Pahalgam Terror Attack : నరమేధం. ఊచకోత. మారణహోమం. మనుషులు కాదు సైతాన్‌లు. హిందువులని కన్ఫామ్ చేసుకొని మరీ కాల్చి చంపారు. కాళ్ల మీద పడినా వదిలలేదు. పహల్గాం ఘాతుకానికి భారత్ గట్టి ప్రతీకార చర్యలు చేపట్టింది. వీసాలు రద్దు చేయడం.. పాకిస్తానీయులను దేశం నుంచి వెళ్లగొట్టడం.. సింధూ జలాల ఒప్పందం రద్దు.. తదితర చర్యలతో స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తోంది. ఇంత జరుగుతుంటే.. ప్రఖ్యాత BBC మీడియా సంస్థ మాత్రం విషయాన్ని మరో రకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఆ ఉగ్రవాదులను మిలిటెంట్లు అని ప్రస్తావించడం.. పాకిస్తాన్ దేశం భారతీయులకు వీసాలు రద్దు చేసిందంటూ హెడ్డింగ్స్ పెట్టడం లాంటి చర్యలతో తన శాడిజాన్ని ప్రదర్శించింది. అంతే. ఇండియాన్స్ అంతా బీబీసీపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆ మీడియాను చీల్చిచెండాడుతున్నారు. మేటర్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. బీబీసీ ఓనర్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇదే సమయంలో.. పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్ న్యూస్ ఛానెళ్లు, పనికిమాలిన యూట్యూబ్ ఛానెల్స్ ఇష్టారీతిలో రెచ్చిపోయాయి. భారత్‌కు వ్యతిరేకంగా, టెర్రరిస్టులకు మద్దతుగా పిచ్చిపిచ్చి వార్తలు ప్రసారం చేశాయి. ఇంత పనికొస్తారా అంటూ ఆ పాక్ మీడియా సంస్థలపై కన్నెర్ర చేసింది భారత ప్రభుత్వం. 16 న్యూస్ ఛానెల్స్‌పై వేటు వేసింది.
బీబీసీ.. ఇదేం పని?
BBC. అంతర్జాతీయంగా క్రెడిబిలిటీ ఉన్న సంస్థ. భారత్ విషయంలో మాత్రం డివైడ్ టాక్ ఉంది. బ్రిటన్ కేంద్రంగా నడిచే బీబీసీ.. ఇండియాలో మాత్రం న్యూట్రల్ మీడియా సంస్థ కాదనే విమర్శ చాలాకాలంగా వినిపిస్తోంది. స్లో పాయిజన్‌గా మోదీ సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు ఇస్తుందనే ఆరోపణ ఉంది. గతంలో బీబీసీ ఇండియాకు నోటీసులు కూడా అందాయి. ఆ సంస్థ కార్యాలయంపై కేంద్ర సంస్థలు సోదాలు కూడా చేశాయి. లేటెస్ట్‌గా, పహల్గాం ఉగ్రదాడి వ్యవహారంలో బీబీసీ వార్తా కథనంపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. “కశ్మీర్‌లో పర్యాటకులపై ఘోరమైన దాడి తర్వాత పాకిస్తాన్ భారతీయులకు వీసాలను నిలిపివేసింది”.. అంటూ హెడ్డింగ్ పెట్టింది బీబీసీ. అంటే.. పర్యాటకులను భారతే చంపిందనే మీనింగ్ వస్తోంది.. అందుకు ప్రతీకారంగా పాకిస్తాన్ ఇండియన్స్‌కు వీసాలు రద్దు చేసిందనే భావం కనిపిస్తోంది ఈ హెడ్డింగ్‌లో.. అనేది ఆరోపణ. అదే వార్తా కథనంలో ఉగ్రదాడిని మిలిటెంట్ దాడిగా వ్యాఖ్యానించింది. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీబీసీ హెడ్ జాకీ మార్టిన్‌కు ఓ లేఖ కూడా రాసింది. ఇకపై బీబీసీ న్యూస్ కవరేజీపై ఓ కన్నేసి ఉంచుతామని కేంద్రం తెలిపింది.
