో ఉన్నాడు. సడెన్‌గా అతని పేరు డ్రగ్స్ కేసులో వెలుగుచూసింది.
రూ.2 కోట్ల డ్రగ్స్ కేసులో..
తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్.. బాపట్ల జిల్లా అద్దంకి నుంచి హైదరాబాద్, కూకట్‌పల్లికి రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ తీసుకొస్తుండగా ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు. పట్టుబడ్డిన వారి నుంచి 840 గ్రాముల కొకైన్, ఇతర డ్రగ్స్ మరియు నగదు స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ మాఫియా డాన్
తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్(40), తిరుపతి రూరల్ ప్రాంతానికి చెందిన నిరుద్యోగి ఉన్నం సురేంద్ర(31), బాపట్ల జిల్లా కర్ల పాలెం మండలానికి చెందిన కాంట్రాక్టర్ దొంతిరెడ్డి హరిబాబురెడ్డి (38), అద్దంకి మండలానికి చెందిన ఫాస్ట్ ఫియాడ్ నిర్వాహకురాలు చెగుడు మెర్సీ మార్గరేట్(34), షేక్ మస్తాన్వలీ(40), దేవరాజు యేసుబాబు(29) కలిసి ముఠాగా ఏర్పడి డ్రగ్స్ దందా చేస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో A1గా ఉన్న AR కానిస్టేబుల్ గుణశేఖర్ కోసం వేట కొనసాగుతోంది.
పరారీలో కానిస్టేబుల్
గుణశేఖర్, సురేంద్ర ఇద్దరు కలిసి డ్రగ్స్ సప్లై చేసినట్టు గుర్తించారు. వారిద్దరు స్నేహితులని తెలిపారు బాలానగర్ DCP కోటిరెడ్డి. ఏడుగురు సభ్యులున్న డ్రగ్స్ ముఠాలో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కోటి రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల్లో నలుగురిని సురేంద్ర టీంలా తయారు చేశారన్నారు. వీరిలో ఐదుగురిని బాపట్ల జిల్లాకు చెందిన డ్రగ్ పెడ్లర్లు.. దొంతి రెడ్డి, హరిబాబు రెడ్డి, చెంగుడి మెర్సీ, శేఖ్ మస్థాన్ వలి, ఏసుబాబుగా గుర్తించారు. 820 గ్రాముల ఎపిడ్రిన్ తో కూడిన కొకైన్, డిజిటల్ వెయిట్ మిషన్, ఐదు మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దందాలో ప్రధాన నిందితుడు తిరుపతికి చెందిన కానిస్టేబుల్ గుణశేఖర్ అని తెలిపారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వైసీపీ హయాంలో ఎర్రచందనం దందా చేయగా.. ఇప్పుడక్కడ పరపతి పోవడంతో హైదరాబాద్‌లో డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నాడని భావిస్తున్నారు. అంటే… అప్పట్లో…?