Jharkhand Kalpana Soren| నవంబర్ 23న వెలువడిన రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో భారతీయ జనతా పార్టీ ఒకేసారి విజయం, ఓటమి.. రెండు రకాల రుచిని చూసింది. దేశంలోనే అత్యంత ధనిక రాష్ట్రమైన మహారాష్ట్రలో అనూహ్యంగా భారీ విజయం చేతికి అందగా.. మరోవైపు ఆదివాసీ రాష్ట్రం ఝార్ఖండ్‌లో మాత్రం బిజేపికి పరాభవం తప్పలేదు. ఝార్ఖండ్ లోని మొత్తం 81 అసెంబ్లీ సీట్లలో బిజేపీ కేవలం 21 సీట్లు మాత్రమే సాధించింది.
24 ఏళ్ల క్రితం బిహార్ రాష్ట్రం నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఝార్ఖండ్‌లో తొలిసారి ఒకే పార్టీ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ రికార్డ్ హేమంత్ సొరేన్ నాయకత్వంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎంఎం) పార్టీ సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సొరేన్ కు కాంగ్రెస్, రాష్ట్రీయ జనతా దల్ పార్టీల మద్దతు కూడా లభించడం గమనార్హం.
అయితే ఈ విజయాన్ని ఎవరూ ఊహించలేదు. రాజకీయ పండితులు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఝార్ఖండ్ ఎన్నికల్లో బిజేపీదే విజయం అని తేల్చి చెప్పాయి. కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే.. మొత్తం 81 సీట్లలో 56 సీట్లు ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఆర్‌జెడి, జెఎంఎం పార్టీలు సాధించాయి. 2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు వచ్చిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువగా వచ్చాయి.
కానీ ఈ విజయం అంత సునాయసంగా హేమంత్ సొరేన్‌కు లభించలేదు. సొరేన్ కు వ్యతిరేకంగా బలమైన భారతీయ జనతా పార్టీ నిలబడింది. పక్కలో బల్లెంలా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తరుచూ ఝార్ఖండ్ ప్రభుత్వంపై విరుచుకుపడతున్నారు. పైగా జనవరి 31 2024న ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సొరేన్ ను మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తన పార్టీలో సీనియర్ నాయకుడు చంపయి సొరేన్‌కు సిఎం పదవి కట్టబెట్టారు.
Also Read: Sanjay Raut: ‘మహారాష్ట్ర ఎన్నికల్లో అంతా మోసం.. అదానీ సాయంతోనే మహాయుతి గెలుపు’
అయిదు నెలల వరకు హేమంత్ సొరేన్ జైల్లోనే గడపాల్సి వచ్చింది. ఆయన బెయిల్ పై విడుదల అయి బయటికి వచ్చాక.. తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ అప్పటివరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న చంపయి సొరేన్ అసంతృప్తతో పార్టీని వీడి బిజేపీలో చేరారు. ఇది చాలదన్నట్లుగా హేమంత్ సొరేన్ సొంత వదిన సీతా సొరేన్ కూడా బిజేపీ కండువా కప్పుకున్నారు. హేమంత్ సొరేన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన పార్టీలోని కీలక ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవడానికి బిజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. ప్రజల్లో హేమంత్ సొరేన్ అవినీతి పరుడని ముద్ర వేయడానికి శత విధాలా ప్రయత్నిచింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ వద్ద ధన బలం, కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రయోగం.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రచారం.. ఇన్ని ఉన్నా.. చివరికి హేమంత్ సొరేన్ గెలుపు సాధించారు. ఆయనకు ఈ విజయం వరించడానికి ముఖ్యకారణం మహిళా శక్తి. ఆ శక్తి మరెవరో కాదు.. బిజేపీ తక్కువ అంచనా వేసిన హేమంత్ సొరేన్ భార్య కల్పనా సొరేన్. తన భర్త మనీ లాండరింగ్ కేసులో ఉన్నప్పుడు ఆమె రాష్ట్రంలో పరోక్ష శక్తిగా ఎదిగారు. ప్రజల్లో మమేకమై వారి సమస్యలు తీర్చడానకి నడుం బిగించారు. హేమంత్ సొరేన్ తన అన్నవాళ్ల అందరూ మోసం చేసినా.. ఆయన భార్య మాత్రం అండగా నిలబడింది. ఈసారి ఎన్నికల్లో కల్పనా సొరేన్ గండే నియోజకవర్గం నుంచి విజయం సాధించింది.
ఝార్ఖండ్ ఎన్నికలలో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్ యోజన (తల్లల సంక్షేమ పథకం)తో మహిళలు ఆయన పార్టీ వెనుకే నిలబడ్డారు. హేమంత్ సొరేన్ ఇచ్చిన ఆదివాసీ అస్మిత (ఆదివాసీల ఆత్మగౌరవం) నినాదం కూడా ఎన్నికల్లో బాగానే పనిచేసింది. దీంతో బిజేపీ మహా ప్రవాహాన్ని ఎదురుగా నిలబడ్డ హేమంత్ సొరేన్ కు తన ధైర్యంతో పాటు మహిళా శక్తి కూడా తోడైందనే చెప్పాలి.