Mallikarjun Kharge: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీ ప్రభుత్వం , ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లో దశాబ్దాలుగా బీజేపీ పాలన సాగుతున్నప్పటికీ, తాగునీటి వ్యవస్థ తీవ్రంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు నీటి సరఫరాపై చేస్తున్న భారీ ప్రకటనలు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయని ఖర్గే విమర్శించారు.
కలుషిత నీరు ఖాళీ అవుతున్న కుళాయిలు
‘ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు’ అందిస్తున్నామన్న ప్రధాని మోదీ వాదనలు కలుషిత నీటితో కొట్టుకుపోయాయని ఖర్గే ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో సేకరించిన పది నీటి నమూనాలలో తొమ్మిది తాగడానికి పనికిరావని నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు. 2004లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించిన ‘సుజలం-సుఫలం’ పథకం నుండి, ప్రధాని అయ్యాక తీసుకొచ్చిన ‘జల్ జీవన్ మిషన్’ వరకు అన్నీ ఉత్త హామీలుగానే మిగిలిపోయాయని, గుజరాత్ ప్రజలు నేటికీ నీటి కోసం తహతహలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగ్ నివేదిక, క్షేత్రస్థాయి దారుణాలు
2022 నాటికే 100 శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చేశామన్న బీజేపీ ప్రభుత్వ వాదనల్లోని అసత్యాలను కాగ్ నివేదిక బట్టబయలు చేసిందని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికీ దాదాపు 14 లక్షల కుటుంబాలు తాగునీటి కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. అహ్మదాబాద్ జిల్లాలోని ధోల్కాలో కలుషిత నీరు తాగడం వల్ల గత వారమే 54 మంది ప్రాణాలు కోల్పోవడం గుజరాత్‌లోని నీటి పరిపాలన వైఫల్యానికి పరాకాష్ట అని విమర్శించారు.
ఎండిపోతున్న సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు
సౌరాష్ట్రలోని రాజ్‌కోట్, జామ్‌నగర్ వంటి నగరాల్లో ఇప్పటికీ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందన్నారు. కచ్-సౌరాష్ట్ర ప్రాంతాల రైతులు సాగునీరు లేక కరువుతో అల్లాడుతున్నారని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ చేస్తామని రంగురంగుల చిత్రాలతో ప్రచారం చేస్తున్న బీజేపీ, 28 ఏళ్ల పాలనలో ప్రజలను మోసం చేస్తూనే ఉందన్నారు. బీజేపీ మార్కు ‘సుజలం-సుఫలం’ అంటే స్వచ్ఛమైన నీరు లేకపోవడం.. పంటల్లో సమృద్ధి లేకపోవడమేనని ముగించారు.
Also Read: గణేష్ నిమజ్జనంపై రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు, నిర్వాహకులకు సంచలన ఆదేశాలు!