వచ్చే ఏడాది తమిళనాట ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి డీఎంకే, అన్నాడీఎంకేతోపాటు ఇతర పార్టీలు కూడా తమ ఉనికి చాటుకోడానికి రెడీ అయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ కి పొత్తులపై ఆధారపడి అధికార కూటమిలో భాగస్వాములు కావాలనుకుంటున్నాయి. మరోవైపు తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత ప్రముఖ హీరో విజయ్ మాత్రం పొత్తు రాజకీయాలకు తాను దూరం అంటున్నాడు.
విజయ్ సింగిల్ గా..
తమిళ వెట్రి కజగం అనే పార్టీని పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు దళపతి అని అభిమానులు ఆప్యాయంగా పిలుచుకునే విజయం అక్కడ రాజకీయాల రూపు రేఖలు మార్చుతానని అంటున్నారు. 2024 ఫిబ్రవరిలో విజయ్ తన పార్టీ టీవీకేని ప్రారంభించారు. అయితే అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయలేదు. అసెంబ్లీ ఎన్నికలపైనే తన ఫోకస్ అని ఆయన ప్రకటించారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని తాజాగా నిర్ణయించింది.
పవన్ తో పోలిక..
ఆమధ్య విజయ్ పొలిటికల్ ఎంట్రీని చాలామంది పవన్ కల్యాణ్ తో పోల్చి చూశారు. పవన్ కల్యాణ్ లాగే విజయ్ కూడా తమిళనాట కూటమి రాజకీయాలను ప్రోత్సహిస్తారని అనుకున్నారంతా. కూటమి రాజకీయాలు కలసి వస్తే విజయ్ కూడా శక్తిమంతమైన నేతగా ఎదుగుతారని, అతి పెద్ద పోస్ట్ సాధిస్తారని ఊహించారు. కానీ విజయ్ ఆ పని చేయలేదు. సింగిల్ గా పోటీ చేస్తామంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము యూపీఏ, ఎన్డీఏ కూటముల్లో చేరబోమని ఆయన స్పష్టం చేశారు. డీఎంకే, ఎండీఎంకే కూటముల్లో లేని పార్టీలకు తన పార్టీ నాయకత్వం వహిస్తుందని అంటున్నారాయన.
తమిళనాట సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమావాళ్లు రాజకీయాల్లో బాగా సక్సెస్ అయ్యారు, ముఖ్యమంత్రులు కాగలిగారు. అయితే ఇటీవల కాలంలో సినిమా హీరోలకు రాజకీయాలు అస్సలు కలసి రాలేదనే చెప్పాలి. రజినీకాంత్ పెద్ద ఎత్తున హడావిడి చేసి, చివరకు పార్టీయే లేదని తేల్చి చెప్పారు. విజయ్ కాంత్ ఓ దశలో కింగ్ మేకర్ అనిపించుకున్నా.. ఆయన జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇక కమల్ హాసన్ సింగిల్ గా ఏమీ సాధించలేకపోయారు. ఇటీవల డీఎంకే పొత్తుతో రాజ్యసభకు ఎన్నిక కాగలిగారు. తర్వాతి తరం హీరోల్లో విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.
సినిమాల్లో విజయ్ సూపర్ స్టార్ గా ఎదిగారు. 1900లలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్, మొదట రొమాంటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తర్వాత మాస్ హీరోగా ఎదిగాడు. రజినీకాంత్ తర్వాత ఆ స్థాయిలో విజయ్ ఫ్యాన్ బేస్ పెంచుకున్నారు. విజయ్ సినిమాలకు కూడా మంచి మార్కెట్ ఉంది. సినిమాల్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న టైమ్ లోనే విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విజయ్ తమిళనాడు వ్యాప్తంగా పర్యటన మొదలు పెడతారని టీవీకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఆనంద్ తెలిపారు. గ్రామ గ్రామానికీ వెళ్లి పార్టీ సిద్ధాంతాలను ఆయన ప్రజలకు చేరవేస్తారని, వచ్చే ఏడాది ఎన్నికల్లో టీవీకే విజయం ఖాయమని అన్నారు.