పండుగ సీజన్ లో ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా సౌత్ సెంట్రల్ రైల్వే తగిన చర్యలు తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 1,450 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మరో 500 పాసింగ్ ట్రూ స్పెషల్స్ ను నడపబోతున్నట్లు తెలిపింది. ముఖ్యమైన మార్గాల్లో దాదాపు 350 సాధారణ రైళ్లకు అదనపు కోచ్‌లను జోడించబోతున్నట్లు వివరించింది. ఈ రైళ్లు నవంబర్ చివరి వరకు సేవలు అందించనున్నట్లు తెలిపింది.
పండుగ సీజన్ లో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రత్యేక రైళ్లు హైదరాబాద్ లోని ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు కొనసాగించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, లింగంపల్లి, కాచిగూడ, చర్లపల్లి వంటి ప్రధాన స్టేషన్ల నుంచి బయలుదేరి, విశాఖపట్నం, తిరుపతి, రక్సౌల్, కొల్లం, దానపూర్, మైసూరు, బెంగళూరు, కాన్పూర్, హౌరా, భువనేశ్వర్, మధురై సహా ఎక్కువ డిమాండ్ ఉన్న గమ్యస్థానాలకు వెళ్లనున్నాయి.
అటు సికింద్రాబాద్ స్టేషన్ లో ప్రయాణీకుల హోల్డింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే CPRO ఎ. శ్రీధర్ వెల్లడించారు. సాధారణంగా రోజుకు ఇంచుమించు 2 లక్షల మంది ప్రయాణికులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రద్దీని నియంత్రించడానికి రైలు ప్లాట్ ఫామ్ మీదికి చేరుకున్న తర్వాతే స్టేషన్‌లోకి ప్రవేశించడానికి అనుమతి ఉంటుందన్నారు. రోజూ 40 వేల మంది వరకు ప్రయాణీకులు వచ్చే అవకాశం ఉన్న ఇతర ప్రధాన స్టేషన్లలో బారికేడ్ల సపోర్టుతో కంట్రోల్ చేయనున్నట్లు తెలిపారు. లోపలికి వచ్చే, బయటకు వెళ్లే ప్రయాణీకులను ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను ఉపయోగించి వేరు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్, గుంతకల్, విజయవాడ, గుంటూరు, నాందేడ్, ఇతర స్టేషన్లలోఈ పద్దతి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రయాణీకుల క్యూలు, జనసమూహ కదలికలను నియంత్రించడానికి RPF సిబ్బంది, టికెట్ తనిఖీ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. CCTV నిఘా, ప్లాట్ ఫారమ్‌లు, ఆన్ బోర్డ్ రైళ్లలో గరిష్ట ప్రయాణీకుల సంఖ్యను పర్యవేక్షించేందుకు డివిజనల్ మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Read Also: వామ్మో.. రైల్వే ట్రాక్ దగ్గర గొడుగు పట్టుకుంటే ఇంత డేంజరా? మీరు అస్సలు ఇలా చేయకండి!
ప్రయాణీకులకు సహాయం చేయడానికి ఎంక్వైరీ కమ్ ఫెసిలిటేషన్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే CPRO ఎ. శ్రీధర్ తెలిపారు. పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా తగినంత ఫుడ్ నిల్వ చేసుకోవాలని క్యాటరింగ్ స్టాల్ నిర్వాహకులకు సూచించారు. రియల్ టైమ్ రైల్వే అప్ డేట్స్, ప్లాట్ ఫామ్ సమాచారం, టికెట్ బుకింగ్, ఫుడ్ ఆర్డరింగ్, ఫిర్యాదుల నమోదు కోసం ప్రయాణీకులు రైల్ వన్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. రాబోయే దీపావళి, ఛత్ పండుగల సమయంలో కూడా ఈ చర్యలు అమలులో ఉంటాయని ఎ. శ్రీధర్ వెల్లడించారు.
Read Also: డ్రోన్ సాయంతో రైలు మొత్తాన్ని కడిగేశారు.. జస్ట్ అరగంటలోనే!