అరేబియా సముద్రంలో ఏర్పడిన శక్తి తుఫాన్, తీవ్ర తుఫాన్ గా మారినట్లు భారత వాతావరణ కేంద్రం(IMD) వెల్లడించింది. ఈ తుఫాన్ కారణంగా గంటలకు ఏకంగా 100 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రస్తుతం తీరానికి పశ్చిమ దిశగా కదులుతున్నట్లు తెలిపింది.
శక్తి తుఫాన్ కారణంగా అరేబియా సముద్రం అల్లకల్లోలంగా ఉంది. గుజరాత్ తీరం ఉగ్రరూపం దాల్చింది. సముద్రంలో భారీ అలలు ఏర్పడుతున్నాయి. ఈ తుఫాన్ గుజరాత్ లోని ద్వారక సమీపంలో పశ్చిమ నైరుతి దిశగా కదులుతున్నట్లు ఐఎండీ తెలిపింది. గుజరాత్, ఉత్తర మహారాష్ట్ర తీరం, పాకిస్తాన్ తీరం వెంబడి సముద్రంలో కల్లోలం ఉంటుందని వెల్లడించింది. ఆదివారం వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని తెలిపింది.
శక్తి తుఫాన్ కు సంబంధించి ఐఎండీ కీలక విషయాలు వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుఫాన్ ద్వారకకు 420 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది. అదే సమయంలో కరాచీకి 290 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. అక్కడి నుంచి నైరుతి దిశగా కదులుతుంది. ఆదివారం నాటికి పశ్చిమ మధ్య అరేబియా సముద్రానికి చేరే అవకాశం ఉంటుంది. సోమవారం ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది.
శక్తి తుఫాన్ నేపథ్యంలో ఐఎండీ మహారాష్ట్రకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర తీరం, గుజరాత్ తీరంలో తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపించే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మహారాష్ట్రలోని థానే, పాల్ఘడ్, రాయ్ గడ్, రత్నగిరి, సింధు దుర్గ్ లో ఈ తుఫాన్ కారణంగా ఈ నెల 7 వరకు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. దీని ప్రభావంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. మరో రెండు రోజుల పాటు మహారాష్ట్ర తీర ప్రాంతంలో విపరీతమైన గాలులు వీస్తాయని తెలిపింది.
అటు గుజరాత్ లోని ద్వారక, జామ్ నగర్, పోరు బందర్, సూరత్, నవ్ సారి, వల్సాడ్, దామన్, దాద్రానగర్ హవేలి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, గుజరాత్ లోని డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు రెడీ అయ్యాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. సోమవారం నాటికి ఈ తుఫాన్ బలహీనపడే అవకాశం ఉండటంతో అప్పటి వరకు అలర్ట్ గా ఉండాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయక బృందాలకు సూచించారు.
Read Also: వీధి కుక్కలకు జీవిత ఖైదు.. జైల్లో పెట్టి మక్కెలు ఇరగదీసుడే.. ప్రభుత్వం కీలక నిర్ణయం!