FSSAI Warning: ఇంటి నుంచి వీధిలోకి వస్తే చాలు.. చిన్నచిన్న బళ్లు, షాపుల్లో ఇడ్లీ, దోసలు, గారెలు, సమాషాలు పేపర్లలో పెట్టి ఇస్తుంటారు. ముఖ్యంగా న్యూస్ పేపర్లలో పెట్టి వాటిని ఇస్తుంటారు. చాలా శుభ్రంగా ఉందని వినియోగదారుడు భావించి లొట్టలేసుకుని ధీమాగా కబుర్లు చెబుతూ తింటారు. దీనిపై భారత ఆహార ప్రాధికార సంస్థ హెచ్చరిక చేసింది.
FSSAI కొత్త వార్నింగ్.. వాటిని వాడొద్దు
దేశంలో ఈ మధ్యకాలంలో విస్తారంగా న్యూస్ పేపర్లను షాపుల వారు విస్తారంగా ఉపయోగిస్తున్నారు. అడ్డ ఆకులు, ఆరటి ఆకులు కనీసం మచ్చుకైనా వినియోగించడం మానేశారు. చిన్న చిన్న తోపుడు బళ్లు మొదలు, ఓ మోస్తరు షాపుల వారు ఆహార పదార్థాల ప్యాకింగ్, ముఖ్యంగా పకోడీలు, సమాషాలు పంపిణీ కోసం వార్తా పత్రికలను విస్తారంగా ఉపయోగిస్తున్నారు.
న్యూస్ పేపర్లను ఆ విధంగా వినియోగించవద్దని గతంలో ఒకసారి భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ-FSSAI చెప్పింది. ఈసారి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చింది. వీధి వ్యాపారులు, రెస్టారెంట్లు సహా అన్ని రకాల ఆహార విక్రయ సంస్థలు వాటిని నిషేధించాలని, తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది.
తెలిసి ఆరోగ్య సమస్యలు ‘కొని’ తెచ్చుకోవద్దు
వార్తాపత్రికల వినియోగం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు పొంచి ఉన్నాయని ఘాటుగా హెచ్చరించింది. న్యూస్ పేపర్ ప్రింటింగ్‌లో ఉపయోగించే సిరాలో సీసం లాంటి ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయని FSSAI వివరించింది. నూనెతో ఉండే సమోసా, పకోడీ, వడలు వాటిని పేపర్లలో చుట్టినప్పుడు ఆ రసాయనాలు ఆహారంలోకి సులువుగా చేరుతాయి.
దీనివల్ల ఆహారం కలుషితమవుతుంది. ఫలితంగా దీర్ఘకాలంలో క్యాన్సర్, జీర్ణ కోశ వంటి వ్యాధులు వచ్చే అవకాశముంది. అంతేకాదు మూత్రపిండాలు, మెదడుపై ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరించింది. నిబంధన ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
ముంబైలోని ఓ షాపు విక్రయదారుడు వార్తాపత్రికలను వినియోగిస్తున్నట్లు FSSAI-BMC సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో తేలింది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ చేసింది ఆ సంస్థ. 2016, 2023 ఏడాదిల్లో ఇలాంటి మార్గదర్శకాలను విడుదల చేసింది FSSAI. కానీ షాపుల వారు ఆ ఆదేశాలను పెడచెవిన పెట్టారు.
చిన్నారులు, వృద్ధులు, వారిపై ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ రెగ్యులేషన్స్-2018 ప్రకారం.. ఆహార పదార్థాల నిల్వ లేదా సరఫరాకు కేవలం ఫుడ్-గ్రేడ్ మెటీరియల్స్ వాడాలని FSSAI నిబంధనలు చెబుతున్నాయి. తాజాగా ఈ నిబంధనల అమలును క్షేత్రస్థాయిలో కఠినంగా పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాల ఆహార శాఖ అధికారులను ఆదేశించింది.