IRCTC updates: ఒకప్పుడు ప్లాట్‌ఫాం మీద పరిగెత్తే వారిని చూసి, ఏంటి అంత తొందర? అని అనుకునే రోజులు. కానీ, ట్రైన్ లోకల్ బోగీలో చొరబడాలంటే చేతిలో టికెట్ ఉన్నా, గుండె ధైర్యం ఉండాలన్న సంగతి ప్రయాణించినవాళ్లకు తెలుసు. ఒక్క మెట్రో నగరమే కాదు.. పల్లె నుండి పట్టణం వరకు ఇదే పరిస్థితి! కానీ ఇప్పుడు వెయిటింగ్ లిస్టులకూ, వేలాడే ప్రయాణాలకూ చెక్ పెట్టేలా రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అసలు ఏం మారబోతోందో, ఈ ప్రయాణం ఎలా సౌకర్యంగా మారబోతోందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం పూర్తి చదవండి.
ప్రతి సాధారణ కుటుంబానికీ ప్రయాణం ఒక అవసరం మాత్రమే కాదు… ఒక పోరాటం కూడా. ట్రైన్ జర్నీ సమయంలో అయితే వారు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. టికెట్ కౌంటర్ దగ్గర లైన్లో నిలబడటం, రిజర్వేషన్ లేకుండానే ప్రయాణించాల్సిన పరిస్థితి, మెరుగైన సౌకర్యాలపై కలలు కన్న సామాన్యులు ఎప్పుడూ చివర్లో ఉంటారు. కానీ ఇప్పుడు సామాన్య ప్రయాణికులకు అధిక మేలు చేకూర్చేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమైంది. అందుకు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి కీలక ప్రకటన చేశారు.
ఇండియన్ రైల్వే వ్యవస్థలో ఇప్పటి వరకు ఏసీ కోచ్‌లు అనే మాటే ఎక్కువగా వినిపించేది. కానీ రియాలిటీ వేరే. 78 శాతం మంది ప్రయాణికులు ఇప్పటికీ నాన్-ఏసీ జనరల్ కోచ్‌లలోనే ప్రయాణిస్తున్నారు. ఈ ప్రయాణికులు మధ్యతరగతిని, తక్కువ ఆదాయ కుటుంబాలను ప్రతిబింబచేస్తారు. ప్రభుత్వం ఇప్పుడు వీరి అవసరాలను పట్టించుకుంటోంది. అందుకే ఒక బృహత్తర నిర్ణయం తీసుకుంది.
ఈసారి ఫోకస్ అలంకరణ కాదు, అవసరం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 82,000 జనరల్ క్లాస్ కోచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో సుమారు 69 లక్షల సీట్లు జనరల్, నాన్-ఎసీ ప్రయాణికుల కోసం మంజూరు చేయబడ్డాయి. ఇది కేవలం సంఖ్యల మార్పు కాదు.. సామాన్యుడి పట్ల ప్రభుత్వం చూపుతున్న నిబద్ధతగా రైల్వే అంటోంది.
17,000 కోచ్‌లు తయారీకి సిద్ధం!
కేంద్రం మరో కీలక ప్రకటన చేసింది. కొత్తగా 17,000 జనరల్, నాన్-ఎసీ కోచ్‌లను తయారు చేయబోతున్నది. దీని వల్ల టికెట్ రద్దు సమస్య, ఓవర్‌క్రౌడింగ్, అసౌకర్యాలు అన్నీ తగ్గే అవకాశం ఉంది. మరి ఈ కోచ్ ల రాకతోనైనా ప్రయాణం కాస్త గౌరవప్రదంగా మారుతుందా? అని సామాన్య ప్రయాణికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Secunderabad railway station look: ఇంత అందంగా స్టేషన్ ఉంటుందా? సికింద్రాబాద్ రీడెవలప్‌మెంట్ చూసారా!
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ విషయాన్ని లోక్‌సభలో పేర్కొన్నారు. ఆయన మాటల్లోనూ, చర్యల్లోనూ ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు. మధ్యతరగతిని మనం వదిలిపెట్టము. మీకూ మెరుగైన ప్రయాణ అనుభవం హక్కే. ఇది ఎన్నికల వాగ్దానం కాదు.. అతి త్వరలో పేద ప్రయాణికులకు రైల్వేను మరింత చేరువ చేస్తామని మంత్రి చెప్పడం విశేషం. ప్రైవేట్ కంపెనీలలా లాభాలు ఆలోచించకుండా, సామాన్యుడి అవసరమే కేంద్ర రైల్వే వ్యూహానికి కేంద్రబిందువుగా మారింది. జనరల్ కోచ్‌ను ఉద్దేశించి తీసుకున్న ఈ నూతన నిర్ణయాలు సామాజిక సమానత్వానికి ఒక ఉదాహరణగా నిలుస్తున్నాయి.
ఎక్కడికైనా, ఎప్పుడైనా.. అందరికీ అవకాశం
ఒకప్పుడు రైలు ప్రయాణం అనేది పేదవాళ్లకు కాస్త కష్టమైన కల. ఇప్పుడు అదే కల వాస్తవమవుతోంది. రైలు ఎక్కే వ్యక్తికి క్లాస్ కాదు, సీటు ముఖ్యమని ప్రభుత్వం గుర్తించడమే నిజమైన అభివృద్ధి. సమాజంలో మార్పు చిన్న చిన్న అడుగులతో మొదలవుతుంది. ఈసారి ఆ అడుగులు ట్రాక్ మీద పడ్డాయి. మారుతున్న ఇండియన్ రైల్వేలో ఇప్పుడు సామాన్యుడికీ గౌరవం ఉంది. ఇకపై అతనూ తల ఎత్తి రైలు ఎక్కే రోజులు దగ్గర్లోనే ఉన్నాయనిపిస్తోంది.
ముఖ్యంగా మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు రైల్వే అనేది సౌకర్యం కాదు.. ఒక అవసరం. ఇప్పుడు ఆ అవసరాన్ని గౌరవంగా తీర్చే విధంగా మారుతున్న మార్గం.. భారత రైల్వే మార్గం. ఇలాంటి అభివృద్ధి చర్యలు కొనసాగితే.. రైలు మార్పే కాదు, సామాజిక దృక్పథమే మారుతుందని సామాన్య ప్రజానీకం అంటున్నారు.