Ghaati Release Date: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన అనుష్క (Anushka)ఇటీవల కాలంలో సినిమాలను పూర్తిగా తగ్గించారని చెప్పాలి. సూపర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని అనంతరం స్టార్ హీరోలతో సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇక అనుష్క కెరియర్ మొదట్లోనే అరుంధతి వంటి లేడి ఓరియంటెడ్ సినిమాకు కమిట్ అయ్యి పెద్ద సాహసం చేశారని చెప్పాలి. అప్పట్లో ఈమె తీసుకున్న నిర్ణయానికి అందరూ షాక్ అయ్యారు కానీ, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అనుష్క కెరియర్ పూర్తిగా మారిపోయింది.
విడుదలకు సిద్ధమైన ఘాటి…
ఇలా విభిన్నమైన కథా చిత్రాలలో, లేడీ ఓరియంటెడ్ సినిమాలలోనూ, ప్రయోగాత్మక సినిమాలలో నటిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నారు. ఇక ఈమె హీరో ప్రభాస్ సరసన నటించిన బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత అనుష్క పూర్తిగా సినిమాలను తగ్గించారని చెప్పాలి. ఇటీవల నవీన్ పోలిశెట్టితో కలిసి “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి “అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నారు. ఇక త్వరలోనే అనుష్క ఘాటి(Ghaati) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
మళ్లీ వెనక్కి వెళ్లిన చిరు…
డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నెలలోనే విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా నిర్మాతలు ఈ సినిమాని జూలై 11వ తేదీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారక ప్రకటన ద్వారా తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించగా విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతిబాబు వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాని యూవీ క్రియేషన్ సమర్పణలో ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యెదుగురు రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
నిజానికి జూలై 11వ తేదీ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)హీరోగా నటించిన విశ్వంభర(Vishwambara) సినిమా విడుదల కాబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు ఈ వార్తలపై ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన మాత్రం వెలువడలేదు. అయితే జూలై 11వ తేదీ అనుష్క ఘాటి సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో విశ్వంభర సినిమా విడుదల మరింత ఆలస్యం అవుతుందని స్పష్టమవుతుంది. చిరు, త్రిష హీరో హీరోయిన్లుగా బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలవల్ల తరచూ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాని బహుశా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.