Pears Health Benefits: వర్షాకాలం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ.. ఈ సమయంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ప్రబలే ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఈ సీజన్‌లో లభించే అద్భుతమైన పండ్లలో పియర్స్ కూడా ఒకటి. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. అంతే కాకుండా ఇవి వర్షాకాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. వర్షాకాలంలో బేరి పండ్లు తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలను గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
పియర్స్ ఫ్రూట్స్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి చాలా అవసరం. వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, ఇతర అంటువ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
పియర్స్ ఫైబర్‌తో నిండి ఉంటాయి. వర్షాకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు సర్వసాధారణం. పియర్స్‌లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. అంతే కాకుండా ఇది పేగు కదలికలను క్రమబద్ధీకరిస్తుంది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా పియర్స్ ఫ్రూట్స్ బరువు తగ్గాలనుకునే వారికి అద్భుతమైన ఎంపిక. ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచి.. అనవసరమైన చిరుతిళ్లను కూడా నివారిస్తుంది.
శరీరానికి శక్తిని అందిస్తుంది:
పియర్స్ ఫ్రూట్స్‌లో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి. ఇవి తక్షణ శక్తిని అందిస్తాయి. వర్షాకాలంలో వచ్చే అలసటను తగ్గించి.. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి కూడా సహాయపడతాయి.
గుండె ఆరోగ్యానికి మేలు:
పియర్స్ ఫ్రూట్స్ లో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే.. ఇందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు పుష్కలం:
పియర్స్ ఫ్రూట్స్‌లో ఫ్లేవనాయిడ్లు , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
ఎముకలకు బలం :
పియర్స్ ఫ్రూట్స్‌లో విటమిన్ కె, బోరాన్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటానికి అంతే కాకుండా ఎముకల సాంద్రతను పెంచడానికి సహాయపడతాయి.
రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణ:
పియర్స్ ఫ్రూట్స్‌లోని ఫైబర్ , తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా నిరోధిస్తాయి. అంతే కాకుండా ఇది మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి మంచి ఎంపిక.
Also Read: పీనట్ బటర్ తింటున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి !
శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది:
పియర్స్ ఫ్రూట్స్ లోని అధిక నీటి శాతం, ఫైబర్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడతాయి. తద్వారా మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి.
చర్మ సౌందర్యానికి మేలు:
పియర్స్ ఫ్రూట్స్‌లోని విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా.. కాంతివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా ఇవి చర్మ కణాలను నష్టం నుంచి రక్షించి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
వర్షాకాలంలో పియర్స్ ఫ్రూట్స్‌ను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని నేరుగా తినవచ్చు లేదా సలాడ్‌లు, స్మూతీలు, డెజర్ట్‌లలో ఉపయోగించవచ్చు.