Indian Economy : ఆర్థిక వృద్ధిలో భారత్ దూసుకుపోతుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించింది. దేశీయంగా తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగా భారత్ స్థూల దేశీయోత్పత్తి (GDP)ని గణనీయంగా పెంచుకుందని వెల్లడించింది. కేవలం పదేళ్లల్లోనే రెట్టింపు ప్రగతిని నమోదు చేసినట్లుగా తెలిపింది. 2015లో దేశ ఆర్థిక వ్యవస్థ $2.1 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, పదేళ్లు తిరిగే సరికి 2025 నాటికి $4.3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ అభివృద్ధి ఓ ఆర్థిక మైలురాయి అని ఆర్థిక నిపుణులు ప్రశంసిస్తున్నారు. అమెరికా సహా మిగతా యూరోప్ దేశాలు సైతం ఆర్థిక వృద్ధిలో తడబాటు ప్రదర్శిస్తుంటే.. భారత్ మాత్రం గత పదేళ్లల్లో 105% పెరుగుదలను సూచించింది. ఇది ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో అపూర్వమైన వృద్ధి రేటు అంటూ ఆర్థిక సంస్థలు తెలుపుతున్నాయి.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి ద్రవ్యోల్బణం-సర్దుబాటు చేసిన డేటా ప్రకారం.. భారత్ దశాబ్ద కాలంలో 77 శాతం GDP వృద్ధిని నమోదు చేసినట్లు తెలుపుతుండగా.. ఈ వేగవంతమైన విస్తరణతో భారత్ ప్రపంచంలోని అగ్ర శ్రేణి ఐదు ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా చేరింది. ఈ వృద్ధి రేటు ఇలానే కొనసాగుతుందనే అంచనాల మధ్య.. 2025లో జపాన్ ఆర్థిక వ్యవస్థను , 2027 నాటికి జర్మనీ ఆర్థిక వ్యవస్థను భారత్ అధిగమించే అవకాశాలున్నాయి.
ఈ అసాధారణ విజయం వెనుక కేంద్ర ప్రభుత్వం అనుసరించిన అనేక నిర్ణయాలు ప్రభావం చూపుతున్నాయని అంటున్నారు. చురుకైన ఆర్థిక విధానాలు, సాహసోపేతమైన నిర్మాణాత్మక సంస్కరణలు, సులువుగా వ్యాపారం నిర్వహించుకునే అవకాశం ఉండడం ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఇంత వేగంగా ఏనాడు వృద్ధి బాటలో పయనించలేదంటూ ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదే సమయంలో చైనా 74 శాతం జీడీపీ వృద్ధిని నమోదు చేసింది. 2015లో డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ $11.2 ట్రిలియన్ డాలర్ల నుంచి 2025లో $19.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అమెరికాను అధిగమిస్తుందనే అంచనాలు మాత్రం నిజం కాలేదు. పైగా.. మహమ్మారి కొవిడ్ ప్రభావం, ఆ దేశంలోని స్థిరాస్తి, నిర్మాణ రంగాల్లోని సవాళ్లు చైనా ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందిగా మారాయి.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నివేదిక ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తన హోదాను నిలుపుకుంది. యూఎస్ GDP 2015లో $23.7 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా 2025లో $30.3 ట్రిలియన్లకు విస్తరించింది. ఇది 28 శాతం వృద్ధి రేటును సూచిస్తోంది. ఆసియా ఆర్థిక వ్యవస్థల కంటే నెమ్మదిగా ఉన్నప్పటికీ.. ప్రపంచ ఆర్థిక స్థిరత్వంలో US ఇప్పటికీ ఆధిపత్య శక్తిగా ఉన్నట్లుగా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ జాబితాలో ప్రపంచంలోనే ప్రధాన ఆర్థిక శక్తులుగా ఉన్న యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ వంటి ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థలు దశాబ్ద కాలంలో.. 6% నుంచి 14% వరకు జీడీపీ వృద్ధిని నమోదు చేశాయి. మొత్తంగా.. ఈ దేశాల ఆర్థిక వృద్ధి నెమ్మదిగా విస్తరణ జరిగినప్పటికీ, ఈ దేశాలు ప్రపంచ వాణిజ్యం, ఆర్థిక రంగంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి.
ALso Read : Tejas MK 1A : మన తేజస్ లకు యూఎస్ ఇంజిన్లు – శరవేగంగా సరఫరా చేసేందుకు సిద్ధం
టాప్ టెన్ ఆర్థిక వ్యవస్థలలో బ్రెజిల్ అత్యల్ప GDP వృద్ధిని నమోదు చేసింది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ 2015లో $2.1 ట్రిలియన్ డాలర్లు ఉండగా 2025లో $2.3 ట్రిలియన్లకు మాత్రం పరిమితం కాగా.. వృద్ధి రేటు కేవలం 8 శాతంగానే నమోదైంది. 2014లో దేశంలో నిత్యవసర ధరల పతనం దేశ ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం చేయగా.. ఇది దీర్ఘకాలిక మాంద్యానికి దారితీసింది. అదే సమయంలో కొవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడిన అంతరాయాలతో ఇది మరింత తీవ్రమైంది.