Rahul Gandhi: విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జీను ప్రశ్నిస్తూ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. జూలై 20న జరిగిన నిరసనల్లో విద్యార్థులపై పెల్లెట్ తుపాకులు, టియర్ గ్యాస్ వంటి ఘోరమైన ఆయుధాలను ఉపయోగించడానికి హోంమంత్రిగా మీరు అనుమతి ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. మీరు కాకుండా మరెవరైనా ఈ ఆదేశాలు జారీ చేశారా? అని సూటిగా నిలదీశారు.
నీట్ పేపర్ లీక్ కు నిరసనగా అభిజీత్ దిప్కే నేతృత్వంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP), విద్యార్థులు దిల్లీలో ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. జూన్ 20న జంతర్ మంతర్ వద్ద మొదలైన ఈ నిరసన.. జూన్ 28న ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలపడంతో జాతీయ స్థాయి ఉద్యమంగా మారింది. వాంగ్‌చుక్ తన ఆమరణ నిరాహార దీక్షను గురువారం విరమించినప్పటికీ విద్యార్థుల డిమాండ్లు ఇంకా నెరవేరలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాల్సింది పోయి విద్యార్థులపై విచక్షణారహితంగా దాడి చేయడం అన్యాయమని లేఖలో తెలిపారు. ఈ దాడిలో వందలాది మంది విద్యార్థులు, విలేకరులు తీవ్రంగా గాయపడ్డారని, మహిళా విద్యార్థినుల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని ఆరోపించారు.
19 ఏళ్ల సాహిల్ లోచాబ్ అనే విద్యార్థి గురించి ప్రస్తావించిన రాహుల్.. అతని కంటికి అయిన తీవ్ర గాయంపై ఆందోళన వ్యక్తం చేశారు. చేతిలో త్రివర్ణ పతాకం పట్టుకుని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువకుడిపై పెల్లెట్ గన్లు ఉపయోగించడం వల్ల అతను ఒక కంటి చూపు కోల్పోయే ప్రమాదంలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: మరో పథకాన్ని పున:ప్రారంభించిన కాంగ్రెస్ సర్కార్.. రూ. 20 వేల ఆర్థిక సహయం!
పోలీసులతో పాటు సాధారణ దుస్తుల్లో వచ్చి విద్యార్థులపై లాఠీలతో దాడి చేసింది ఎవరు? వారిని ఎవరు అనుమతించారు? అని అమిత్ షాను రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ హింసాత్మక ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. బాధితులైన విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: సినిమా రేంజ్ సీన్.. స్తంభం కింద పులి పహారా, దెబ్బకు స్తంభాలెక్కిన ఉద్యోగులు!