Delhi CM Sword Skills Fact|దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాల్లో ఎవరూ ఊహించని వ్యక్తి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. అయితే పార్టీలో సీనియర్ లీడర్లు ఎందరు ఉన్నా మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన మహిళా నాయకురాలు రేఖా గుప్తాను బిజేపీ అధిష్ఠానం సిఎంగా ప్రకటించింది. ఆమె ఫిబ్రవరి 20, 2025న ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్ లో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హర్యాణా రాష్ట్రంలోని జింద్ ప్రాంతంలో జన్మించిన రేఖా గుప్తా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమె ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)కు చెందిన అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ లో సభ్యురాలు. ఈ నేపథ్యంలో రేఖా గుప్తాకు చెందిన ఒక వీడియో.. వైరల్ అవుతోంది. ఇందులో ఆమె కత్తిసాము విద్యను అద్భుతంగా ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ వీడియోను ట్విట్టర్ ఎక్స్ ప్లాట్‌ఫామ్ పై ఒక వ్యక్తి షేర్ చేసి ఇలా కామెంట్ పెట్టాడు. “ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఏబివిపిల పనిచేసే సమయంలో రేఖా గుప్తాగారి పాత వీడియో ఇది. సుదీర్ఘ కాలం బిజేపీలో పనిచేసిన తరువాత ఆమె శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం.. అప్పుడే ఢిల్లీ ముఖ్యమంత్రి కావడం ఆమె కష్టాలకు దక్కిన ఫలితం. శ్రీ రేఖా గుప్తాగారికి నా శుభాకాంక్షలు” అని వీడియో పోస్ట్ చేసి కామెంట్ లో రాశాడు. అయితే ఈ వీడియోలో ఉన్న మహిళ రేఖా గుప్తా పోలీకలతో ఉన్న మరో మహిళది అనే అనుమానం కూడా కలిగింది.
Also Read: కుంభమేళలో యువతుల స్నానాలు – అమ్మకానికి వీడియోలు
అందుకే ఒక జాతీయ మీడియా ఛానెల్ ఈ వీడియో గురించి ఫ్యాక్ట్ చెక్ చేయగా.. అందులో ఉన్న మహిళ ఢిల్లీ సిఎం రేఖా గుప్తా కాదు.. ఆమె ఒక మరాఠీ నటి. పేరు పాయల్ జాధవ్. ఇలాంటి వీడియో గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే.. ఇది ఇన్‌స్టాగ్రామ్ లో పాయల్ జాధవ్ అకౌంట్ లోని పాత వీడియోగా తేలింది. కానీ ఆమె ఇటీవల ఈ వీడియోని ఫిబ్రవరి 19 2025న ఛత్రపతి శివాజీ జన్మదిన సందర్భంగా ఆయనకు అంకితం చేస్తూ పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆమె కర్ర సాము, కత్తిసాము చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ విద్యను నటి పాయల్ జాధవ్ మహారాష్ట్ర లోని సవ్యసాబి గురుకులంలో నేర్చుకున్నట్లు తెలిపారు.
2023లో మరాఠీ సినిమా ‘బాప్‌ల్యోక్’ తో సినిమాల్లోకి ప్రవేశించిన పాయల్ జాధవ్, టివి సిరీస్ ‘మాన్వత్ మర్డర్స్’ లో కూడా నటించింది.ఆ తరువాత ‘త్రీ ఆఫ్ అజ్’ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. పుణె యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి పాయల్, లలిత్ కళా కేంద్ర నుంచి భరత నాట్యంలో ప్రావీణ్యం పొందింది. వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తున్న వేషంలో జనవరి 5, 2023న ఆమె ఒక ఫొటో షేర్ చేసింది.
దీంతో ఆ వైరల్ వీడియో మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శిస్తున్న మహిళ ఢిల్లీ ముఖ్యమంత్రి కాదు.. మరాఠీ నటి పాయల్ జాధ్ అని తేలిపోయింది.