న్యూయార్క్ టైమ్స్‌కు షాక్
ఇటీవల అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ కూడా పహల్గాం అటాక్‌ను మిలిటెంట్ దాడిగా ప్రస్తావిస్తూ వార్తలు రాసింది. దానిపై ట్రంప్ సర్కార్ సైతం సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఆ పేపర్ క్లిప్పింగ్‌లో ఉన్న మిలిటెంట్ అనే పదాన్ని కొట్టేసి.. దాని ప్లేస్‌లో ఉగ్రదాడి అని రాసి.. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది యూఎస్ హౌస్ పానెల్. వాస్తవాలు తెలుసుకుని ప్రసారం చేయాలని న్యూయార్క్ టైమ్స్‌కు మొట్టికాయలు వేసింది.
పాక్ మీడియా బరితెగింపు
బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ లాంటి ప్రఖ్యాత మీడియా సంస్థలే ఇలా చేస్తే.. ఇక పాకిస్తాన్ మీడియా ఇంకే రేంజ్‌లో రెచ్చిపోయిందో ఊహించుకోవచ్చు. పాక్‌లో టాప్ మీడియా సంస్థ ‘డాన్ న్యూస్’ తమ దేశానికి మద్దతుగా ఇష్టారీతిలో వార్తలు ప్రచురించింది. జియో న్యూస్, సామా టీవీ, ARY న్యూస్, బోల్ న్యూస్, రఫ్తార్.. లాంటివి పిచ్చిపిచ్చి వార్తలు రాశాయి. అధికారిక మీడియానే ఇలా ఉంటే.. చిల్లరమల్లర యూట్యూబ్ ఛానెల్స్ తమ పైత్యం మొత్తం ప్రదర్శించాయి. ఉగ్రవాదులకు, పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా.. భారత్ మీద విషం చిమ్మాయి.
జియో న్యూస్ మరియు సునో న్యూస్ అనే వార్తా సంస్థలకు చెందిన యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. జర్నలిస్టులు ఇర్షాద్ భట్టి, అస్మా షిరాజీ, ఉమర్ చీమా మరియు మునీబ్ ఫరూఖ్ ల యూట్యూబ్ ఛానెల్స్ కూడా నిషేధించబడ్డాయి. నిషేధించబడిన ఇతర హ్యాండిళ్లలో ది పాకిస్తాన్ రిఫరెన్స్, సమా స్పోర్ట్స్, ఉజైర్ క్రికెట్ మరియు రజి నామా ఉన్నాయి. దీంతో రంగంలోకి దిగిన మోదీ సర్కారు.. ఆ పాక్ మీడియాపై ఇండియాలో నిషేధం విధించి గట్టి దెబ్బ కొట్టింది.
పాక్ యూట్యూబ్ ఛానెల్స్‌కు చెక్
పాక్‌కు చెందిన పలు మీడియా సంస్థలు, 16 యూట్యూబ్ ఛానెళ్లపై వేటు వేసింది భారత ప్రభుత్వం. కొంతమంది పాక్ జర్నలిస్టుల ఖాతాలనూ సస్పెండ్ చేసింది. మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఛానెల్‌పైనా ఇండియాలో బ్యాన్ విధించింది. ఆ 16 యూట్యూబ్ ఛానెళ్లకు కలిపి.. సుమారు 63 మిలియన్ల సబ్‌స్కైబర్స్ ఉన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కథనాలు ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఆయా యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఛానెల్స్‌ను ఇండియాలో యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తే.. ” ఈ కంటెంట్ ప్రస్తుతం ఈ దేశంలో అందుబాటులో లేదు.” అనే మెసేజ్ కనిపిస్తుంది. మరిన్ని వివరాల కోసం, దయచేసి Google ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్ (transparencyreport.google.com) ని సందర్శించండి.” అని సూచిస్తుంది.
వరుస చర్యలతో పహల్గాం ఉగ్రదాడి విషయంలో భారత ప్రభుత్వం ఎంత సీరియస్‌గా ఉందో తెలుస్తోంది. ఓవైపు ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగిస్తూ.. పాకిస్తాన్‌పై ఆంక్షల యుద్ధం చేస్తూ.. ఆ మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంటూ.. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడంలో తగ్గేదేలే అనే మెసేజ్ బలంగా చాటుతోంది.