BigTV English

Jaswant Singh : అరుదైన విదేశాంగ మంత్రి.. జస్వంత్ సింగ్..

Jaswant Singh : అరుదైన విదేశాంగ మంత్రి.. జస్వంత్ సింగ్..

Jaswant Singh : భారతదేశ విదేశాంగ మంత్రిగా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన అతికొద్దిమంది నేతల్లో జస్వంత్‌ సింగ్ ఒకరు. వాజపేయి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన జస్వంత్ సింగ్.. తన పదవీ కాలంలో అనేక అంశాలలో తన వాదనా పటిమతో, మేధస్సుతో అంతర్జాతీయ సమాజాన్ని మెప్పించారు. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగ ఆయన జీవిత విశేషాలు, ఆయన సాధించిన విజయాలను గుర్తుచేసుకుందాం.


జస్వంత్ సింగ్.. 1938 జనవరి 3న రాజస్థాన్‌లోని బార్మెర్‌ జిల్లా జాసోల్‌ గ్రామంలో జన్మించారు. అజ్మీర్‌లోని ప్రసిద్ధ మేయో కాలేజీలో చదువుకున్నారు. కాలేజీలో చేరే నాటికి ఒక్క ముక్క ఇంగ్లిష్ మాట్లాడలేని స్థితి నుంచి డిగ్రీ చేతికొచ్చే నాటికి స్వయంకృషితో గొప్ప ఇంగ్లిష్ వక్తగా మారారు. 1954లో జస్వంత్‌ సింగ్‌ డెహ్రాడూన్‌లోని నేషనల్‌ డిఫెన్స్‌ అకాడెమీకి ఎంపికై, సైన్యంలో సేవలందించారు.

సైన్యంలో తొమ్మిదేళ్ల సర్వీసు పూర్తయ్యాక.. పదవీ విరమణ తీసుకుని బయటికొచ్చి జోధ్‌పూర్‌లో మహారాజా గజ్‌సింగ్‌కు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుడైన జస్వంత్.. 1980, 1986, 1998, 1999, 2004లో రాజ్యసభకు, 1990, 1991, 1996, 2009లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజపేయి 13 రోజుల ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా, 1998లో ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. తర్వాత కొంత కాలానికి విదేశాంగ మంత్రిగా బాధ్యతలు తీసుకుని 2002 వరకు కొనసాగారు.


అటల్‌ బిహారీ వాజపేయి ప్రభుత్వంలో జస్వంత్ సింగ్ పలు సందర్భాల్లో ట్రబుల్ షూటర్‌గా పనిచేశారు. జయలలిత, వాజపేయికి మధ్య వారధిగా ఉంటూ ప్రభుత్వాన్ని సాఫీగా నడిపించేందుకు ప్రయత్నించారు. అలాగే.. జనరల్‌ ముషారఫ్‌కు చెక్‌ పెట్టేందుకు అంతర్జాతీయ స్థాయి వ్యూహాలను రచించారు. పీవీ నరసింహరావు హయాంలో ప్రధాని కార్యాలయంలో ఓ ద్రోహి.. అమెరికాకు ఇచ్చిన సమాచారంతోనే భారత అణుపరీక్షల సమాచారం ముందస్తుగా లీకయిందని ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వ కాలంలో ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.

ఇస్లామిక్ తీవ్రవాదులు నేపాల్ నుంచి భారతీయ విమానాన్ని హైజాక్‌ చేసి కాందహార్‌ తీసుకుపోయిన సందర్భంలో.. ఆ ప్రయాణికులను విడిపించేందుకు నాటి వాజపేయి ప్రభుత్వం ముగ్గురు తీవ్రవాదులను విడుదల చేయడంపై జస్వంత్‌ సింగ్‌ మీద విమర్శలు వెల్లువెత్తాయి. కానీ.. 40 మందికి బదులుగా తాము కేవలం ముగ్గురినే విడుదల చేసి.. ప్రయాణికులందరినీ క్షేమంగా తీసుకొచ్చామని జస్వంత్ సింగ్ తర్వాతి రోజుల్లో తన ఆత్మకథ ‘ఎ కాల్ టు ఆనర్’లో వివరించారు.

జస్వంత్‌ సలహా మేరకే అటల్‌ బిహారీ వాజపేయి ఆగ్రాలో జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌తో శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానించారు. కానీ ఉమ్మడి ప్రకటనపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకుండా చేసిన కొన్ని ‘అదృశ్య శక్తులను’ జస్వంత్ కట్టడి చేయలేకపోయారని అప్పట్లో విమర్శలొచ్చాయి.

పార్టీకి విధేయుడిగా దశాబ్దాలు పనిచేసిన జస్వంత్ సింగ్ ‘జిన్నా ఇండియా – పార్టిషన్‌ ఇండిపెండెన్స్‌’ అనే పుస్తకం రాశారు. 2009 ఆగస్టులో వచ్చిన ఆ పుస్తకంలో జిన్నాను పొగిడారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎట్టిపరిస్థితిలోనూ ఆ పుస్తకాన్ని విడుదల చేయొద్దని జస్వంత్‌కు సూచించినా.. ఆయన దానిని విడుదల చేశారు.

2014లో పార్టీ అదేశాలను కాదని రాజస్థాన్ బార్మర్ లోక్‌సభ వర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినందుకు బీజేపీ ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది. 2014 ఎన్నికలకు ఒక రోజు ముందు ఆయన బాత్రూమ్‌లో జారిపడటంతో తలకు బలమైన గాయమైంది. ఆరేళ్ల పాటు దాదాపు కోమాలోనే ఉన్న జస్వంత్ సింగ్ 2020 సెప్టెంబరు 27న తుదిశ్వాస విడిచారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×