Banakacherla Project: ఏపీ, తెలంగాణ జల జగడాలు ఈనాటివి కావు. ఏదో ఒక సమస్య అడ్డు తగులుతూనే ఉంది. నీటి యాజమాన్య బోర్డులు పరిష్కరించలేకపోతున్నాయి. అటు కేంద్రం కూడా చెక్ పెట్టడం లేదు. పాత వివాదాలు అలా రగులుతుండగానే.. తాజాగా బనకచర్ల బాంబు పేలింది. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంటే.. సముద్రంలో వృధా పోయే నీటినే తరలిస్తున్నామన్నది ఏపీ వాదన. ఇంతకీ నీటి పంపకాలపై శాశ్వత ప్రాతిపదికన నిర్ణయాలు ఉంటాయా?
గోదావరిలో వెయ్యి టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలకు పట్టు
రైట్ ఇదీ తెలంగాణ క్లియర్ కట్ సూచన. గోదావరిలో వెయ్యి టీఎంసీలు, కృష్ణా నదిలో 500 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకునేందుకు ఏపీ NOC ఇస్తే ఆ రాష్ట్రం కట్టుకునే ప్రాజెక్టులకు అడ్డు చెప్పబోం ఇదీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట. బట్ రెండు రాష్ట్రాలకూ వారి వారి ప్రయోజనాలు ఇంపార్టెంట్. అందుకే ఈ జల వివాదాలు తీరడం లేదు. కానీ ఒక మార్గముంది. అదేంటో డీకోడ్ చేద్దాం?
పంపకాలకు సరైన దారి లేకుండా పోయిందా?
ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటాలు పంపకం అంటే అదో పెద్ద సబ్జెక్టే. ఉన్నవి రెండు నదులే. కానీ సవాలక్ష సవాళ్లు, చిక్కుముడులు ఉన్నాయి. ఈ నీటి వాటాల చుట్టూ రాజకీయ అంశాలు, చట్టపరమైన విషయాలు, టెక్నికల్ ఇష్యూస్.. ఇవన్నీ సంక్లిష్టంగా ఉన్నాయి. ఒక్కటి కాదు రెండు కాదు.. తవ్వుతూ వెళ్తే అంతా సమస్యలే. ఒక్కదానికీ పరిష్కారం లేదు. బేసిన్లు, బేషజాలు అన్నీ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఒకరి ప్రతిపాదన మరొకరికి సెట్ కాదు. ఒకరు మీటింగ్ కు వెళ్తే మరొకరు వెళ్లరు. తగువు తీర్చాల్సిన కేంద్రం చొరవ చూపదు. రివర్ బోర్డ్ మేనేజ్ మెంట్ల చేతిల్లో సంపూర్ణ అధికారం లేదు. ఇదీ లేటెస్ట్ సిచ్యువేషన్. ఇప్పుడు బనకచర్ల వ్యవహారంతో పంచాయితీ ఢిల్లీ దాకా వెళ్లింది.
బర్నింగ్ సబ్జెక్ట్ గా మారిన బనకచర్ల
కృష్ణా, గోదావరి నదులు తెలంగాణ, ఏపీ మీదుగా ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలుస్తాయి. ఈ రెండు నదుల నీటి పంపకాలే గత కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయేలా చేశాయి. ఏపీ పునర్విభజన చట్టంలో క్లియర్ కట్ గా మ్యాటర్ ఉన్నా.. పంపకాలకు సరైన దారి లేకుండా పోయింది. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా సున్నితమైన పరిస్థితులు ఉన్నాయి. నీళ్ల చుట్టూ భావోద్వేగాలు ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలంటూ తెలంగాణ ఉద్యమం జరిగి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. అటు న్యాయమైన వాటా కావాలంటూ ఏపీ అంటోంది. ఆ రెండు నదులు తెలంగాణలోనే ఎక్కువ శాతం ప్రవహిస్తాయి కాబట్టి మెజార్టీ వాటా కావాలంటోంది. సో ఈ సమస్య అక్కడికే ఆగిపోయింది.
