Inspiring woman india: అమ్మాయి పుట్టిందా? ఇక్కడ స్పెషల్ గిఫ్ట్స్ రెడీ! మరి ఇంత ప్రేమగా ఆశీర్వాదాల రూపంలో మిఠాయిలు పంచి, డెలివరీ ఛార్జీలు పూర్తిగా మాఫీ చేస్తూ, అమ్మాయిల పుట్టుదలను పండుగలా జరుపుకునే గొప్ప మనిషి ఎవరంటే? ఓ గైనకాలజిస్ట్ డాక్టర్ తన ఆసుపత్రిలో పుట్టే ప్రతి బాలికకు ఓ పండగలా స్వాగతం చెబుతున్నారు. అమ్మాయి పుట్టిందంటే బాధపడే సమాజానికి తగిన సమాధానం చెబుతూ, ఆ అమ్మాయి పుట్టిన రోజు నిజంగా సెలబ్రేషన్ అయ్యేలా చేస్తున్నారు. ఇంతకు ఎవరు ఆమె? ఎందుకిలా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే.
మన దేశంలో కొన్నిచోట్ల ఇప్పటికీ అబ్బాయి పుడితేనే ఆనందం అనే మూర్ఖపు ఆచారాలు జీవించి ఉన్నాయి. కానీ అదే సమాజంలో కొందరు మనుషులు.. మానవత్వానికి అర్థం చెప్పేలా జీవిస్తున్నారు. వారణాసిలో డాక్టర్ శిప్రా ధర్ అచ్చం అలాంటి వ్యక్తిత్వం. అమ్మాయి పుట్టిందంటే కొందరు ముఖం బిగబరచుకుంటే, ఆమె మాత్రం మిఠాయిలు పంచుతూ పండుగలా జరుపుకుంటారు. ఎందుకంటే ఆమెకు తెలిసిన సత్యం ఒక్కటే.. అమ్మాయి పుట్టడమే ఒక ఆశీర్వాదమని.
అమ్మాయి పుట్టిన రోజే ఉచిత ప్రసవ సేవలు
డాక్టర్ శిప్రా ధర్ ఒక ప్రసిద్ధ గైనకాలజిస్ట్. ఆమె తన సొంత క్లినిక్‌లో అమ్మాయి పుట్టిన ప్రతి సందర్భాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. ముఖ్యంగా, బాలిక పుట్టిన కుటుంబానికి ప్రసవ ఖర్చులు వసూలు చేయరు. అదీ కాకుండా, వారి ఇంట్లో పసిపాప పుట్టిందని పంచుకోవడానికే స్వయంగా తన ఖర్చులతో మిఠాయిలు పంపిణీ చేస్తారు. ఇంతకీ ఇది ఎందుకు? అని ఎవరైనా అడిగితే.. డాక్టర్ శిప్రా ధర్ ఒక ఆత్మీయమైన సమాధానం ఇస్తారు. ఈ దేశంలో అమ్మాయిలు పుట్టాలంటేనే ఇంకా కొందరు వెనకడుగు వేస్తున్నారు. అలాంటి భావాలను తొలగించాలంటే.. ప్రేమను చూపించాలి, మద్దతు ఇవ్వాలని అంటారు.
ఇప్పటి వరకు 100 మందికి పైగా అమ్మాయిల ఉచిత డెలివరీలు
ఇప్పటి వరకు ఆమె చేసిన ఉచిత డెలివరీల సంఖ్య 100కు మించినదే. ఇది ఆమెకు పేరు కోసం కాదు, ప్రచారం కోసం కాదు.. ఇది ఆమె అంతరాత్మ చెప్పిన మార్గం. అమ్మాయిల పట్ల సమానత్వాన్ని ప్రోత్సహించాలన్నదే ఆమె లక్ష్యం. ముఖ్యంగా గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాల్లో అమ్మాయి పుట్టిందంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితుల్లో, డాక్టర్ శిప్రా ధర్ చేస్తున్న పని నిజంగా అభినందనీయం.
ప్రధాని మోదీ ప్రశంసలు
డాక్టర్ శిప్రా ధర్ చేసిన పనిని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆమె పేరు ప్రస్తావిస్తూ, ఇలాంటివారే బేటీ బచావో, బేటీ పడావో ఉద్యమానికి నిజమైన బ్రాండ్ అంబాసిడర్స్ అంటూ ఆమెను గుర్తించారు. దేశస్థాయిలో ఆమెను ఒక మార్గదర్శిగా నిలబెట్టారు.
గురువు గానూ మారిపోయిన డాక్టర్
ఆమె సేవలు కేవలం వైద్యంలోనే కాదు. డాక్టర్ శిప్రా ధర్ వారణాసి పరిసరాల్లోని పేద కుటుంబాలకు చెందిన బాలికలకు ఉచితంగా విద్యాబోధన చేస్తారు. ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసి, వారిని ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా బలంగా ఉండేలా పోషిస్తున్నారు. తల్లులు అవుతారన్న ఆశతో ఉన్న బాలికలకు ఆమె శిక్షణతోపాటు ఆత్మవిశ్వాసం కూడా అందిస్తున్నారు.
ఎందుకు ఈ మానవతా సేవ?
ఒక అమ్మాయి చదువుకుంటే ఒక కుటుంబం మారుతుంది. ఒక అమ్మాయి బలంగా పెరిగితే సమాజం మారుతుంది. ఆ మార్పు నా చేతులారా మొదలవాలని నాకు తోచింది నేను చేస్తున్నాను అంటున్నారు ఈ డాక్టరమ్మ. ఈ వ్యవహారంలో డాక్టర్ శిప్రా ధర్ ఒక స్త్రీగా కాక, ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారు. ఆమె చేసిన మంచి పనులు పల్లెలపల్లెలా చాటుతుంటే, మానవత్వం ఇంకా బతికే ఉందని మనం గర్వంగా చెప్పొచ్చు. పసిపాప పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో భయమేం ఉండకూడదు. ఆనందమే మిగలాలి. అలాంటి సమాజాన్ని నిర్మించాలంటే, డాక్టర్ శిప్రా లాంటి వారు మనం గర్వపడే వీరులు కావాలి.