Tamilnadu: ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రభుత్వాలు రకరకాలు పథకాలు తీసుకొస్తున్నాయి. దీన్ని తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు కొందరు మోసగాళ్లు. అంతేకాదు తమపై కోపంగా ఉన్నవారికి ఫోన్ చేసి కొత్త పథకాలంటూ మభ్యపెడుతున్నాయి. ఆ ఉచ్చులో పడి కొందరు మహిళలు మోసపోతున్నారు. తాజాగా అలాంటి ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.
పథకాల పేరుతో మహిళలకు టోకరా-కొన్ని సినిమాల సీన్లు.. కొందరు వ్యక్తుల జీవితంలో కనిపిస్తుంటాయి. రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమా సీన్ రిపీట్ అయ్యింది. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్టయ్యింది. అత్తిలి సత్తిబాబు గెటప్‌లో మహిళలను మోసం చేయించి గుండు కొట్టిస్తాడు నటుడు. సరిగ్గా అలాంటి సీన్ వెలుగులోకి వచ్చింది. ట్రెండ్‌కు తగ్గట్టుగా ఫోన్ కాల్ చేసి చెప్పడంతో గుండు కొట్టించుకున్నారు, చివరకు తాము మోసపోయామని లబోదిబోమన్నారు.
తమిళనాడులో మోసపోయిన మహిళలు-తమిళనాడులోని సేలంలో దారుణమైన మోసం బయటపడింది. ప్రభుత్వ పథకం పేరుతో కొందరు వ్యక్తులను మహిళలను నమ్మించారు. వారి చేత గుండు గీయించుకునేలా చేశారు. జుట్టు ద్వారా ఓ కొత్త వ్యాధి వ్యాపిస్తోందని, గుండు చేయించుకుంటే దాన్ని నివారించవచ్చని చెప్పడంతో నిజమేనని నమ్మేశారు. మోసపోయామని భావించి పోలీసులను ఆశ్రయించారు.
వ్యాధి పేరుతో మోసం-సేలం జిల్లా పుదుక్కోత్తంపాడు గ్రామానికి చెందిన ఓ మహిళకు మూడు రోజుల కిందట ఓ ఫోన్ కాల్ వచ్చింది. అత్తూరు తహసీల్దార్ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తి, కరోనా తరహాలో కొత్త వ్యాధి వ్యాపిస్తోందని చెప్పాడు. దీని నివారణకు ఒక్కటే మార్గమని తెలిపాడు. అందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకం ప్రవేశపెట్టిందని వివరించాడు.
గుండు కొట్టించుకుంటే 15 వేలు అంటూ –గుండు చేయించుకున్న మహిళలకు రూ.15 వేల బ్యాంక్ అకౌంట్లో వేస్తారని నమ్మబలికాడు. కాలేజీ విద్యార్థినులకు రూ.45 వేలు, పురుషులకు రూ.6 వేలు చొప్పున ఇస్తారని నమ్మించాడు. ఆ వ్యక్తి తన మాటలు నమ్మేందుకు సదరు మహిళ ఫోన్ వాట్సాప్‌కు కు రూ.500 నోట్ల కట్టల చిత్రాలు పంపించాడు. అది నిజమేనని అనుకుంది సదరు మహిళ.
పోలీసులకు ఫిర్యాదు-ఈ విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో ముగ్గురు మహిళలు స్థానిక సెలూన్‌కు వెళ్లి గుండు చేయించుకున్నారు. వారిలో చిత్ర, రామాయి, కావేరి అనే మహిళలు ఉన్నారు. వారంతా 60 ఏళ్లు పైబడినవారే. ఆ తర్వాత డబ్బుల కోసం ఆ వ్యక్తికి కాల్ చేశారు. అతడి మొబైల్ స్విచ్ఛాఫ్ అని రావడంతో అనుమానంతో అత్తూరు తాలూకా ఆఫీసుకు వెళ్లారు.
ALSO READ: రాజకీయాల్లో ఏజ్ లిమిట్ ఎప్పుడు? సిద్ధరామయ్య కామెంట్స్‌తో ముదిరిన చర్చ!
అక్కడి అధికారులతో మాట్లాడారు. అలాంటి పథకం ఏదీ లేదని చెప్పడంతో తాము మోసపోయామని భావించారు బాధిత మహిళలు. నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీంతో సంబంధం ఉందన్న అనుమానంతో ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.