
INDIA alliance parties meeting updates(Political news telugu) :
మోదీ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాల కూటమి ఇండియా వ్యూహాలకు పదునుపెడుతోంది. దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికే తామంతా చేతులు కలిపామని కూటమి నేతలు మరోసారి స్పష్టం చేశారు. ముంబైలో గురువారం విపక్షాల సాధారణ సమావేశం జరిగింది. శుక్రవారం ఎన్నికల వ్యూహంపై చర్చించనున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏను ఓడించడమే ధ్యేయంగా స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు. సెప్టెంబర్ 30 నాటికి సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయానికి రావాలనే అభిప్రాయానికి వచ్చారు.
రెండోరోజు సమావేశంలో కూటమికి కన్వీనర్ నియామకంపై నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఎంపీ సీట్ల షేరింగ్‌పై సబ్ గ్రూపులను ఏర్పాటు చేయాలా అనే అంశంపై సమాలోచనలు జరపనున్నారు. కూటమి పార్టీలు ఉమ్మడిగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు, కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పనపై రెండో రోజు భేటీలో విపక్షాల నేతలు చర్చించనున్నారు.
తొలిరోజు సమావేశానికి 28 పార్టీలకు చెందిన 63 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారిలో పలువురు నేతలు ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అన్ని పార్టీల రాష్ట్ర కమిటీలూ సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేస్తాయి.
రెండోరోజు సమావేశం తర్వాత కూటమిలోని ప్రధాన పార్టీలకు చెందిన 11 మంది నేతలతో కో-ఆర్డినేషన్ కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. అలాగే కూటమి లోగోను ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.