Modi Putin: న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాధినేతలు.. రాజకీయ, ఆర్థిక, రక్షణ, ఇంధన, అంతరిక్ష, నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల మార్పిడితో పాటు ప్రజా సంబంధాల విస్తరణపై లోతుగా చర్చించారు.
ద్వైపాక్షిక సమావేశానికి ముందు ఇరువురు నేతలు ఒకరినొకరు ఆత్మీయంగా కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా తమిళ కవి తిరువళ్లువర్ రచించిన ప్రసిద్ధ ‘తిరుక్కురళ్’ రష్యన్ అనువాద ప్రతిని పుతిన్‌కు ప్రధాని మోదీ కానుకగా అందించారు. వ్యవసాయం, రైతుల ప్రాముఖ్యతను వివరించే ఈ గ్రంథం.. ఇరు దేశాల సాంస్కృతిక బంధానికి ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని ఆకాంక్షించారు. సమావేశం అనంతరం నేతలిద్దరూ ఒకే కారులో ప్రయాణించారు. ఇలా మోదీ, పుతిన్ ఒకే కారులో ప్రయాణించడం ఇది మూడోసారి కావడం విశేషం.
Delighted to meet President Putin in Delhi, less than two weeks after our meeting in Bishkek.
During today’s meeting we talked about:
Closer trade ties, including implementation of the Programme for Economic Cooperation 2030.
Cooperation in areas like infrastructure, energy,… pic.twitter.com/nLaMDxnDEc
— Narendra Modi (@narendramodi) September 11, 2026
మోదీ, పుతిన్ భేటి సందర్భంగా పలు అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం, నౌకా వాణిజ్యానికి ఎదురవుతున్న ముప్పుపై ఇరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ఈ ప్రాంతాల్లో భారతీయ నావికుల రక్షణ, భద్రతపై మోదీ, పుతిన్ ప్రత్యేకంగా చర్చించారు. అటు ఉక్రెయిన్ సంక్షోభం కూడా భేటిలో చర్చకు వచ్చింది. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను రష్యా అధ్యక్షుడు మోదీకి వివరించారు.
మరోవైపు రక్షణ, వ్యూహాత్మక బంధం బలోపేతంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఇప్పటికే కొనసాగుతున్న రక్షణ ప్రాజెక్టులతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే భాగస్వామ్యాలపై సమీక్షించారు. కాగా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా వెలుపల పుతిన్ ముఖాముఖిగా పాల్గొంటున్న తొలి బ్రిక్స్ సదస్సు ఇదే కావడం గమనార్హం. అయితే ఆగస్టు 31న బిష్కెక్ లో జరిగిన ఎస్సీఓ సదస్సులో మోదీ, పుతిన్ కలుసుకోగా.. తిరిగి రెండు వారాల వ్యవధిలోనే ఇరువురు మరోమారు కలుసుకోవడం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్యసంబంధాలకు అద్దం పడుతోంది.
Also Read: ఇయర్‌ఫోన్లు వాడుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. 60/60 రూల్ పాటిస్తే అంతా సెట్!
ఇదిలా ఉంటే న్యూదిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రేపు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 12, 13 తేదీల్లో జరగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు 11 దేశాలకు సంబంధించిన అధినేతలు, ప్రతినిధులు భారత్ కు వస్తున్నారు. ఇప్పటికే పుతిన్ తో పాటు ఇరాన్ అధ్యక్షుడు భారత్ కు చేరుకున్నారు. చైనా అధినేత జిన్ పింగ్ సైతం ఈ భేటిలో పాల్గొనేందుకు భారత్ కు రాబోతున్నారు. ఈ సదస్సులో బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నేతలు పాల్గొని ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
Also Read: అర్జెంటీనాలో అకస్మాత్తుగా మాయమైన సముద్రం? అసలు కారణం ఇదేనట!