Dharmasthala news: ప్రతి రోజూ వేలాది మంది భక్తులు పోటెత్తే ఓ పవిత్ర పుణ్యక్షేత్రం. శాంతి, ఆధ్యాత్మికత వెదజల్లే ఆ స్థలంలో.. భయానకమైన కథలు పుట్టుకొస్తే? అక్కడి నేల అడుగులో దాగినది నమ్మశక్యంగా ఉండదని చెబుతుంటే? ప్రస్తుతం ఇలాంటి సందిగ్ధత, అనుమానాలు తేలియాడుతోంది కర్ణాటక రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యస్థలమైన ధర్మస్థలలోనే. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? ఏంటా మిస్టరీ తెలుసుకుందాం.
శాంతి నిలయానికి కలవర సంకేతాలా..?
ఇటీవల ఓ వ్యక్తి చేసిన బహిరంగ ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. పలు చోట్ల సామూహిక ఖననాలు జరిగాయని, అక్కడ శవాలు పాతిపెట్టారని సంచలన ఆరోపణలు వచ్చాయి. ఇది కేవలం ఊహ కాదు.. ఆ వ్యక్తి చూపించిన 15 ప్రాంతాల్లోనే తవ్వకాలు జరపాలని అధికార యంత్రాంగం సీరియస్‌గా స్పందించడంతో.. కేసు తీవ్రతకు అర్ధమవుతోంది.
తవ్వకాలు ప్రారంభించిన సిట్
ఈ కేసును ఛేదించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ (Special Investigation Team) ని ఏర్పాటు చేసింది. కేసు విచారణలో భాగంగా, సిట్ అధికారులు ధర్మస్థల పరిసరంలోని శ్మశాన వాటికలు, అటవీ ప్రాంతాలు, నేత్రావతి నది తీరంలోని అనుమానాస్పద ప్రాంతాలు చుట్టూ తవ్వకాలు ప్రారంభించారు. మొదటి రోజు ప్రత్యేక పూజలతో తవ్వకాలకు శ్రీకారం చుట్టారు.
మూడు ప్రాంతాల్లో పూర్తి..
ఇప్పటి వరకూ మూడు ప్రాంతాల్లో తవ్వకాలు పూర్తి అయ్యాయి. దాదాపు 15 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతుతో శాస్త్రీయంగా తవ్వకాలు చేశారు. కానీ ఎక్కడా మృతదేహాలు లభించలేదు. దీంతో ఆ ఆరోపణల్లో ఎంత నిజం ఉందనే అంశంపై పోలీసులు మరింత లోతుగా దృష్టి సారించారు. ప్రస్తుతం నాలుగో ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి.
నదీతీరం వద్ద..
అరోపణలు చేసిన వ్యక్తి.. ముఖ్యంగా నేత్రావతి నది తీరంలో ఎనిమిది ప్రాంతాల్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరిగాయని వెల్లడించాడు. దీంతో నది తీరాన్ని ప్రధానంగా టార్గెట్ చేసిన అధికారులు, ఒక్కొక్కటిగా ఆ ప్రాంతాల్లో తవ్వకాలు చేపడుతున్నారు. ప్రతి ప్రాంతాన్ని శాస్త్రీయంగా పరిశీలించి, ఆధారాల కోసం మల్లగుల్లాలు పడుతున్నారు.
Also Read: IRCTC updates: గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి.. రైళ్లకు జనరల్ బోగీల పెంపు.. ఎప్పుడంటే?
ఆరోపణలు నిజమేనా..?
ప్రస్తుతం పోలీసుల కంట దొరికిన ఏ ఆధారమూ లేదు. అయితే ఆరోపణలు చేసిన వ్యక్తిని తవ్వకాల్లోనే పాల్గొనిస్తూ.. అతని సూచనల మేరకే తవ్వకాలు జరుపుతున్నారు. ఇది కొందరిలో అనుమానాలను రేకెత్తిస్తోంది. అతను చెప్పింది నిజమైతే ఆధారాలేమైనా రావాలి కదా? లేకపోతే ఇతడి వెనుక ఇంకెవరో ఉన్నారా..? అనే కోణంలో అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇంతవరకూ తవ్విన మూడు ప్రాంతాల్లో ఎలాంటి ఆధారాలు లభించకపోయినా, అధికారులు మిగిలిన 12 ప్రాంతాల్లోనూ తవ్వకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఒకవేళ ఆ ప్రాంతాల్లో ఏదైనా ఆధారం లభిస్తే.. ఇది కేవలం స్థానిక కేసుగా ఉండదు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపే అంశంగా మారుతుంది.
మహిమాన్విత క్షేత్రం.. మిస్టరీ వెనక నిజం ఏమిటి?
ధర్మస్థల ఎప్పటికీ ఆధ్యాత్మికతకు, ధర్మానికి నిలయంగా నిలిచిన ప్రాంతం. అలాంటి ప్రదేశంపై ఇలా గంభీర ఆరోపణలు రావటం.. పర్యటకులు, భక్తులలో ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ప్రచారమా? లేక నిజంగా భయానక చరిత్ర దాగుందా? త్వరలో తవ్వకాలు ఇచ్చే సమాధానం చెప్పాల్సిందే.