రూ. 80 వేల కోట్లతో ఏపీ బనకచర్ల ప్రాజెక్టు
సీన్ కట్ చేస్తే లేటెస్ట్ గా బనకచర్ల వ్యవహారం పెద్ద దుమారంగా మారిపోయింది. ఏపీ 80 వేల కోట్లతో గోదావరి బనకచర్ల ప్రాజెక్టును చేపట్టింది. దీనిద్వారా పోలవరం నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు 200 నుంచి 400 టీఎంసీ నీటిని సాగు, తాగునీటి కోసం మళ్లించాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు తెలంగాణకు గోదావరి, కృష్ణా నీటి వాటాలను తగ్గిస్తుందని, విభజన చట్టం సెక్షన్ 84, 85, 87ను ఉల్లంఘిస్తుందని ఆరోపిస్తోంది. పైగా ఈ ప్రాజెక్ట్ కు కేంద్రం 50శాతం నిధులు ఇవ్వడం, GRMB అనుమతి లేకుండా ముందుకు సాగడంపై తెలంగాణ తీవ్ర అసంతృప్తితో ఉంది. అటు ఏపీ మాత్రం వరద నీటినే వినియోగిస్తున్నామని తెలంగాణ హక్కులకు భంగం కలగదని వాదిస్తోంది. సీన్ కట్ చేస్తే జూన్ 18న తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర జలశక్తి మంత్రితో భేటీలు కూడా జరిపారు. బనకచర్ల వద్దే వద్దని వాదించారు.
సముద్రంలోకి వెళ్లే నీటినే తరలిస్తున్నామని కామెంట్లు
కాళేశ్వరం ఫెయిల్ అయిపోయిందని, నీళ్లు ఎత్తిపోసుకునే పరిస్థితి లేదని, అలాంటప్పుడు గోదావరి నీటికి అడ్డుకట్ట ఎక్కడిదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు గోదావరి బేసిన్‌పై 968 టీఎంసీలు.. కృష్ణా బేసిన్‌లో పరీవాహక ప్రాంతం ప్రకారం 555 టీఎంసీల నీళ్లు వస్తాయని, తాము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటామని, ఆ రెండింటికీ ఏపీ సీఎం NOC ఇచ్చి ఆ తర్వాత సముద్రంలోకి వెళ్లే నీటిని ఎంత తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదంటున్నారు.
బనకచర్లతో ఎవరికీ నష్టం లేదంటున్న చంద్రబాబు
అటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో బనకచర్లపై మాట్లాడారు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం ఉండదని, సముద్రంలోకి వెళ్లే నీటినే… కరువు ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఏనాడూ వ్యతిరేకించలేదని, గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టాలని, తెలంగాణలోని కరువు ప్రాంతాలకు కూడా గోదావరి నీటిని తరలించుకోవచ్చంటున్నారు. సో ఎవరి వెర్షన్ వారిదే. అయితే ఈ మొత్తం మ్యాటర్ లో మాట్లాడకపోతే రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం రెండువైపులా రాజకీయ పార్టీలకు కనిపిస్తోంది. అందుకే కథ చాలా దూరం వెళ్తోంది. పరిష్కారానికి మాత్రం రోడ్ మ్యాప్ ఏర్పడడం లేదు. ఇది కేంద్రంతోనే సాధ్యం.
రెండు రాష్ట్రాల మధ్య ఎన్నాళ్లీ జల జగడాలు?
సరిహద్దులు పంచుకునే అన్ని రాష్ట్రాలు, అంతెందుకు అన్ని దేశాల మధ్య కూడా జల జగడాలు ఉన్నాయి. కానీ ఇందులో పరిష్కారం అన్నదే చాలా కీలకం. ఏకాభిప్రాయం రావడం చాలా కష్టం. అలాంటప్పుడే కేంద్ర ప్రభుత్వం, రివర్ మేనేజ్ మెంట్ బోర్డులు చొరవ తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలి. పర్మినెంట్ రివర్ మేనేజ్ మెంట్ బోర్డులు ఏర్పాటు చేయాలి. మరి వాస్తవంగా ఏం జరుగుతోంది? రెండు రాష్ట్రాల మధ్య ఎన్నాళ్లీ జల జగడాలు?
