
Sri lanka vs Bangladesh match highlights(Today’s sports news) :
ఆసియా కప్ లో శ్రీలంక శుభారంభం చేసింది. బంగాద్లేశ్ పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నజ్ముల్ హోస్సేన్ షాంటో (89, 122 బంతుల్లో 7 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయడంతో బంగ్లా ఆ మాత్రం స్కోర్ సాధించింది. మిగతా 10 మంది బ్యాటర్లు కలిపి 67 పరుగులు మాత్రమే చేశారు. 8 పరుగులు ఎక్సట్రాల రూపంలో వచ్చాయి. ఏడుగురు బ్యాటర్లు సింగ్ డిజిట్ కే పరిమితంకాగా.. అందులో ముగ్గురు డకౌట్ అయ్యారు.
శ్రీలంక బౌలర్ల ఆరంభం నుంచి బంగ్లాదేశ్ ను బెంబేలెత్తించారు. ఒకదశలో 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడింది. షాంటో పోరాటంతో కాస్త కోలుకున్నా చివరిలో మళ్లీ తడపడింది. రెండు పరుగుల వ్యవధిలో చివరి 4 వికెట్లను కోల్పోయింది. శ్రీలంక బౌలర్లలో మతీశ పతిరన 4 వికెట్లు, మహీశ్ తీక్షణ రెండు వికెట్లు తీశారు. ధనంజయ డిసిల్వా, దునిత్, శనక తలో వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే తడబడింది. 15 పరుగులకే ఓపెనర్లు కరుణరత్నే (1), పతున్ నిశ్సాంక (14) వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కుషాల్ మెండీస్ (5) కూడా తక్కువ స్కోర్ కే అవుట్ కావడంతో 43 పరుగులకు 3 వికెట్లు పడ్డాయి. ఈ దశలో సదీర సమరవిక్రమ (54), చరిత అసలంక (62 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేసి జట్టును విజయం దిశగా నడిపించారు. విజయానికి చేరువకులోకి వచ్చిన సమయంలో సమరవిక్రమ,ధనంజయ డిసిల్వా (2) అవుట్ కావడంతో మ్యాచ్ పై కాస్త ఉత్కంఠ రేగింది. అయితే అసలంక, కెప్టెన్ శనక (14 నాటౌట్) తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. దీంతో శ్రీలంక 39 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విక్టరీ సాధించింది. అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టిన పతిరనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఆసియా కప్ లో శనివారం కీలక మ్యాచ్ జరగనుంది. భారత్- పాకిస్థాన్ జట్లు శ్రీలంక వేదికగా తలపడనున్నాయి. ఇప్పటికే పాక్ తొలి మ్యాచ్ లో నేపాల్ పై భారీ విజయం సాధించి జోరుమీద ఉంది. భారత్ కు సవాల్ విసిరేందుకు దయాది జట్టు సిద్ధమైంది.