FASTag Annual Pass: దేశంలో జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే వారికి తీపి కబురు. టోల్ గేటు చెల్లింపులు సులభతరం చేసేందుకు కొత్త ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ విధానాన్ని తెరపైకి తెచ్చింది కేంద్రం. ఆగస్టు 15 నుంచి యాన్యువల్ పాస్ అందుబాటులోకి రానున్న కేంద్రం రోడ్డు రవాణా- రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశంలో జాతీయ రహదారులపై టోల్ గేట్ల గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటోంది. రద్దీని తగ్గించేందుకు రకరకాలుగా చర్యలు తీసుకుంటోంది కేంద్రం. అయినా ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా కొత్త పద్దతిని తీసుకొచ్చింది. టోల్ గేటు వద్ద చెల్లింపులు సులభతరం చేసేందుకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ పద్దతిని తీసుకొచ్చింది. ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. ఒక్కసారి పాస్ తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? వాటిపై ఓ లుక్కేద్దాం.
ఏడాది టోల్ గేట్ పాస్ ధర కేవలం రూ.3,000 మాత్రమే. ఒక్కసారి పాస్ తీసుకుంటే ఏడాది పాటు లేకుంటే 200 ట్రిప్పులు పూర్తయ్యే వరకు జాతీయ రహదారులపై ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అది. ఈ సదుపాయం కేవలం ప్రైవేట్ వాహనాలు కార్లు, జీపులు, వ్యాన్‌లకు మాత్రమే. ట్రక్కులు, బస్సులు, ట్యాక్సీలకు అందుబాటులో ఉండదు.
ఫాస్టాగ్ ఏడాది పాస్ వల్ల వాహనదారులకు రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఫాస్టాగ్ వాలెట్‌ను పదే పదే రీఛార్జ్ చేయాల్సిన పని లేదు. దాని వల్ల టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగకుండా వెళ్లవచ్చు. తద్వారా ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఆయిల్ ఖర్చు తగ్గుతోందని భావిస్తోంది. ఇంకా చెప్పాలంటే టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గుతుంది.నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ విషయాన్ని అధికారులు స్వయంగా చెప్పారు.
ALSO READ: మాజీ ప్రధాని మనవడికి జీవిత ఖైదు, అత్యాచారం కేసులో సంచలన తీర్పు
ఫాస్టాగ్ ఖాతాల ద్వారా ఆన్‌లైన్‌లో లేకుంటే దానికి సంబంధించి ఏజెంట్ల వద్ద గానీ ఏడాది పాస్‌ను సులభంగా యాక్టివేట్ చేసుకోవచ్చు. NHAI కి సంబంధించి రాజ్‌మార్గయాత్ర మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. అందుకోసం కొత్తగా ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు.
ఒకే టోల్ ప్లాజా ద్వారా అటు ఇటు కలిసి ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం అవసరం లేదన్నది అధికారుల మాట. ఇదేకాకుండా ఫ్యూచర్‌లో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-GNSS ద్వారా టోల్ సేకరణ విధానాన్ని తీసుకురావాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం.
ప్రతి రోజూ హైవేపై ప్రయాణించే వారికి, ఆఫీసు వెళ్లేవారు, చిన్న పట్టణాల నుండి మెట్రో నగరాల ప్రయాణికులు, వ్యాపారాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఉపశమనం లభించనుంది. ఈ పాస్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ రహదారుల ఎక్స్‌ప్రెస్‌వేలలో మాత్రమే వర్తిస్తుంది.
రాష్ట్ర రహదారులు-స్థానిక సంస్థల రోడ్లు-రాష్ట్ర నిర్వహణ ఎక్స్‌ప్రెస్‌వేలలో టోల్ గేట్ల వద్ద ఈ పాస్ పని చేయదు. ఈ పాస్ మరొకరి బదిలీ చేయబడదు. FASTag అతికించబడిన వాహనానికి మాత్రమే చెల్లుతుంది. ఒక వినియోగదారు దానిని మరొక వాహనంలో ఉపయోగిస్తే అది చెల్లదు.