కృష్ణా నుంచి 500 టీఎంసీల నీరు సముద్రంలోకి
కృష్ణా, గోదావరి నదుల నుంచి ఏటా సగటున సముద్రంలో ఎన్ని నీళ్లు కలుస్తున్నాయి.. ఈ ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు లేకపోయినా ఒక ఐడియా మాత్రం ఉంది. గోదావరి నది నుంచి ఏటా సగటున 2 వేల టీఎంసీలు, అలాగే కృష్ణా నుంచి యావరేజ్ గా 500 నుంచి వెయ్యి టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందన్న లెక్కలైతే ఉన్నాయి. అసలు సమస్యేంటో తెలుసా.. అసలు గోదావరి, కృష్ణా జలాలపై కచ్చితమైన లెక్కలు లేకపోవడమే. అన్నీ గాల్లో లెక్కలే. నికర జలాలు, వరద జలాలు, మిగులు జలాలెంతో అంతా ఓ కన్ఫ్యూజనే. ఇప్పటికీ తేలని మిస్టరీనే. అదే అసలైన ట్విస్టు. ఆ లెక్కలు తేలకుండానే వరద, నికర, మిగులు జలాలంటూ వాద ప్రతివాదాలు నడుస్తున్న పరిస్థితి.
విభజన చట్టంలో నీటివాటాలపై స్పష్టత లేక సమస్యలు
తెలుగు ప్రాంతాలు ఒక్క రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు 1956లో జెంటిల్‌మెన్స్ అగ్రిమెంట్ ద్వారా తెలంగాణకు నీటి వనరుల వినియోగంలో సమాన హక్కులు కల్పిస్తామని నాడు హామీ వచ్చింది. అయితే ఈ ఒప్పందం అమలు కాలేదన్నది తెలంగాణ నేతల ఆరోపణ. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నీటి వాటాలపై స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో వివాదాలు తీవ్రమయ్యాయి. రెండు రాష్ట్రాలు అనుమతులు లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాయని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి. కృష్ణా, గోదావరి ఈ రెండు నదులు తెలుగు రాష్ట్రాలకు చాలా కీలకం. తాగు, సాగు నీటి వనరులు కూడా ఇవే. కృష్ణా నది నీటి వాటాలపై 34:66 తాత్కాలిక ఒప్పందం. అయితే దీన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది.
కృష్ణా నది నీటి వాటాలపై 34:66 తాత్కాలిక ఒప్పందం
కృష్ణా నది నీటి వాటాలు, పంపకాలు, అభ్యంతరాలేంటో ఇప్పుడు చూద్దాం. బచావత్ ట్రిబ్యునల్ 1969 ప్రకారం కృష్ణా నదిలో 811 టీఎంసీ నీటిని నాటి ఉమ్మడి ఏపీకి కేటాయించింది. ఇందులో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల రేషియోలో విభజించారు. ఇది సాగు విస్తీర్ణం ఆధారంగా జరిగింది. విభజన తర్వాత 2015లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశంలో 34:66 రేషియోలో నీటి వాటాలపై తాత్కాలిక ఒప్పందం జరిగింది. దీనిని ప్రతి సంవత్సరం సమీక్షించాలని నాడు నిర్ణయించారు. అయితే తెలంగాణ మాత్రం 68.5 శాతం కృష్ణా బేసిన్ క్యాచ్‌మెంట్ ఏరియా తమ రాష్ట్రంలో ఉందని, 811 టీఎంసీలలో 555 టీఎంసీల నీళ్లు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. అటు ఏపీ మాత్రం.. తమకు ఇప్పటికే అభివృద్ధి చేసిన సాగు ప్రాంతాలు అంటే కమాండ్ ఏరియా సేఫ్టీ కోసం 66 శాతం వాటా కొనసాగాలని వాదిస్తోంది.
