Balakrishna:జూలై 26 ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) హైదరాబాద్ ఏఐజి హాస్పిటల్ కి వెళ్లారు తన వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ(Balakrishna)ను పరామర్శించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై వైద్యులతో ప్రత్యేకంగా చర్చించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆయన ఆరోగ్యం గురించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాలయ్య ఆరోగ్యంపై స్పందించిన వైద్యులు..” శస్త్ర చికిత్స పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. అయితే బాలయ్య కోలుకోవడానికి సుమారుగా 6 వారాల సమయం పడుతుంది.. ప్రస్తుతం ఆయన మోకాలికి క్యాప్ అమర్చాము.”అంటూ తెలిపారు.
ఇకపోతే వైద్యులను సంప్రదించి బాలయ్య ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్న నారా చంద్రబాబు నాయుడు.. అనంతరం బాలకృష్ణతో మాట్లాడుతూ..” వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకోవాలని , అలాగే కొన్ని రోజులు షూటింగులు, రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండి, పూర్తి విశ్రాంతి తీసుకోవాలని, ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి” అని సూచించినట్లు సమాచారం. బాలకృష్ణను చంద్రబాబు నాయుడు పరామర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా బాలయ్య త్వరగా కోలుకోవాలని , పూర్తి ఆరోగ్యంగా ఉండాలని శ్రేయోభిలాషులు, అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. బాలకృష్ణ ప్రముఖ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 సినిమా షూటింగ్ చేస్తున్నారు. డిసెంబర్ 24 టార్గెట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని కష్టపడుతున్నారు. అందులో భాగంగానే సినిమాలోని కీలక సన్నివేశాలను కాకినాడ పోర్టులో షూటింగ్ నిర్వహిస్తున్నారు. గోపీచంద్ మలినేని బాలకృష్ణపై తీస్తున్న యాక్షన్ సన్నివేశాలలో బాలకృష్ణ స్టంట్ సీన్ చేస్తుండగా.. ఒక్కసారిగా కాలుజారి కింద పడ్డారు. వెంటనే స్పందించిన చిత్ర బృందం.. ఆయనను సమీపంలోని హాస్పిటల్ కి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఎయిర్ లిఫ్ట్ సహాయంతో బాలకృష్ణను హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ కి తరలించారు.
ALSO READ:వివాదంలో చిక్కుకున్న నోలన్ ‘ది ఒడిస్సీ’ మూవీ.. 2వేల కోట్ల మూవీకి 6 లక్షలు ఇవ్వలేరా?
ఏఐజీ హాస్పిటల్ లో సీనియర్ వైద్య బృందం 3 గంటల పాటు శ్రమించి, బాలయ్యకు శస్త్ర చికిత్స నిర్వహించారు . సర్జరీ సక్సెస్ అవడంతోపాటు బాలయ్య 6 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
బాలకృష్ణకి తగిలిన గాయం కారణంగా NBK 111 సినిమా షూటింగ్ వాయిదా పడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు బాలకృష్ణ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను కొంతకాలం నిలిపివేసి, మిగతా నటీనటులపై షూటింగ్ నిర్వహించాలని గోపీచంద్ మలినేనికి బాలకృష్ణ సూచించినట్లు సమాచారం.
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న రెండవ చిత్రం ఇది.ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందించారు. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త స్టైలిష్ అవతారంలో కనిపించబోతున్నట్లు సమాచారం.