Kiran Kumar Reddy : తాజాగా బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి .. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ భేటీ జరిగింది. అక్కడే పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్పను కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు. ఇదే సమయంలో నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్, యడ్యూరప్ప, కర్ణాటక సీఎం బొమ్మై సమావేశమై కర్ణాటక ఎన్నికలపై చర్చించారు. ఈ సమావేశంలో కిరణ్ కుమార్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, అభ్యర్థుల ఖరారు, ప్రచారంపై చర్చించారని తెలుస్తోంది.
కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఆ రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు జయాపజయాలను నిర్ణయించగలరు. చాలా మంది తెలుగు వ్యక్తులు అక్కడ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. మంత్రులు కూడా అయ్యారు. ఈ నేపథ్యంలోనే కిరణ్ కుమార్‌రెడ్డికి కర్ణాటక ఎన్నికల్లో కీలక బాధ్యతలు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు బెంగళూరు కేంద్రంగా కిరణ్ కుమార్ రెడ్డి సేవలు వినియోగించుకోవాలని యోచిస్తోందని సమాచారం.
ప్రధాని మోదీ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రల్లో పర్యటన ముగించుకుని ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకుంటారు. ఆ తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ జరుగుతుంది. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పార్లమెంటరీ బోర్డు ఖరారు చేస్తుంది.
మరి కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రెస్ కు గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డికి ఎన్నికల్లో కీలక బాధ్యతలను అప్పగించాలని బీజేపీ అధిష్టానం యోచించడం ఆసక్తిని రేపుతోంది. మరి కిరణ్ కుమార్ రెడ్డి .. కర్ణాటకలోని తెలుగు ప్రజలను ఆకర్షిస్తారా..? వారి ఓట్లను బీజేపీకి పడేలా చేయడంలో సక్సెస్ అవుతారా..?