టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలన్ మస్క్ కుటుంబం అయోధ్య రామయ్య ఆశీర్వాదం కోరుకుంటోంది. ఎలన్ మస్క్ తరపున ఆయన తండ్రి ఎరాన్ మస్క్ అయోద్య రామమందిరాన్ని సందర్శించబోతున్నారు. శ్రీరాముడి ఆశీర్వాదం తీసుకోనున్నారు. భారత దేశంలో 5 రోజుల పర్యటనకోసం వచ్చిన ఎరాన్ మస్క్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. పలు వ్యాపార సంస్థల ప్రతినిధులతో భేటీలతోపాటు.. అయోధ్య రామమందిర సందర్శన షెడ్యూల్ కూడా ఖరారైంది.
ఎలన్ మస్క్ వ్యాపార సామ్రాజ్యం గురించి మనకు తెలిసిందే. ఆయన తండ్రి ఎరాన్ మస్క్ కూడా ప్రముఖ వ్యాపారవేత్త. ప్రస్తుతం ఆయన కొడుకు బిజినెస్ లకు సంబంధించిన కీలక వ్యవహారాలు చూసుకుంటున్నారు. అదే సమయంలో ఆయన మరికొన్ని సంస్థలకు తన విలువైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. అంటే ఆయా సంస్థల అడ్వైజరీ కమీటీల్లో ఆయన మెంబర్ గా ఉంటారనమాట. భారత్ లోని సెర్వోటెక్ సంస్థ గ్లోబల్ అడ్వైజరీ కమిటీలో కూడా ఎరాన్ మస్క్ ఒక సబ్యుడు. గత నెలలోనే ఈ నియామకం జరిగింది. ఈ క్రమంలో ఆయన భారత్ లో పర్యటించడానికి వచ్చారు. హర్యానాలో సెర్వోటెక్ సంస్థ సోలార్, ఈవీ చార్జింగ్ యూనిట్లను తయారు చేస్తోంది. ఈ ప్లాంట్ ని విజిట్ చేయడానికి ఎరాన్ మస్క్ వచ్చారు. భారత్ పర్యటనలో భాగంగా పలువురు వ్యాపారవేత్తలు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో ఎరాల్ మస్క్ భేటీ కానున్నట్లు సమాచారం. గ్రీన్ టెక్నాలజీ, ఈవీ ఛార్జింగ్ మౌలికసదుపాయాల ఎగుమతులపై ఆయన ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. భారత పర్యటన అనంతరం జూన్ 6న ఎరాల్ మస్క్ దక్షిణాఫ్రికాకు వెళ్తారు. అయితే ఆయన రామమందిర దర్శనం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు విదేశీ ప్రముఖులు అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. రామ్ లల్లా ప్రశాంత మూర్తిని చూసి ఆధ్యాత్మిక అనుభూతికి లోనైనట్టు తెలిపారు. ఎరాన్ మస్క్ కూడా ఆ జాబితాలో చేరబోతున్నారు.
ఎరాల్ మస్క్ దక్షిణాఫ్రికాకు చెందిన వ్యాపారవేత్త. చిన్న తనంనుంచి ఎలన్ మస్క్ ని స్వతంత్ర భావాలతో పెరిగేలా తీర్చిదిద్దాడు ఎరాల్. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను చిన్న తనంలో కష్టాలు అనుభవించానని, ఆ కష్టాలు తన పిల్లలు పడకూడదనే తాను అనుకుంటానని ఎలన్ చెప్పాడు. ఈ ఇంటర్వ్యూ అంశాలను ఎరాల్ ఖండించారు. ఎలన్ చిన్నప్పుడెప్పుడూ కష్టాలు పడలేదని, రోల్స్ రాయిస్ కారులో స్కూల్ కి వెళ్లేవాడని గుర్తు చేసారు ఎరాల్. అతని పిల్లలు ఇప్పుడు హాయిగా పెరుగుతున్నారని చెప్పారు.
వాస్తవానికి ఎలన్ మస్క్ కూడా భారత్ లో పర్యటించాల్సి ఉంది. అతడిని ఏపీకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని కూటమి ప్రభుత్వం గతంలో ప్రచారం చేసుకుంది. ఇప్పుడు ఎలన్ తండ్రి ఎరాన్ మస్క్ పర్యటన ఆసక్తికరంగా మారింది. గ్రీన్ టెక్నాలజీ, ఈవీ స్టేషన్లు.. ఇతరత్రా పర్యావరణ హిత ఎనర్జీ విషయాల్లో ఎరాల్ మస్క్ పలువురు ప్రముఖులతో భేటీ కావాల్సి ఉంది. మరి ఏపీ నుంచి ఎవరైనా ఎరాల్ తో సంప్రదింపులు జరుపుతున్నారా..? భవిష్యత్తులో అయినా ఏపీ కంపెనీలతో మస్క్ కి లావాదేవీలు ఉండే అవకాశం ఉందా..? వేచి చూడాలి.