శ్రీశైలం, నాగార్జున సాగర్ నీటి వాడకంపై విమర్శలు, ప్రతివిమర్శలు
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు కాలువ ద్వారా ఏపీ రోజుకు 6-8 టీఎంసీల అదనపు నీటిని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం తీసుకుంటోందని, నాగార్జునసాగర్, శ్రీశైలం వంటి ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు తగిన నీరు అందడం లేదని, ఏపీ అనధికారంగా నీటిని ఉపయోగిస్తోందన్నది తెలంగాణ కంప్లైంట్. అటు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి హైడల్ పవర్ జనరేషన్ కోసం తెలంగాణ అనధికారంగా నీటిని వాడుతోందని ఇది ఏపీ సాగు, తాగునీటి అవసరాలను దెబ్బతీస్తోందన్నది ఆంధ్రా ప్రభుత్వ వాదన. వీటికి తోడు అపెక్స్ కౌన్సిల్ KRMB, GRMB అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నారని రెండువైపులా కంప్లైంట్స్ అలాగే ఉన్నాయి.
సముద్రంపాలయ్యే నీటినే బనకచర్లతో మళ్లింపన్న ఏపీ
ఇప్పుడు గోదావరి నది నీటి వాటాలు, పంపకాలు, అభ్యంతరాలేంటో చూద్దాం. బచావత్ ట్రిబ్యునల్ 1980 ప్రకారం గోదావరి నది నీటిని ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకలకు కేటాయించింది. విభజన చట్టంలో గోదావరి నీటి వాటాలపై స్పష్టత లేకపోవడంతో రెండు రాష్ట్రాల మధ్య అపనమ్మకం పెరిగింది. తెలంగాణ 968 టీఎంసీ గోదావరి నీటిపై చట్టబద్ధమైన హక్కు కోరుతోంది. అయితే గోదావరి నీళ్లు సముద్రంలోకి వృధాగా పోతున్నాయని, వీటిని బనకచర్ల, పోలవరం లాంటి ప్రాజెక్టుల ద్వారా ఉపయోగించుకోవచ్చని ఏపీ వాదిస్తోంది. ఏపీ పోలవరం-బొల్లెపల్లి జలాశయం నుంచి రాయలసీమకు 200-400 టీఎంసీ గోదావరి నీటిని మళ్లించే బనకచర్ల ప్రాజెక్టును చేపట్టిందని, ఇది తెలంగాణ జల హక్కులకు గండి కొడుతుందని, విభజన చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తుందని తెలంగాణ ఆరోపిస్తోంది. అటు కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి గోదావరి ప్రాజెక్టులను GRMB, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా తెలంగాణ చేపట్టిందన్నది ఏపీ ఆరోపణ.
విభజన చట్టం 2014 సెక్షన్ 85 ప్రకారం 2014లో KRMB
విభజన చట్టం 2014 సెక్షన్ 85 ప్రకారం 2014లో KRMB ఏర్పాటైంది. కృష్ణా నదిలో నీటి వినియోగం, ప్రాజెక్టుల నిర్వహణ, హైడల్ పవర్ జనరేషన్‌ను నియంత్రించడం దీని లక్ష్యం. 35 కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణను 2021 అక్టోబర్ 14 నుంచి చేపట్టింది. నీటి వాటాలపై ఎడతెగని పంచాయితీ నడుస్తూనే ఉంది. ఈ KRMBకి నీటి వాటాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం లేకపోవడం, అపెక్స్ కౌన్సిల్‌పై ఆధారపడటం, రెండు రాష్ట్రాలు చర్చలకు రెడీగా లేకపోవడం వంటి కారణాలతో ఆదేశాల అమలు కష్టంగా మారింది. అటు 2014లో విభజన చట్టం ద్వారా గోదావరి నది నీటి నిర్వహణ కోసం GRMB ఏర్పాటైంది. ఇది 71 గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్వహణను 2021 నుంచి చేపట్టింది. గోదావరిపై కొత్తగా చేపట్టిన ఏ ప్రాజెక్టుకైనా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరని ఆదేశించింది. తెలంగాణ లేటెస్ట్ గా కంప్లైంట్ చేసిన బనకచర్ల ప్రాజెక్టుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. సో గోదావరి నీటి వాటాలపై స్పష్టత లేకపోవడం, ట్రిబ్యునల్ లేని కారణంగా నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయి.
