Pakistan Train Blast: పాకిస్థాన్ మరోసారి హింసకు పాల్పడింది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) జరిపిన తాజా దాడిలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు లక్ష్యంగా చేసుకుంది. సింధ్–బలూచిస్థాన్ సరిహద్దు సమీపంలోని సుల్తాన్‌కోట్ ప్రాంతంలో జరిగిన భారీ పేలుళ్లతో.. రైలు ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా, మరికొందరు సైనికులు మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఘటన వివరాలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్వెట్టా వైపు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు.. సుల్తాన్‌కోట్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో.. రైల్వే ట్రాక్‌పై ముందుగా అమర్చిన IED బాంబులు ఒక్కసారిగా పేలాయి. భారీ శబ్దంతో పరిసర ప్రాంతం దద్దరిల్లిపోయింది. పేలుడు ధాటికి రైలు వెనుక భాగంలోని బోగీలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రైలులో ఉన్న పలువురు ప్రయాణికులు, భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
రక్షణ చర్యలు, గాయపడిన వారి తరలింపు
పేలుడు జరిగిన వెంటనే పాకిస్థాన్ రైల్వే సిబ్బంది, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బోగీల్లో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు కృషి చేశారు. గాయపడిన వారిని సమీపంలోని సుక్కూర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అధికారుల సమాచారం ప్రకారం, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
దాడి బాధ్యత వహించిన బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ
దాడి జరిగిన గంటల్లోపే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.. (BLA) ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థకు చెందిన బలోచ్ మిలిటెంట్లు గతంలో కూడా పలు రైల్వే, సైనిక స్థావరాలపై దాడులు జరిపారు. బలూచిస్థాన్ స్వతంత్రత కోసం సాయుధ పోరాటం చేస్తున్న ఈ సంస్థ పాకిస్థాన్ ప్రభుత్వంపై, సైనిక బలగాలపై నిరంతరం దాడులు కొనసాగిస్తోంది.
పాక్ భద్రతా వ్యవస్థకు పెద్ద సవాలు
ఇటీవలి నెలల్లో పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు మళ్లీ పెరిగాయి. కైబర్ పఖ్తున్వా, బలూచిస్థాన్, సింధ్ ప్రాంతాల్లో తీవ్రవాద సంస్థలు పాకిస్థాన్ ఆర్మీ, పోలీసులపై వరుస దాడులు చేస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా లోపాలు, స్థానిక అసంతృప్తి కారణంగా ఈ దాడులు మరింతగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రధాన మంత్రి ఆగ్రహం
పేలుడు ఘటనపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహ్‌బాజ్ షరీఫ్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాయపడిన వారికి తక్షణ వైద్యసహాయం అందించాలంటూ అధికారులను ఆదేశించారు. “దేశంలోని అభివృద్ధి, శాంతిని భగ్నం చేయాలని తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నా, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టం అని ఆయన తెలిపారు.
Also Read: నల్గొండలో ఇంటర్ విద్యార్ధిని దారుణ హత్య
రైల్వే సేవలకు అంతరాయం
ఈ దాడి కారణంగా జాఫర్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో రైల్వే రవాణా పూర్తిగా నిలిచిపోయింది. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. రైల్వే లైన్ పూర్తిగా దెబ్బతిందని, దాన్ని మరమ్మతు చేయడానికి కనీసం రెండు రోజులు పట్టవచ్చని పేర్కొన్నారు.