అయితే భద్రతా బలగాలకు ఆపరేషన్ సవాల్‌గా మారుతోంది. నేవీ డ్రోన్లు, జీపీఎస్‌ల సాయంతో కర్రెగుట్టలో ఓ గుహను గుర్తించారు. మరిన్ని గుహలు ఉండొచ్చని బలగాల అనుమానిస్తున్నారు. అయితే నక్సల్స్ మరో ప్రాంతానికి వెళ్లి ఉండొచ్చని సందేహాలు వ్యక్తమౌతున్నాయి. మోస్ట్ వాంటెండ్ మావోయిస్టులు హిడ్మా, దేవా లక్ష్యంగా ముమ్మర కూంబింగ్ జరుగుతోంది. రెండు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకొని వేట కొనసాగుతోంది. నిత్యం 4 హెలికాప్టర్లతో కర్రెగుట్టల చుట్టూ పహారా కాస్తున్నారు. మరోవైపు రాత్రి వేళల్లో ఫ్లాష్ బాంబులతో బలగాల దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సమీప గ్రామాల ఆదివాసీలు బిక్కుబిక్కుమంటూ జంకుతున్నారు.
గుట్టల్లోని రాళ్లపై రక్తపు మరకలు, చెట్ల సందుల్లో చర్మపు ముద్దలు. కర్రెగుట్టల్లో అడుగు పెట్టాలంటే.. ఒకటికి 100 సార్లు ఆలోచించాలి. ఒకప్పుడు ఈ ప్రాంతం పేరు వింటేనే.. భయంతో వణికిపోవాల్సిన పరిస్థితులుండేవి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో సుమారు 40 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి కర్రెగుట్టలు, కొప్పు గుట్టలు, కోడిపుంజు గుట్టలు. ఈ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు గెరిల్లా బేస్ క్యాంపుగా, షెల్టర్ జోన్‌గా పనిచేసింది. తర్వాత దండకారణ్యం కేంద్రంగా కార్యకలాపాలు పెరగడంతో.. మావోయిస్టులు కర్రెగుట్టలను వదిలి ఛత్తీస్‌గఢ్ అడవుల్లోకి వెళ్లిపోయారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మావోయిస్టులు విడుదల చేసిన ఓ లేఖతో.. కర్రెగుట్టలు చర్చల్లోకి వచ్చాయ్. అదే ఇప్పుడు స్థానికులను భయపెడుతోంది.
2026 మార్చి నాటికి మావోయిస్టుల ఉనికే లేకుండా చేయాలనే లక్ష్యంతో.. కేంద్ర బలగాలు ఆపరేషన్ కగార్ పేరుతో అడవులని జల్లెడ పడుతున్నాయ్. మావోయిస్టుల కంచుకోటలన్నీ సాయుధ బలగాల ఆధీనంలోకి వెళ్లిపోతున్నాయి. సేఫ్ జోన్ల కోసం ఎదురుచూస్తున్న మావోయిస్టులకు.. ఇప్పుడు కర్రెగుట్టలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయ్. అందుకోసమే కర్రిగుట్టల చుట్టూ వందల సంఖ్యలో ల్యాండ్ మైన్స్ అమర్చి.. రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసుకున్నారనే చర్చ సాగుతోంది. దీనికి సంబంధించి వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖ కూడా విడుదల చేశారు. కర్రెగుట్ట చుట్టూ మందుపాతరలు అమర్చామని.. వేట పేరుతో స్థానికులెవరూ గుట్టపైకి రావొద్దని హెచ్చరించారు.
గడిచిన కొద్ది నెలల్లో.. మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబ్స్ కారణంగా ఇద్దరు స్థానికులు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ముకునూరుపాలెం గ్రామానికి చెందిన పెంటయ్య.. పశువులు మేపేందుకు వెళ్లి ప్రెషర్ బాంబుపై కాలు వేశాడు. అది పేలడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. కొంగల గ్రామానికి చెందిన ఇల్లందుల ఏసు.. వెదురు కర్రల కోసం వెళ్లి.. బాంబు పేలి చనిపోయాడు. బీజాపూర్ జిల్లాలోని బెడం మల్లన్న ఆలయానికి దైవదర్శనానికి వెళ్తుండగా.. ప్రెషర్ బాంబు పేలి సునీత అనే మహిళ తన ఎడమకాలు కోల్పోయింది. వేర్వేరు ఘటనల్లో అంకన్న గూడానికి చెందిన బొగ్గుల నవీన్, ఇప్పగూడెంకు చెందిన బొగ్గుల కృష్ణమూర్తి.. అంగవైకల్యానికి గురయ్యారు.
Also Read: స్మితా సబర్వాల్‌కు రేవంత్ సర్కార్ షాక్.. పోస్టింగ్ ఎక్కడంటే..?
కర్రెగుట్టలను మైన్స్ ఫ్రీ గుట్టలుగా మార్చేందుకు ములుగు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తరచుగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు, సాయుధ బలగాల కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 20కి పైగా బాంబుల్ని గుర్తించి నిర్వీర్యం చేశారు. అయినప్పటకీ ఎక్కడో ఓ చోట ప్రెజర్ బాంబులు పేలుతూనే ఉన్నాయ్. అమాయకుల్ని బలితీసుకుంటూనే ఉన్నాయి.
మావోయిస్టులు ఇటీవల విడుదల చేసిన లేఖ.. పోలీసులకు కొత్త సవాల్ విసిరినట్లైంది. తమ ఉనికిని కాపాడుకునేందుకు మావోయిస్టులు కర్రెగుట్టల కేంద్రంగా ప్రెజర్ బాంబులు అమర్చారు. వాటిని ఎలా నిర్వీర్యం చేస్తారు.. మావోయిస్టులకు ఎలా చెక్ పెడతారనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం.. కర్రెగుట్టలపై పోలీసులు నిఘా కొనసాగుతోంది.