Prajwal Revanna: అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. 48ఏళ్ల మహిళపై అత్యాచారం చేశారన్న కేసులో ఆయన్ని న్యాయస్థానం దోషిగా తేల్చింది. అంతేకాదు రూ.10లక్షల జరిమానా విధిస్తూ బెంగళూరులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఈ శిక్ష ఖరారు చేసింది. మరోవైపు బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీ-ఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. రేవణ్ణపై నాలుగు లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి. వాటిలో మొదటి కేసుకు సంబంధించి న్యాయస్థానం ఆయన్ని దోషిగా తేల్చింది.
ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు జడ్జి సంతోష్ గజానన్ భట్ ఈ తీర్పు వెల్లడించారు. శిక్ష ఖరారు చేసేముందు పోలీసులు అతడ్ని న్యాయస్థానంలో హాజరుపరిచారు. రేవణ్ణ్‌ను న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ తనకు కనీస శిక్షను విధించాలని అభ్యర్థించారు.
ఆగస్టు ఒకటిన న్యాయమూర్తి ఆయన్ని దోషిగా ప్రకటించారు. తర్వాత న్యాయస్థానంలో ప్రజ్వల్ రేవణ్ణ కంటతడి పెట్టారు. న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన ఏడ్వడం కనిపించింది. కేఆర్ నగరకు చెందిన ఓ మహిళ గతేడాది 28న హొళె నరసీపుర పీఎస్‌లో ప్రజ్వల్ రేవణ్ణపై ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేశాడని పేర్కొంది.
ALSO READ: ఓలా, ఉబర్ లకు షాక్.. ట్యాక్సీ యాప్ ప్రారంభిస్తున్న ప్రభుత్వం
గన్నిగడ ఫాంహౌస్ అందుకు వేదికైనట్టు తెలిపింది. దీని తర్వాత ప్రజ్వల్‌పై మరి కొన్ని అత్యాచార కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా ఏడాదికిపైగానే ప్రజ్వల్ జైలులో ఉండగా తాజాగా శిక్ష ఖరారైంది. గతేడాది మే 2న న్యాయస్థానం కేసు విచారణను మొదలుపెట్టింది.
ప్రాసిక్యూషన్ 1,632 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. అందులో 183 పత్రాలను, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రానికేతర ఆధారాలు ఉన్నాయి. కేసు దాఖలు చేసిన బాధితురాలి కుటుంబం సహా 26 మందిని న్యాయస్థానం విచారించింది. గతేడాది కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి పారిపోయారు.
ఈ కేసు వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఇదే క్రమంలో ప్రజ్వల్ రేవణ్ణ వచ్చి చట్టపరంగా ఎదుర్కోవాలని ఆయన తాత, మాజీ పీఎం హెచ్‌డీ దేవెగౌడ బహిరంగంగా ప్రకటన చేశారు. జర్మనీ నుంచి వచ్చిన రేవణ్ణను గతేడాది మే 31న బెంగళూరు ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్టు చేశారు.
లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు పెన్ డ్రైవ్‌ల నుంచి బయటకు రావడంతో అవన్నీ వైరల్ అయ్యాయి. పెన్ డ్రైవ్‌లలో మొత్తం 2,960 క్లిప్‌లు ఉన్నాయి. అయితే కేసు నమోదు చేసిన వ్యక్తిని కేఆర్ నగర్‌లో బాధితురాలిని రక్షించడంలో మహిళా అధికారులు కీలకపాత్ర పోషించారు.