Kishan Reddy: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై విపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు, ఎగుమతిదారుల్లో అనవసర భయాందోళనలు కలిగించేందుకు రాహుల్ కుటిల ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. నెగటివ్ రాజకీయాల ద్వారా.. దేశ పురోగతిని వెనక్కు లాగేందుకు రాహుల్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. రాహుల్ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని, అందుకే అన్నదాతలు, ఎగుమతిదారులను తప్పుదోవ పట్టించేందుకు రాహుల్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఎప్పటికీ అంగీకరించరని కేంద్ర మంత్రి తెలిపారు.
Also Read: Hyderabad Drug Bust:10 కేజీల గంజాయి స్వాధీనం.. అంతర్ రాష్ట్ర పెడ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు!
ప్రస్తుతం భారత్ రూ.4 లక్షల కోట్ల విలువైన వస్త్రాలను ఎగుమతి చేస్తోందని, 38 అభివృద్ధి చెందిన దేశాల పరిధిలోని 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా రూ.45 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్ మార్కెట్‌కు అవకాశాలు ఏర్పడ్డాయని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్ టైల్ పార్కులను అభివృద్ధి చేస్తోందని, ఇందులో ఒకటి తెలంగాణలోని వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ పేరుతో డెవలప్ అవుతోందని కేంద్ర మంత్రి వివరించారు. అమెరికా, ఇతర దేశాలతో కుదురుతున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల కారణంగా ఎగుమతులు గణనీయంగా పెరిగి, వేల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.
దీని వల్ల తెలంగాణకు కూడా పెద్దమొత్తంలో లబ్ధిచేకూరనుందన్నారు. తెలంగాణ అభివృద్ధి చెందడం, ఇక్కడి యువతకు ఉద్యోగాలు రావడం రాహుల్ గాంధీకి ఇష్టంలేదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఒకవైపు వస్త్ర పరిశ్రమ ఎగుమతిదారులను, మరోవైపు పత్తి డిమాండ్ తగ్గుతుందని రైతులను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి ఫైరయ్యారు. వాస్తవమేంటంటే.. భారత వస్త్ర పరిశ్రమ రంగంలో విస్తారమైన వృద్ధి అవకాశాలు ఉన్నందున భారత పత్తికి డిమాండ్ నిరంతరం పెరుగుతుందని, దీని ద్వారా రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని, కాబట్టి భారతీయ పత్తి రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి స్పష్టంచేశారు.
దేశ అన్నదాతల విషయంలో అన్యాయంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలని విమర్శించారు. ఇప్పటివరకు వరుసగా 100 ఎన్నికల్లో వరుస పరాజయాల తర్వాత రాహుల్ గాంధీ నిరాశ, నిస్పృహలతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు. ప్రధాని మోడీపై ఉన్న వ్యతిరేకతను దేశంపై వ్యతిరేకతగా రాహుల్ మలుచుకున్నారని ఫైరయ్యారు. అందుకే.. 11 ఏళ్లుగా దేశం సాధిస్తున్న ప్రగతిని చూసి జీర్ణించుకోలేక, అధికారం దక్కదన్న అసహనంతో.. దేశంలో అన్నదాతలను, ఎగుమతిదారులను రెచ్చగొట్టేందుకు విఫలయత్నం చేస్తున్నారని, వీటిని కూడా ప్రజలు తిప్పికొడతారని కిషన్ రెడ్డి తెలిపారు.