Crude Oil UP : భారత్ లో పెద్ద మొత్తంలో ముడి చమురు నిక్షేపాలు బయటపడ్డాయి. గంగా నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 300 కిలోమీటర్ల పరిధిలో ఈ నిల్వలు ఉన్నట్లుగా నిపుణులు గుర్తించారు. ఈ నిల్వల్ని వెలికితీస్తే.. దేశీయ ముడిచమురు అవసరాలు తీరడంతో పాటుగా లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగులుతుంది. దీంతో.. మరిన్ని నిల్వల్ని గుర్తించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
కొన్నాళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజాలు, ముడి చమురు వంటి వాటి కోసం పెద్ద ఎత్తున అన్వేషణలు జరుగుతున్నాయి. విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించడం, స్వయంగా విలువైన ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేసేందుకు భారత్ భారీగా గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక ఖనిజాలు, శిలాజ ఇంధనాల ఉనికి వెలుగు చూసింది. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని సాగర్‌పాలి గ్రామం సమీపంలో ముడి చమురు నిక్షేపాలు భయటపడ్డాయి. చమురు, సహజ వాయువు కార్పొరేషన్ – ONGC దేశంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అన్వేషణ ప్రయత్నాలు ఫలించి.. ఈ నిల్వల గురించి తెలిసింది.
యూపీకి మహర్దశ
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం, బల్లియాలోని ఓ స్వాతంత్ర్య సమరయోధుడు చిత్తు పాండే, అతని కుటుంబానికి చెందిన భూమిలో పెద్ద ఎత్తున ముడి చమురు నిల్వలు బయటపడ్డాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 3 నెలల పాటు నిర్వహించిన సర్వేలో 3,000 మీటర్ల లోతులో చమురు నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది. పాండే కుటుంబం నుంచి ONGC ఆరున్నర ఎకరాల భూమిని మూడేళ్ల పాటు లీజుకు తీసుకుని ఈ సర్వే నిర్వహిస్తోంది. ఇందుకు గానూ, ఏడాదికి రూ. 10 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
వివిధ సర్వేలు, పరిశోధనలు చేసిన తర్వాత ఇక్కడ ముడి చమురు నిల్వలున్నట్లు ONGC అధికారులు నిర్ధారించారు. అయితే.. ముడి చమురు కోసం 3,001 మీటర్ల వరకు తవ్వకాలు జరపాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు. ఈ తవ్వకాల కోసం రోజుకు 25,000 లీటర్ల నీటిని ఉపయోగిస్తున్నారు. ఈ తవ్వకాలు ఇంకా వేగంగా, మరింత లోతుగా చేపట్టాల్సి ఉంటుంది అంటున్న అధికారులు.. ఏప్రిల్ చివరి నాటికి ఈ సర్వే పూర్తిగా ముగిసే అవకాశం ఉందంటున్నారు.
గంగా బేసిన్‌లోని వివిధ ప్రదేశాలలో డ్రిల్లింగ్ విజయవంతమైతే, గంగా పరీవాహక ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి సర్వే బావులను తవ్వనున్నారు. అందరూ అనుకుంటున్నట్లుగా ఈ ప్రాంతంలో ముడి చమురు నిల్వలు బయటపడితే.. స్థానిక రైతుల జీవితాలు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయి. వారిని అదృష్టం వరించినట్లే అంటున్నారు అధికారులు, స్థానిక నాయకులు. ప్రస్తుత తవ్వకాల కోసమే.. భూ యజమాని, చిత్తు పాండే వారసులకు మూడేళ్లపాటు ఏటా రూ. 10 లక్షలు చెల్లించేందుు ONGC ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని మరో ఏడాది పాటు పొడిగించేందుకు సైతం అవకాశముంది. చమురు దొరికితే, ONGC చుట్టుపక్కల భూములను అధిక ధరలకు స్వాధీనం చేసుకుంటుందని, దీనివల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ముడి చమురు నిల్వ బల్లియాలోని సాగర్ పాలి గ్రామం నుంచి ప్రయాగ్‌రాజ్‌లోని ఫాఫమౌ వరకు 300 కి.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది.