BigTV English

Nepal Viral Video: మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. నేపాల్‌లో భారత మహిళకు భయానక అనుభవం

Nepal Viral Video: మా హోటల్‌కు నిప్పు పెట్టారు.. బయటకు వెళ్లలేని పరిస్థితి.. నేపాల్‌లో భారత మహిళకు భయానక అనుభవం

“చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను, నన్ను కాపాడండి, నాతోపాటు ఉన్న భారతీయుల్ని కాపాడండి. నేపాల్ లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. చాలా చాలా దారుణంగా ఉన్నాయి. ఆందోళనకారులు టూరిస్ట్ లను కూడా వదలడంలేదు. కనిపించిన వారికల్లా హాని తలపెడుతున్నారు. అన్నిటినీ తగలబెట్టేస్తున్నారు. దయచేసి భారతీయ దౌత్య అధికారులారా స్పందించండి, మమ్మల్ని కాపాడండి.” అంటూ ఉపాసన గిల్ అనే భారతీయ యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రఫుల్ గర్గ్ అనే ఒక ఇన్ ఫ్లూయెన్సర్ కి ఆమె ఈ వీడియో పంపించగా, దాన్ని ఆయన తన ఇన్ స్టా లో పోస్ట్ చేశారు.


?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

తగలబెట్టేశారు..
సోషల్ మీడియా బ్యాన్ తదనంతర పరిణామాల నేపథ్యంలో నేపాల్ తగలబడిపోతోంది. జెన్ జెడ్ గా చెప్పుకుంటున్న ఆందోళనకారులు విచక్షణ లేకుండా మారణహోమం సృష్టిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం రాజీనామా చేసి, అధికారం సైన్యం చేతుల్లోకి వెళ్లినా కూడా పరిస్థితిలో మార్పు లేదు. ఇక వీడియోని పంపించిన ఉపాసన గిల్ అనే యువతి వాలీ బాల్ లీగ్ కోసం తాను నేపాల్ వెళ్లానని చెబుతోంది. అక్కడ తనతోపాటు మరికొందరు ఒక హోటల్ లో ఉంటున్నామని, తాను దగ్గర్లోని ఒక స్పాలో ఉన్నప్పుడు హోటల్ ని ఆందోళనకారులు తగలబెట్టారని అంటోంది. హోటల్ రూమ్ లు, రూమ్ లలో ఉన్న సామాన్లు, తన లగేజ్ అంతా తగలబడిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన వెనక నుంచి పెద్ద పెద్ద కర్రలు తీసుకుని ఆందోళనకారులు వెళ్లారని ఆమె భయపడుతూ చెప్పింది. తమకు వెంటనే సహాయం కావాలని, భారత ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఆమె కోరింది. పోఖారా ప్రాంతంలో హోటల్ కి నిప్పు పెట్టారని ఆమె తన వీడియోలో తెలిపింది.


ఎలా వస్తారు?
భారతీయ మహిళ ఆవేదనాభరితమైన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. నేపాల్ లో ప్రస్తుత పరిస్థితికి ఈ వీడియో అద్దం పడుతోంది. వివిధ పనులపై నేపాల్ లో చిక్కుకుపోయిన భారతీయులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొంతమంది తీర్థయాత్రలకోసం నేపాల్ వెళ్లారు. ఉపాసన వంటి వారు వాలీబాల్ లీగ్ కోసం, మరికొందరు పర్యాటక యాత్రల్లో భాగంగా నేపాల్ వెళ్లి చిక్కుకునిపోయారు. వారందర్నీ వెనక్కి రప్పించడం కష్టంగా మారింది. అంతర్జాతీయ విమానాశ్రయాలను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. అసలు విమానాశ్రయాలకు చేరుకోవాలన్నా కూడా భారతీయులకు కష్టంగా మారింది. సైన్యం అధికారాన్ని చేతుల్లోకి తీసుకున్నా కూడా ఆందోళనకారులు వెనక్కు తగ్గలేదు. రాజ్యాంగాన్ని, రాజకీయ వ్యవస్థను మార్చేయాలంటూ వారు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. శాంతియుత వాతావరణం ఎప్పుడు నెలకొంటుందో చెప్పలేని పరిస్థితి. దీంతో స్థానికులతో సహా ఇతర దేశాలనుంచి నేపాల్ వెళ్లినవారు బతుకు జీవుడా అనుకుంటూ బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారు..
తెలుగు రాష్ట్రాలకు చెందిన 261మంది నేపాల్ లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వీరిని తిరిగి రప్పించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఖాట్మండు నుంచి విశాఖకు ప్రత్యేక విమానం ద్వారా బాధితులను రప్పించేందుకు మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితులను సురక్షితంగా రప్పించి, స్వస్థలాలకు పంపిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. నేపాల్ ఎంబసీ, భారత విదేశాంగ శాఖ అధికారులతో లోకేష్ చర్చలు జరుపుతున్నారు.

Related News

Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్ ఘటన.. అసలు కారణం ఇదే

Nepal Protests: భారత్-నేపాల్ సరిహద్దులో ఉద్రిక్తతలు! విమాన సర్వీసుల నిలిపివేత..

Modi-Trump: మోదీ–ట్రంప్ వాణిజ్య చర్చలు.. ఎక్స్ వేదికగా ప్రకటన

Vice President: భారత 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్..

Vice President Election: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. రాధాకృష్ణన్ Vs సుదర్శన్ రెడ్డి

Big Stories

×