
Supreme court collegium news today(Telugu news updates): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన కొలీజియం ఈ సిఫార్సు చేసింది. సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. కానీ ప్రస్తుతం 31 మందే ఉన్నారు. 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అందువల్ల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నారు.
2011 అక్టోబర్ 17న గోహతి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2022 జూన్ 28 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భూయాన్ విభిన్న అంశాలపై అనుభవం సంపాదించారు. ఆయనకు ట్యాక్సేషన్ లాలో ప్రత్యేక నైపుణ్యం ఉంది. ఆయన తీర్పుల్లో చట్టం, న్యాయానికి సంబంధించి విస్తృత కోణాలను స్పృశించారు.
2013 ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ వెంకటనారాయణ భట్ బాధ్యతలు చేపట్టారు. 2019లో మార్చిలో జస్టిస్ భట్ కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2023 జూన్ 1 నుంచి కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయనకు న్యాయరంగానికి సంబంధించిన వివిధ శాఖల్లో అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసింది. సీనియారిటీలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తర్వాత జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్ పేరును ప్రతిపాదించింది.
జస్టిస్ వెంకటనారాయణ భట్ నియామకం పూర్తయితే సుప్రీంకోర్టులో సేవలందించే 3వ తెలుగు న్యాయమూర్తి అవుతారు. ప్రస్తుతం ఇద్దరు తెలుగువారు జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తులుగా ఉన్నారు.