విభజన చట్టం 2014 సెక్షన్ 84 ప్రకారం అపెక్స్ కౌన్సిల్
రెండు రాష్ట్రాల మధ్య జలజగడాలు పెరుగుతుండడంతో కేంద్రం పోషించబోయే పాత్ర చాలా కీలకంగా మారుతోంది. విభజన చట్టం-2014 సెక్షన్ 84 ప్రకారం కేంద్ర జలశక్తి మంత్రి, రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలతో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. ఇది KRMB, GRMB నిర్వహణను పర్యవేక్షిస్తుంది. వివాదాలను పరిష్కరించాలి. 2016, 2020లో రెండు సమావేశాలు జరిగాయి. కానీ నీటి వాటాలపై ఎలాంటి తుది నిర్ణయం రాలేదు. కృష్ణా నదీ జల వివాదాల ట్రిబ్యునల్ – 2.. 2023లో తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా నీటి వాటాలను పరిశీలిస్తోంది. గోదావరి నీటి వాటాలపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఏపీ డిమాండ్ చేసినా ఇంకా కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. నిజానికి ఈ నీటి వాటాల పంపకం చాలా సున్నిత అంశంగా మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. అది ఏ రాష్ట్రానికి ఇబ్బందిగా ఉన్నా సమస్యలు తప్పవన్న ఆలోచన కనిపిస్తోంది. వ్యూహాత్మక రాజకీయ సంబంధాలు కూడా కీలకంగా మారుతున్నాయి.
రివర్ బోర్డులకు స్పష్టమైన అధికారాలు ఇవ్వాల్సిందేనా
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు తీరాలంటే కేంద్రం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అపెక్స్ కౌన్సిల్ ను తక్షణం యాక్టివేట్ చేయాలన్న సూచనలు వస్తున్నాయి. అపెక్స్ కౌన్సిల్ సమావేశాలను తరచూ నిర్వహించడం, నీటి వాటాలపై తాత్కాలిక ఒప్పందాలను సమీక్షించడం వంటివి చేయాలన్నారు. రివర్ బోర్డులకు నీటి వాటాలు, ప్రాజెక్టుల అనుమతులపై స్పష్టమైన అధికారాలు ఇవ్వాలన్న వాదన పెరుగుతోంది. ప్రస్తుతం బోర్డులు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, రాష్ట్రాలు పాటించకపోవడం కూడా సమస్యగా ఉందంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించి, సమన్వయం సాధించడం కేంద్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యం.
నీటివాటాలపై చట్టబద్ధ హక్కుల కల్పన ముఖ్యం
అంతే కాదు ఆర్టికల్ 262, ఇంటర్-స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్-1956ని సవరించి, శాశ్వత నీటి వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. సుప్రీం కోర్టు అప్పీలేట్ అధికారం కల్పించాలన్న సూచనలు ఉన్నాయి. కృష్ణా నదితో పాటు గోదావరి నీటి వాటాలపై కొత్త ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసి, రెండు రాష్ట్రాలకు చట్టబద్ధ హక్కులు కల్పించాలంటున్నారు. జల వివాదాల పరిష్కారానికి నిష్పక్షపాతంగా వ్యవహరించడం, పర్మనెంట్ ట్రిబ్యునల్, రివర్ బోర్డుల బలోపేతం, సమగ్ర నీటి విధానం రూపొందించడం వంటి చర్యలతో జగడాలకు పుల్ స్టాప్ పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
Story By Vidya Sagar, Bigtv Live